గ్రేటర్ హైదరాబాద్ లో 2014కు ముందున్న చెరువులెన్ని? : డిప్యూటీ సీఎం భట్టి

గ్రేటర్ హైదరాబాద్ లో 2014కు ముందున్న చెరువులెన్ని? : డిప్యూటీ సీఎం భట్టి
  • ఇప్పుడు ఎన్ని ఉన్నాయి?: డిప్యూటీ సీఎం భట్టి
  • ఐదు రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ప్రణాళిక శాఖ నివేదికలను రూపొందించడంలో పారదర్శకంగా వ్యవహరించాలని డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. జంట నగరాల్లో 2014కు ముందు ఉన్న చెరువులు, నీటి కుంటలు ఎన్ని? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఎన్ని చెరువులు అన్యాక్రాంతమయ్యాయి? ప్రస్తుతం చెరువుల పరిస్థితి ఏంటి? అన్న దానిపై ఐదు రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి ప్రణాళిక శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాలపై భట్టి విక్రమార్క సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆలోచనా సరళికి అనుగుణంగా రాష్ట్రాన్ని అద్భుత సంక్షేమ రాజ్యాంగా తీర్చిదిద్దే ప్రణాళికలు.. ప్లానింగ్​శాఖ నుంచే పుట్టుకురావాలని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రణాళిక శాఖ కీలకమని చెప్పారు. ప్లానింగ్ శాఖ రూపొందించే ప్లాన్లు అభివృద్ధికి దిక్సూచి అవుతాయన్నారు. గణాంకాలను వాస్తవాలకు దగ్గరగా రూపొందించాలని సూచించారు. ప్రభుత్వ పథకాల అమలు ద్వారా సమాజంలో వస్తున్న మార్పులను శాస్త్రీయంగా అంచనా వేయాలన్నారు. ప్రణాళిక శాఖ అధికారులు నిర్వహిస్తున్న విధులు, రూపొందించే ప్రణాళికలు, సేకరించే గణాంకాల వివరాలను స్పెషల్ సీఎస్ రామకృష్ణా రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డైరెక్టర్ జి.దయానందం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇంజినీర్ల సమస్యను పరిష్కరిస్తా

విద్యుత్‌‌‌‌‌‌‌‌, ఇతర శాఖల్లోని బీసీ ఇంజినీర్ల సమస్యలను పరిష్కరిస్తానని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం తెలంగాణ బ్యాక్ వర్డ్ క్లాస్ ఇంజినీర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ దేవళ్ల సమ్మయ్య, జనరల్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ సతీశ్​ కొట్టే, వైస్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ జానకీ రామ్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం డిప్యూటీ సీఎం భట్టిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సమస్యలను వారు డిప్యూటీ  సీఎం దృష్టికి తీసుకువచ్చారు.