
- ఫుట్‌పాత్‌లతో పాటు రోడ్లపై సైతం తోపుడు బండ్లు
- మరికొన్ని చోట్ల యధేచ్చగా వెహికల్ పార్కింగ్
- ఇబ్బంది పడుతున్న వాహనదారులు, పాదచారులు
హైదరాబాద్, వెలుగు: సిటీ రోడ్లపై ప్రయాణం మరింత ఇబ్బందిగా మారుతోంది. ఇప్పటికే రోడ్లు మొత్తం వెహికల్స్‌తో నిండిపోతుండగా..ఫుట్‌పాత్‌లతోపాటు రోడ్లను ఆక్రమించుకుని స్ట్రీట్ వెండర్ల తోపుడు బండ్లు కనిపిస్తున్నాయి. జంక్షన్లతో పాటు మెయిన్ రోడ్లు, కాలనీ రోడ్లనే తేడా లేకుండా ఎక్కడికక్కడ తోపుడు బండ్లు, రోడ్ల పక్కన ఆటో ట్రాలీలు ఎక్కువవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో రోడ్లపైనే వెహికల్స్‌ను పార్కింగ్ చేస్తున్నారు. వీటి కారణంగా రోడ్లు సగం వరకు ఆక్రమణకు గురవుతుండటంతో ఆయా మార్గాల్లో ప్రయాణించేవారు, నడుచుకుంటూ వెళ్లేవారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.
రోడ్లపైనే వ్యాపారాలు..
సిటీలో దాదాపు 90 శాతం ఏరియాల్లో ట్రాఫిక్ కష్టాలున్నాయి. అమీర్‌పేట్, ఎర్రగడ్డ, పంజాగుట్ట, ఖైరతాబాద్ సర్కిల్, లక్డీకపూల్, అసెంబ్లీ, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, మెహిదీపట్నం, కూకట్‌పల్లి, తార్నాక ఇలా ఏ ఏరియా అయినా అడుగడుగునా రద్దీనే కనిపిస్తోంది. ఇలాంటి రద్దీగా ఉండే రోడ్ల మీదనే స్ట్రీట్ వెండర్ల వ్యాపారాలు కొనసాగుతుండటం, వెహికల్స్ పార్క్ చేస్తుండటంతో సమస్య మరింత తీవ్రతరం అవుతోంది.
కాలనీల్లోనూ అదే సమస్య..
మెయిన్‌రోడ్లే కాదు కాలనీ రోడ్లలోనూ అదే సమస్య ఎదురవుతోందని సిటిజన్లు పేర్కొంటున్నారు. రోడ్ల పక్కనే ట్రాలీలు, తోపుడు బండ్లతో పాటు రోడ్లకు ఇరువైపులా వీక్లీ మార్కెట్లు జరుగుతుండటంతో రోడ్డుపై నడవలేని పరిస్థితులు నెలకొన్నాయని జనం వాపోతున్నారు. కాలనీల్లో మార్కెట్ల ఏర్పాటు వల్ల ఇబ్బందులు పడుతున్నామని, వాటిని ఓపెన్ ప్లేసుల్లో నిర్వహించాలని కోరుతున్నారు.
రోడ్డు మధ్యలో నుంచి నడవాల్సి వస్తోంది
ఫిల్మ్‌నగర్ లోని ఓ స్టోర్‌లో పనిచేస్తున్నా. రోడ్ల మీదనే వెహికల్స్ పార్క్ చేసి ఉండటం వల్ల రోడ్డు మధ్యలో నుంచి నడవాల్సి వస్తోంది. దీనివల్ల ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయపడాల్సిన పరిస్థితి. అధికారులు ఇలాంటి సమస్యలపై దృష్టిపెట్టాలి. – కల్యాణి, ఫిలింనగర్
రోడ్ సైడ్ బండ్ల వల్ల..
సిటీలో చాలా చోట్ల రోడ్ల మీదనే ఆటో ట్రాలీలు, తోపుడు బండ్లు పెడుతున్నరు. కార్నర్ మీద లెఫ్ట్, రైట్‌లు తీసుకునేటప్పుడు వీటి వల్ల ఎదురుగా వచ్చే వెహికల్స్ కనిపిస్త లేవు. ఏరియాకు ఓ స్ట్రీట్ వెండర్స్ స్పేస్ ఏర్పాటు చేస్తే ఈ సమస్య తగ్గుతుంది.–ప్రకాశ్, కూకట్‌పల్లి