
- ఈ విధానంతో మేం విభేదిస్తున్నం : మమతా బెనర్జీ
కోల్కతా : వన్ నేషన్.. వన్ ఎలక్షన్కు తాను వ్యతిరేకమని వెస్ట్ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) చీఫ్ మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఇది రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణాన్ని తారుమారు చేసేలా ఉందని, ప్రజాస్వామ్యంలో నిరంకుశ పాలనను అనుమతించే వ్యవస్థగా రూపొందుతుందని ఆమె పేర్కొన్నారు. తాను నిరంకుశత్వానికి వ్యతిరేకమని, అందుకే ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నానని మమత పేర్కొన్నారు. వన్ నేషన్.. వన్ ఎలక్షన్ అధ్యయనంపై ఏర్పాటు చేసిన మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ కార్యదర్శి నితేన్ చంద్రకు గురువారం ఆమె లేఖ రాశారు.
వివిధ రాష్ట్రాలకు ఇప్పుడు వేర్వేరు ఎన్నికల క్యాలెండర్లు ఉన్నాయని, అవి కూడా రాజకీయ పరిణామాల కారణంగా మార్పులకు గురవుతాయన్నారు. అన్ని రాష్ట్రాలు ఐదేండ్ల పదవీ కాలాన్ని పూర్తిచేయకముందే ఈ విధానం కోసం ఆ రాష్ట్రాల్లో బలవంతంగా ఎన్నికలు నిర్వహించడం కరెక్ట్కాదని ఆమె అభిప్రాయపడ్డారు. 1952 నుంచి 1967 వరకు లోక్సభ, అసెంబ్లీలకు ఒకే టైంలో ఎన్నికలు జరిగాయని, ఆ తర్వాత కేంద్రంతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలు ముందస్తుకు వెళ్లడంతో ఆ విధానం ఆగిపోయిందని ఆమె గుర్తుచేశారు. ఈ క్రమంలో తాము ఈ విధానాన్ని విభేదిస్తున్నట్టు మమత లేఖలో పేర్కొన్నారు.