
- 15 ఎకరాల్లో నిర్మించేందుకు ప్రతిపాదనలు : శాట్స్ చైర్మన్
హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణాన్ని స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దుతామని, అందుకు తగ్గ ప్లానింగ్ చేస్తున్నామని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. జులై 23, 28వ తేదీల్లో గజ్వేల్‌లో పర్యటించి మంత్రి టి.హరీశ్‌రావు, టీఎస్ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, కలెక్టర్ వెంకట్రామ రెడ్డి, అధికారులతో కలిసి రెండు దఫాలు సమావేశమయ్యామని చెప్పారు. గజ్వేల్ కేంద్రంగా 15 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ విలేజ్ నిర్మిస్తే జిల్లాలోని క్రీడాకారులు, యువతకు మేలు జరుగుతుందని మంత్రి హరీశ్ రావు సూచించారని తెలిపారు. పట్టణంలో ఫుట్‌బాల్ అకాడమీ, సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్, బ్యాడ్మింటన్, వాలీబాల్ తదితర క్రీడల కోసం మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్, రెండు హాస్టల్స్‌ను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని శాట్స్ చైర్మన్ ఓ ప్రకటనలో చెప్పారు. ఫుట్‌బాల్ అకాడమీ, మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఇప్పటికే శాట్స్‌కు లేఖ రాశారని తెలిపారు.