
- యూఎస్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నది: రష్యా
- ఆర్థిక వ్యవస్థలను ఆయుధంలా వాడుతున్నది
- భారత ఉత్పత్తులు అమెరికా వద్దంటే మాకు పంపండి
- భవిష్యత్తులోనూ ఇంధన బంధం కొనసాగిస్తమని వెల్లడి
మాస్కో: తమ దేశంనుంచి క్రూడాయిల్ కొనుగోలు విషయంలో భారత్‌పై అమెరికా ఆంక్షలు అన్యాయమని రష్యా పేర్కొన్నది. యూఎస్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నదని మండిపడింది. భవిష్యత్తులోనూ భారత్‌తో ఇంధన బంధం కొనసాగిస్తామని స్పష్టంచేసింది. రష్యా డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ రోమన్ బబుష్కిన్మీడియాతో మాట్లాడారు. యూఎస్మార్కెట్లో భారత ఉత్పత్తుల ఎగుమతులకు ఇబ్బందులు ఎదురైతే.. రష్యా మార్కెట్లు స్వాగతం పలుకుతాయని చెప్పారు. ప్రస్తుతం భారత్ సవాళ్లతో కూడిన పరిస్థితిని ఎదుర్కొంటున్నదని, ఆ దేశంతో సంబంధాలపై తమకు పూర్తి విశ్వాసం ఉందని పేర్కొన్నారు. అమెరికా ఆర్థికవ్యవస్థలను ఆయుధంలా వాడుతున్నదని మండిపడ్డారు. మంచి మిత్రులని చెబుతూనే ఇండియాపై అమెరికా ఆంక్షలు విధిస్తున్నదని, వాస్తవానికి మిత్రులు ఎప్పుడూ ఇలా చేయరని పేర్కొన్నారు. తాము భవిష్యత్తులోను భారత్‌పై అలాంటి చర్యలు తీసుకోబోమని చెప్పారు. భారత్‌కు ఎలాంటి ఇబ్బందిలేకుండా క్రూడాయిల్ సరఫరా చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేసినట్టు చెప్పారు. భారత్‌కు అతిపెద్ద ముడి చమురు సరఫరాదారు రష్యానేనని, ప్రస్తుతం సగటున 5 శాతం డిస్కౌంట్‌తో భారత్ అవసరాల్లో 40 శాతం సరఫరా చేస్తున్నామన్నారు.
భారత్‌కు అండగా ఉంటం
రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలును భారత్నిలిపివేస్తే.. ఆ దేశానికి పశ్చిమ దేశాలనుంచి ఆమేరకు సహకారం అందదని బబుష్కిన్తెలిపారు. ఎందుకంటే ఈ మధ్య ఆ దేశాలు తమ సొంత ప్రయోజనం గురించి మాత్రమే ఆలోచించే నవ వలసవాద శక్తులలా ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు. ఈ సమస్య పరిష్కారంలో భారత్‌కు అండగా ఉండేందుకు తమ దేశం కట్టుబడి ఉందని వెల్లడించారు. భారత్‌లో ఉత్పత్తులు చేయడానికి ఇండియాకు సరైన భాగస్వామి రష్యానే అని పేర్కొన్నారు.
5% డిస్కౌంట్‌తో క్రూడాయిల్
అమెరికా నుంచి ఒత్తిడి, ఆంక్షలు ఉన్నప్పటికీ భారత్‌కు 5% డిస్కౌంట్‌తో చమురు సరఫరా చేయనున్నట్లు రష్యా ప్రకటించింది. ఈ విషయాన్ని రష్యా డిప్యూటీ ట్రేడ్ రిప్రజెంటేటివ్ ఎవ్‌జెనీ గ్రివా వెల్లడించారు. ‘‘భారత్‌కు రష్యన్ క్రూడాయిల్ కొనుగోళ్లపై 5% డిస్కౌంట్ ఉంటుంది. ఇది చర్చల ఆధారంగా నిర్ణయిస్తాం. రాజకీయ అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ దాదాపు అదే స్థాయిలో చమురు దిగుమతి చేసుకుంటుంది. డిస్కౌంట్లు అనేది వాణిజ్య రహస్యం” అని వ్యాఖ్యానించారు.