హుస్నాబాద్‌‌‌‌ను కరీంనగర్‌‌‌‌లో కలపడం ఖాయం : మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌

హుస్నాబాద్‌‌‌‌ను కరీంనగర్‌‌‌‌లో కలపడం ఖాయం : మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌

    సర్వేల ఆధారంగానే మున్సిపల్‌‌‌‌ టికెట్లు : మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌

హుస్నాబాద్, వెలుగు : ‘గత ప్రభుత్వ హయాంలో హుస్నాబాద్‌‌‌‌ను బలవంతంగా సిద్దిపేటలో కలిపారు. ప్రజల ఇబ్బందులను తొలగించడంతో పాటు రిటైర్డ్‌‌‌‌ జడ్జి నివేదిక ఆధారంగా హుస్నాబాద్‌‌‌‌ను తిరిగి కరీంనగర్‌‌‌‌లో కలుపుతాం. పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌‌‌‌రెడ్డి ఇచ్చిన హామీని నెరవేరుస్తాం’ అని మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌ స్పష్టం చేశారు. 

ఆదివారం హుస్నాబాద్‌‌‌‌ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రాజకీయాలకతీతంగా అర్హులైన ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ హయాంలో పేదలకు ఒక్క ఇల్లు కూడా కట్టించలేదని విమర్శించారు. 

తాము అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే నియోజకవర్గానికి 3,500 ఇండ్లను మంజూరు చేశామని, తాజాగా హుస్నాబాద్‌‌‌‌ పట్టణంలో 372 మందికి మంజూరు పత్రాలు అందజేస్తామని చెప్పారు. ఇండ్లు మంజూరు అయిన వారు వెంటనే నిర్మాణాలను ప్రారంభించుకోవాలని సూచించారు. హుస్నాబాద్‌‌‌‌లో 250 పడకల హాస్పిటల్‌‌‌‌, ఇంజినీరింగ్‌‌‌‌ కాలేజీ, పీజీ సెంటర్‌‌‌‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 

కరీంనగర్‌‌‌‌ నుంచి ఫోర్‌‌‌‌ లైన్‌‌‌‌ రోడ్డు నిర్మాణ పనులు స్పీడ్‌‌‌‌గా సాగుతున్నాయని, గౌరవెల్లి ప్రాజెక్ట్‌‌‌‌ను పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. మున్సిపల్‌‌‌‌ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తిగా సర్వేల ఆధారంగానే ఉంటుందని, వార్డుల్లో తిరుగుతూ ప్రజలకు చేరువైన వారికే టికెట్లు దక్కుతాయని స్పష్టం చేశారు.  కార్యక్రమంలో కలెక్టర్‌‌‌‌ కె.హైమవతి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌‌‌‌ లింగమూర్తి, మార్కెట్‌‌‌‌ కమిటీ చైర్మన్‌‌‌‌ తిరుపతిరెడ్డి, ఆర్డీవో రామ్మూర్తి, మున్సిపల్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ మల్లికార్జున్‌‌‌‌, డీఆర్డీవో జయదేవ్‌‌‌‌ పాల్గొన్నారు.