ఆవిరి రైలు మళ్లీ కూత పెట్టింది

ఆవిరి రైలు మళ్లీ కూత పెట్టింది

పాత కాలంలో రైలు అనంగనే గుర్తొచ్చేది బొగ్గు బండి. బొగ్గును మండించి ఆవిరితో నడిపేటోళ్లు. అందుకే దానికి స్టీమ్​ ఇంజన్​ అన్న పేరూ ఉంది. కాలం మారిపాయె.. టెక్నాలజీ పెరిగిపాయె.. స్టీమ్​ బండ్లు మరుగున పడె. ఇప్పుడంతా డీజిల్​ బండ్లు, కరెంట్​ బండ్లు నడుస్తున్న కాలం. ఫలితంగా కాలుష్యం పెరిగి భూమి వేడెక్కుతోంది. ఆ ట్రెండ్​లో మార్పు తీసుకురావాలని నిర్ణయించుకున్న బ్రిటన్​.. మళ్లీ పాతకాలానికి వెళ్లిపోయింది. స్టీమ్​ రైలును తీసుకొచ్చింది. విజయవంతంగా దానిని పరీక్షించింది. అప్పుడు, ఇప్పుడూ ఒక్కటే తేడా. అప్పట్లో ఆ రైలు బొగ్గుతో నడిస్తే.. ఇప్పట్లో ఈ రైలు హైడ్రోజన్​తో నడుస్తుందన్నమాట. అందుకే ఆ రైలుకు ‘హైడ్రోఫ్లెక్స్​’ అని పేరు పెట్టారు. లండన్​లోని పోర్టర్​బ్రూక్​ అనే సంస్థ యూనివర్సిటీ ఆఫ్​ బర్మింగ్​హాం సాయంతో ఈ హైడ్రోఫ్లెక్స్​కు రూపునిచ్చింది.

గురువారం దీని ప్రొటోటైప్​ను వార్విక్​షైర్​లోని లాంగ్​ మార్స్​టన్​ ట్రాక్​పై రైల్వే అధికారులు విజయవంతంగా పరీక్షించారు. ఆ టెస్టులో వందకు వంద మార్కులు కొట్టేసింది హైడ్రోఫ్లెక్స్​. ఇది పొగకు బదులు నీటి ఆవిరిని పైకి వెదజల్లుతుంది. కాబట్టి, కాలుష్యం అన్న మాటే ఉండదు. తొలి టెస్టులో భాగంగా రైల్లోని అన్ని సిస్టమ్​లను చెక్​ చేశారు. అందులో వాడిన ప్రతి ఒక్క భాగాన్ని విడివిడిగా పరీక్షించి పరిశీలించారు. ప్రస్తుతం బ్రిటన్​ వద్ద ఉన్న క్లాస్​ 319 రైళ్లలో కొత్త టెక్నాలజీని వాడి ప్రొటో టైప్​ను తయారు చేశారు. ఆ ఒక్క రైళ్లకు మాత్రమే కాకుండా పాత, కొత్త అన్న తేడా లేకుండా ఏ రైళ్లకైనా ఆ టెక్నాలజీని వాడుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. కొత్త రైళ్లలో ఈ టెక్నాలజీ వాడాలనుకుంటే పాత రైళ్లను రీసైకిల్​ చేసి కూడా ఈ టెక్నాలజీ పెట్టి కొత్త రైలుగా మార్చొచ్చని వివరిస్తున్నారు. రైలు టాప్​లో హైడ్రోజన్​ ఫ్యూయెల్​ సెల్స్​ ఉంటాయి. వాటితో పాటు ఎక్కువ ఒత్తిడి ఉండే నాలుగు హైడ్రోజన్​ ఫ్యూయెల్​ ట్యాంకులుంటాయి. ఒక్కో ట్యాంకులో 20 కిలోల వరకు హైడ్రోజన్​ పడుతుంది. వాతావరణంలోని ఆక్సిజన్​ను హైడ్రోజన్​తో ఫ్యూయెల్​ సెల్స్​ అనుసంధానించడం ద్వారా కరెంట్​ పుడుతుంది. దీంతో రైలు ముందుకు కదులుతుంది. నీటి ఆవిరి బయటకు వస్తుంది. సో కాలుష్యం ఉండదు. ఒక్కో ట్యాంకు ఇంధనంతో దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరం ప్రయాణించొచ్చట.

ఇంకో కంపెనీ కూడా
బ్రిటన్​లో పర్యావరణ హిత రైలు ఇంజన్లను పోర్టర్​బ్రూక్​ ఒక్కటే కాదు, మరికొన్ని కంపెనీలూ తయారు చేస్తున్నాయి. ఫ్రాన్స్​కు చెందిన ఆల్​స్టమ్​ అనే కంపెనీ దాదాపు 100 పర్యావరణ హిత ఇంజన్లను తయారు చేస్తోంది. ఇది నడిచేటప్పుడు కనీసం శబ్దం కూడా వినిపించదట. అందుకే దీనికి ‘బ్రీజ్​’ అని పేరుపెట్టినట్టు సమాచారం. ఆ రైలు గంటకు 140 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతుందని చెబుతున్నారు. జర్మనీలో ఇలాంటి రైళ్లపైనే పనిచేసిన ఎవర్​షోల్ట్​ రైల్​ అనే సంస్థతో కలిసి ఆల్​స్టమ్​ పనిచేస్తోంది. బ్రిటన్​లోని కొన్ని ప్రాంతాల్లో 2021కల్లా ఈ రైళ్లు పట్టాలపై పరుగులు తీస్తాయని ఆల్​స్టమ్​ ప్రకటించింది.