
కోల్ కతా: ఐపీఎల్ 2022లో కోల్ కతా నైట్ రైడర్స్‌కు టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. మెగా ఆక్షన్ లో రూ.12.25 కోట్లకు శ్రేయస్ ను కొనుగోలు చేసిన కేకేఆర్ బుధవారం అతడిని కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. గతేడాది వరకు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన అయ్యర్.. 2020 సీజన్‌లో కెప్టెన్‌గా ఆ టీమ్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లాడు. కానీ లాస్ట్ సీజన్ ఫస్ట్ ఫేజ్ కు గాయం కారణంగా అయ్యర్ దూరమవడంతో తన ప్లేస్‌లో రిషబ్ పంత్‌ను కెప్టెన్ గా నియమించారు. సెకండ్ ఫేజ్‌కు శ్రేయస్ అందుబాటులోకి వచ్చినా.. పంత్ నే కెప్టెన్ గా కొనసాగించారు. ఇక ఈ సీజన్ కు ముందు శ్రేయస్‌ను ఢిల్లీ రిలీజ్ చేయగా ఆక్షన్ లో కేకేఆర్ సొంతం చేసుకుంది. ‘కేకేఆర్ కు కెప్టెన్ గా ఎంపికవ్వడం గౌరవంగా భావిస్తున్నా. వివిధ దేశాలకు చెందిన గొప్ప ప్లేయర్లను ఐపీఎల్ ఒక్క చోట చేర్చింది. టీమ్ ను ముందుండి నడిపించేందుకు ఎదురుచూస్తున్నా. నన్ను కెప్టెన్ గా నియమించినందుకు ఓనర్లు, మేనేజ్‌మెంట్, సపోర్ట్ స్టాఫ్ కు థ్యాంక్స్’ అని శ్రేయస్ పేర్కొన్నాడు.