హాంకాంగ్‌‌‌‌: గోరీలకు జాగ లేదు

హాంకాంగ్‌‌‌‌: గోరీలకు జాగ లేదు

భూమి లేక జనాల తిప్పలు

హాంకాంగ్‌‌‌‌లో ఓ కొండ. దాని చుట్టూ ఒకదాని పక్కన ఒకటి సమాధులు. వాటితో మొత్తం కొండే నిండిపోయింది. అంతలా ఒకే చోట సమాధులు కట్టడానికి కారణమేంటంటారు? ఆ సిటీలో స్పేస్‌‌‌‌ లేకపోవడం. ఖాళీ ప్రదేశం కొనాలనుకున్నా ధరలు ఎక్కువుండటం. 75 లక్షల మంది ఉంటున్న హాంకాంగ్‌‌‌‌ ప్రపంచంలోనే చాలా ఖరీదైన నగరం. అక్కడ నివసించాలంటే డబ్బును నీళ్లలా ఖర్చు చేయాల్సిందే. ఇండ్లు, ఫ్లాట్లు, ప్లాట్లు.. ఏది కొనాలన్నా డబ్బులు కుమ్మరించాల్సిందే. బతికున్నపుడు ఉండేందుకు ప్లేస్‌‌‌‌ కోసం ఎంతలా తండ్లాడాలో చనిపోయాక సమాధికి అంత కష్టపడాల్సిన పరిస్థితి అక్కడ. అందుకే స్పేస్‌‌‌‌ లేకే కొండ చుట్టూ అలా సమాధులు కట్టేశారు.

పర్మనెంట్‌‌‌‌ సమాధికి రూ.25 లక్షలు

హాంకాంగ్‌‌‌‌లో ప్రైవేట్‌‌‌‌ స్పేస్‌‌‌‌లో పర్మనెంట్‌‌‌‌ సమాధికి రూ.25 లక్షల ఖర్చవుతుంది. ఈ ప్లేసు కూడా ఇప్పుడు దొరకట్లేదనుకోండి. టెంపరరీ పబ్లిక్‌‌‌‌ ప్రాంతాలే ఉన్నాయి. అవి కాస్త తక్కువ ధరకే దొరుకుతాయి. ఆరేళ్లకోసారి ఆ ప్లేస్‌‌‌‌ను వేరే వారికి ఇస్తుంటారు. ఇంతలా రేట్లు పెట్టలేక ఆ నగర ప్రజలు చనిపోయిన వారిని దహనం చేస్తున్నారు. అక్కడ కూడా ఇబ్బందే. దహనం చేశాక అస్థికలను పెట్టే ప్లేస్‌‌‌‌కు ప్రజలు కష్టపడాల్సి వస్తోంది. ఒక్కో గది కోసం ఏడేండ్ల దాకా వేచి చూడాల్సి వస్తోంది. స్పేస్‌‌‌‌ లేక కొందరు జనాలు జపాన్‌‌‌‌ వర్చువల్‌‌‌‌ సమాధుల బాట పడుతున్నారు. సింగపూర్‌‌‌‌లోనూ ఇలాంటి పరిస్థితే. దీంతో అక్కడ బిల్డింగులు కట్టేందుకు చాలా సమాధులను తొలగిస్తున్నారు.

మారుతున్న ఆచారాలు, పద్ధతులు

వర్చువల్‌‌‌‌ సమాధుల రాకతో ప్రజల ఆచారాలు, పద్ధతులు మారుతున్నాయి. సరైన ప్లేస్‌‌‌‌ లేక ఆచారాలను దూరం పెట్టాల్సిన పరిస్థితి వస్తోంది. చైనా సంప్రదాయం ప్రకారం చనిపోయిన వారి సమాధిని కొండపై సముద్రానికి అభిముఖంగా కట్టాలి. అసలు భూమే లేకపోవడంతో చనిపోయిన వారి అస్థికలను హాంకాంగ్‌‌‌‌ ప్రజలు ఇంట్లోనే పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది వాళ్ల సంప్రదాయానికి విరుద్ధమైనా తప్పడం లేదు. దూరంగా ఉన్న సమాధి వద్దకు వెళ్లడం కన్నా ఇంట్లోనే కావాల్సినప్పుడు వాళ్లను స్మరించుకోవచ్చని, చాలా వరకు ఇదే మంచిదని వాళ్లు అంటున్నారు.