విద్యలో దేశీయ భాషలూ అవసరమే : డా. చిట్టెడి కృష్ణారెడ్డి

విద్యలో దేశీయ భాషలూ అవసరమే : డా. చిట్టెడి కృష్ణారెడ్డి

అమిత్ షా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ దేశ విద్యా విధానంలో భాషా మాధ్యమంపై, ప్రభుత్వ కార్యకలాపాల్లో వాడే భాషపై తమ నివేదికను భారత రాష్ట్రపతికి అందించింది. ఈ నివేదికలోని ముఖ్యాంశాలపై దేశ వ్యాప్తంగా అనేక రకాల చర్చలు నడుస్తున్నాయి. అమితా షా పార్లమెంటరీ కమిటీ నివేదికను ఒకసారి చూస్తే.. భారతీయ భాషల్లో ప్రధానమైన భాషగా హిందీని గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పకనే చెబుతున్నట్లు కనబడుతుంది. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో అన్ని  కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రిత్వశాఖలు, విభాగాల్లో లేఖలు, ఫ్యాక్స్‌‌‌‌లు, ఈమెయిల్స్ వంటివి హిందీలోనే వాడే విధంగా పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారిక పనులు, ఆహ్వాన పత్రాలు, ఉపన్యాసాలు వంటి వాటిలో హిందీ లేదా స్థానిక భాషలను మాత్రమే వాడాలి అని కమిటీ సూచించింది. కానీ దేశ వ్యాప్తంగా హిందీని పూర్తిస్థాయిలో అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని ఎక్కడా కూడా పేర్కొనలేదు. వివిధ రాష్ట్రాల్లో మాట్లాడే ప్రస్తుత భాషల ఆధారంగా భారతదేశంలోని అన్ని రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను 3 భాగాలుగా విభజించారు. 

విద్యా వ్యవస్థ పై ప్రభావం

హిందీ మాతృభాషగా ఉన్న రాష్ట్రాల్లో హిందీ మీడియం తప్పనిసరి చేసినప్పుడు మిగతా రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కేంద్ర విద్యాలయాల్లో విద్యనభ్యసించడం, భాష కారణంగా సాధ్యపడకపోవచ్చు. దీంతో వారి అవకాశాలను తగ్గించినట్లుగా భావించాల్సి ఉంటుంది. అంతేకాకుండా భారతీయ విద్యార్థులు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన విదేశీ సంస్థల్లో విద్యను అభ్యసించడానికి, ఉద్యోగాలు చేయడంలో కూడా అనేక ఇబ్బందులు పడే పరిస్థితి కనపడుతున్నది. సాంకేతిక విజ్ఞానం కూడా పూర్తిస్థాయిలో భారతీయ భాషలలో పూర్తిగా అనువాదం చేయకపోవడం కూడా ప్రధాన పరిమితిగా చెప్పవచ్చు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్, కోడింగ్ లాంటి అనేక అంశాలు నేటికీ ఇంగ్లీష్ లోనే ప్రధానంగా అందుబాటులో ఉండటం కూడా విధాన రూపకర్తలు గుర్తుంచుకోవాలి. కొన్ని సబ్జెక్ట్​లు ఆంగ్లంలో, మరికొన్ని సబ్జెక్టులు ప్రాంతీయ భాషలో నేర్చుకోవాల్సిన పరిస్థితి వస్తే, భాషా పరిజ్ఞానంతో ఆ సబ్జెక్టులపై పూర్తి స్థాయి పట్టు సాధించలేకపోవడం ప్రధాన సమస్యగా ఉంటుంది. పాఠశాల స్థాయిలోనే పిల్లలకు వీలైనన్ని వివిధ రకాల భాషలను నేర్పించే పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తే రాబోయే తరాలకు భాషా సమస్య లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. అంతేకానీ పూర్తి  స్థాయిలో ఆంగ్లంలో ఉన్న సబ్జెక్టులు దేశ భాషల్లో అనువాదం చేయకుండా దేశవ్యాప్తంగా అమలు చేస్తే విద్యార్థులు నష్టపోతారు.  అంతర్జాతీయంగా అవకాశాలను, ఉపాధి పొందడంలో కూడా వెనకబడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఎక్కువమంది ప్రజల ఆలోచన, వారి అభిప్రాయాలు చాలా వరకు మాతృభాషలోనే ఉంటాయి. కాబట్టి సామాజిక సమస్యకైనా, ఆర్థిక సమస్యకైనా పరిష్కార మార్గాలను సూచించే విధానం ముఖ్యం కావాలి కానీ, ఆ భావాలను వ్యక్తపరిచేందుకు భాష ప్రతిబంధకం  కాకూడదు. కానీ నేడు అనేక మంది విద్యార్థులు భాషలపై పట్టు కోసం కుస్తీ పడుతూ సృజనాత్మకత, భావ వ్యక్తీకరణలో వెనకబడుతున్నారు. విద్యాబోధనలో ఆధిపత్య భాష(ఆంగ్లం) వాడకం వల్ల గ్రామీణ విద్యార్థులు తరగతులకు హాజరు కావడానికి ఆసక్తి చూపడం లేదు. ఇంగ్లీష్ భాష మాధ్యమం ద్వారా తమ విజ్ఞానాన్ని పంచుకోవడం రాకపోవడం వల్ల వారి శ్రమ వృథా అనే భావన కలగకూడదు. భాష కన్నా భావం ముఖ్యం అనే విషయాన్ని గమనించాలి. దీనికి అనుగుణంగానే భారత దేశ విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకురావాలనే నేపథ్యంలో నూతన విద్యా విధానాన్ని ప్రభుత్వం స్వీకరించడం తెలిసిందే. 

