దుప్పట్లు, స్వెట్టర్లు తీయండి : హైదరాబాద్లో చలి బాగా పెరుగుతుంది

దుప్పట్లు, స్వెట్టర్లు తీయండి : హైదరాబాద్లో చలి బాగా పెరుగుతుంది

చలికాలం ముందుగానే వచ్చేసింది.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో గణనీయంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి.. గత రెండు రోజులుగా ఈ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. వాస్తవానికి నవంబర్ ప్రారంభంలో వింటర్ సీజన్ ప్రారంభం కానుండగా.. ముందుగానే వచ్చిందా అన్నట్లుగా చలి పెరిగిపోతోంది.  మంగళవారం రాత్రి  (అక్టోబర్ 24)  రోజువారీ కనిష్ట ఉష్ణోగ్రత 4 డిగ్రీలు తగ్గింది. 

రంగారెడ్డి జిల్లాలో 4 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గి 12.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది. దీంతో అటు రంగారెడ్డి జిల్లా ప్రజలు, హైదరాబాద్ నగర ప్రజలు బీరువాల్లో భద్ర పరిచిన దుప్పట్లు, స్వెటర్లను బయటకు తీస్తున్నారు. లేని వారు కొత్తగా కొనుగోలు చేసేందుకు షాపులకు వెళ్తున్నారు..  

చలికాలం రాకముందే హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 18 డిగ్రీలకు పడిపోయాయి. తెలంగాణ వ్యాప్తంగా గత వారం సరాసరి కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీలకు పడిపోయిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక్రిశాట్ ప్రకారం.. 4 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గి కనిష్ట ఉష్ణోగ్రత 14.2 డిగ్రీలకు పడిపోయింది. హైదరాబాద్ లో కూడా కనిష్ట ఉష్ణోగ్రత 17 నుంచి 14 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉందని నిపుణులు చెపుతున్నారు.

అయితే పగటి పూట ఉష్ణోగ్రతల్లో మాత్రం పెరుగుదల కనిపిస్తోంది. మంగళవారం ( అక్టోబర్ 24)సాధారణ ఉష్ణోగ్రత కంటే 1 డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగి 32.4 డిగ్రీలకు చేరింది. గత వారం హైదరాబాద్ లో అత్యధికంగా 34.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. 

అయితే ఈ ఉష్ణోగ్రతలో మార్పులకు కారణం.. రాష్ట్రంలో ఉత్తర గాలుల ప్రభావం.. ప్రస్తుతం తెలంగాణలో ఈశాన్య గాలులు వీస్తున్నాయి.. దీంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయని ఐఎండీ పేర్కింది.