అమెరికా - కెనడా సరిహద్దుల్లో భారత కుటుంబం దుర్మరణం

అమెరికా - కెనడా సరిహద్దుల్లో భారత కుటుంబం దుర్మరణం

కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే ప్రయత్నంలో ఓ భారతీయ కుటుంబం దుర్మరణం పాలైంది. జనవరి 19న కెనడా అమెరికా సరిహద్దుకు సమీపంలోని మానిటోబోలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతులను గుజరాత్‌కు చెందిన జగదీష్ బల్దేవ్ భాయ్ పటేల్ (39), వైశాలి బెన్ (37), విహంగీ (11), ధార్మిక్ (3) గా గుర్తించారు. కెనడాలోని భారత హై కమిషన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం జనవరి 19న అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే ప్రయత్నంలో ఈ నలుగురు దుర్మరణం పాలయ్యారు. అధికారులు సరిహద్దుకు 40 అడుగుల దూరంలో వీరి మృతదేహాలను కనుగొన్నారు. తీవ్రమైన మంచు తుఫానులో చిక్కుకుపోవడం వల్లే వారంతా మరణించినట్లు చెప్పారు.

కెనడా నుంచి అమెరికాకు నిత్యం వందలాది మంది అక్రమంగా వలస వస్తుంటారు. ఈ అక్రమ వలసల్ని అరికట్టేందుకు అమెరికా అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవలే ఇద్దరు ఇండియన్లను అక్రమంగా యూఎస్ తీసుకొచ్చిన కేసులో స్టీవ్ శాండ్ అనే వ్యక్తిని పోలీసులు జనవరి 19న అరెస్ట్ చేశారు. అదే రోజున రాయల్ కెనడియెన్ మౌంటెడ్ పోలీసులు సరిహద్దుల్లో ఈ నలుగురి మృతదేహాలను కనుగొన్నారు. మంచులో కూరుకుపోయి దారణమైన స్థితిలో ఉన్న ఆ మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్ కు తరలించారు. అనంతరం చేపట్టిన దర్యాప్తులో వారిని భారతీయులుగా గుర్తించారు. సరిహద్దు ప్రాంతానికి చేరుకునే ముందు ఆ కుటుంబం కెనడాలోని పలు ప్రాంతాల్లో సంచరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. 

జనవరి 12న టొరంటో చేరుకున్న జగదీశ్ కుటుంబం.. 18న సరిహద్దుకు బయల్దేరిందని కెనడా పోలీసులు ధ్రువీకరించారు. దీని వెనుక మానవ అక్రమ రవాణా ముఠా ఉండి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. పటేల్ కుటుంబం మృతిని కెనడాలోని భారత హై కమిషన్ ధ్రువీకరించింది. ఇప్పటికే మృతుల కుటుంబాలకు సమాచారం అందించిన అధికారులు మృతదేహాలను భారత్ కు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. 

For more news..

ఇప్పుడంతా ఓటీటీల మాయ..

పంజాబ్ బార్డర్‎లో పాక్ స్మగ్లర్ల అరెస్ట్