సమస్యలు ఏమిటి?

నూతన జాతీయ విద్యా విధానంలో పేర్కొన్నట్టుగా జాతీయస్థాయిలో భాషా అనువాదానికి సంబంధించిన  సంస్థను స్థాపించి, వాటికి అన్ని ప్రాంతాల్లో అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసి అనువాద ప్రక్రియను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రాంతీయ భాషలో కానీ  లేదా హిందీ లాంటి భాషను అమలులోకి తీసుకు వచ్చే ముందే ఈ అనువాద సంస్థల ద్వారా వచ్చినటువంటి సాంకేతిక సాయంతో ఒక భాష నుంచి మరొక భాషకు అనువాదం చేసుకునే సులభమైన విధానం అందరికీ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. భారతదేశం లాంటి విభిన్నమైన సమాజంలో అన్ని భాషలకు పూర్తిస్థాయి ప్రాధాన్యత, అవకాశం లభించినప్పుడు మాత్రమే దేశం సౌభాగ్యంగా ఉంటుంది. ప్రభుత్వ పథకాలు, వాటి విధానాలు, ఆశయాలు అన్నిటిని కూడా వివిధ మాధ్యమాల ద్వారా మాతృభాషల్లో అందుబాటులోకి వస్తే ప్రజలకు అవగాహన ఏర్పడి, ప్రభుత్వం  సాధించాలనుకున్న ఆశయం నెరవేరడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. 

హిందీ రాష్ట్రాల్లోనే..

హిందీ మాతృ భాషగా ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే ఐఐటీ వంటి ఉన్నత విద్యా సంస్థల్లో హిందీ మీడియం ఉంటుందని, ఇతర రాష్ట్రాల్లో వారి వారి భాషల్లో బోధించవచ్చని కమిటీ నివేదించింది. ఇంగ్లీష్‌‌ను ఆప్షనల్‌‌గా కూడా ఉంచుతున్నట్లు పేర్కొంది. ప్రాథమిక పాఠశాలలో మాతృభాషను బోధనా మాధ్యమంగా ఉపయోగించాలనే ఆలోచన భారతీయ విద్యా వ్యవస్థకు కొత్త కాదు. విద్య, జాతీయాభివృద్ధిపై కొఠారీ కమిషన్ నివేదిక గిరిజన ప్రాంతాల్లో, పాఠశాలల్లో  మొదటి రెండు సంవత్సరాలు, బోధనా మాధ్యమం, పుస్తకాలు స్థానిక గిరిజన భాషలో ఉండాలని సూచించింది. ప్రాంతీయ భాషను విడిగా బోధించి, మూడో సంవత్సరం నాటికి బోధనా మాధ్యమంగా మార్చాలి. విద్యా హక్కు చట్టం, 2009 కూడా సాధ్యమైనంత వరకు పాఠశాలలో బోధనా మాధ్యమం పిల్లల మాతృభాషగా ఉండాలని పేర్కొంది. నూతన జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం కూడా మాతృభాషలో విద్యాబోధన చేయాలి. తద్వారా సృజనాత్మకతకు పటిష్టమైన పునాదులు వేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉంది. ఎన్ఈపీ ప్రకారం, ప్రాంతీయ భాషలను ఉపయోగించడం అనేది పిల్లల అభ్యసన ఫలితాలను మెరుగుపరచడం మాత్రమే కాదు, ‘భారతదేశం జ్ఞానాన్ని పెంపొందించడం’ కూడా. ఇది ‘జాతీయతా భావన, ఆత్మవిశ్వాసం, స్వీయ-జ్ఞానం, సహకారం, ఏకీకరణ ప్రయోజనాల కోసం కీలకమైనదిగా పరిగణించబడుతుంది’. ఈ విధానాన్ని అమలు చేయడంలో అసంఖ్యాక సమస్యలు ఉంటాయి కానీ అవి అధిగమించలేనివి కావు.

భాషను పరిరక్షించాలి

వివిధ భాషలపైన అవగాహన, ప్రాథమిక పరిజ్ఞానం కూడా ముఖ్యం. ప్రపంచీకరణ నేపథ్యంలో విదేశీ భాషలపై అవగాహన ఉండటం ఎంత అవసరమో దేశంలో ఉన్న భాషలను కాపాడుకోవాల్సిన అవసరమూ అంతే ఉంది. మాతృభాష పరిరక్షణకు ప్రభుత్వాలు, ప్రజలు కలిసికట్టుగా పని చేయాలి. భాష అనువాదానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం కూడా ఎంతగానో కనపడుతోంది. భాష కన్నా భావానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడే మనం అనుకుంటున్న వినూత్న ఆలోచనలకు శ్రీకారం Aచుట్టి, దేశ అభివృద్ధిలో పాలుపంచుకోవడానికి  ప్రజలకు అవకాశం వస్తుంది. భారతదేశం కూడా స్వయం సమృద్ధి, స్వావలంబన కోరుకుంటున్న తరుణంలో అన్ని ప్రాంతీయ భాషల్లో తమ ఆలోచనా విధానాలను వ్యక్తపరచడానికి, పరిశోధనలు చేయడానికి ప్రోత్సాహం లభిస్తుంది.  ప్రపంచంలో నోబెల్ బహుమతి పొందిన అనేక మంది శాస్త్రవేత్తలు వారి అధ్యయనం మాతృభాషలోనే జరిగిందనే విషయాన్ని గ్రహించాలి.

- డా. చిట్టెడి కృష్ణారెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