ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి

ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి
  • ప్రజాదర్బార్​ను ప్రజావాణిగా పిలవాలని నిర్ణయం 
  • దివ్యాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూ లైన్లు  ఇప్పటి వరకు 4,471 వినతి పత్రాలు

హైదరాబాద్, వెలుగు :  జ్యోతిరావ్ పూలే ప్రజాభవన్ లో నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ ను ప్రజావాణిగా పిలవాలని సీఎం రేవంత్​ ఆదేశించారు. ఈ ప్రజావాణిని ఇక నుంచి ప్రతీ మంగళ, శుక్రవారాల్లో రెండు రోజులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వంటి గంట వరకు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ ప్రజావాణికి ఉదయం 10 గంటల లోపు ప్రజాభవన్ కు చేరుకున్న వారికి అవకాశం ఇవ్వాలని సూచించారు.

దివ్యాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూ-లైన్లు ఏర్పాటు చేయాలని, ప్రజల సౌకర్యార్థం తాగునీరు, ఇతర సౌకర్యాలను కల్పించాలని సీఎం ఆదేశించారు. ప్రజా దర్బార్ ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు 4,471 వినతిపత్రాలు అందా యి. అందులో ఎక్కువ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, పెన్షన్ లకు సంబంధించిన వినతి పత్రాలే ఉన్నాయి.

అందరికీ న్యాయం చేస్తం :  శ్రీధర్​బాబు

సోమవారం ప్రజాదర్బార్ కు వచ్చిన ప్రజల సమస్యలను తెలుసుకొని వారి నుంచి వినతులను మంత్రి డి.శ్రీధర్ బాబు స్వీకరించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని తెలిపారు. పెద్దలు, వివిధ వర్గాలతో నెల రోజుల పాటు ప్రజా సమస్యలను చర్చించి మానిఫెస్టో రూపొందించినట్లు తెలిపారు. పారదర్శకంగా, జవాబుదారీతనంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు.

దరఖాస్తుదారులు తమ విజ్ఞాపనపత్రంలో సమస్యతో పాటు అడ్రస్, ఫోన్ నంబర్ ను రాయాలని సూచించారు. తద్వారా దరఖాస్తుదారుల సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కరిస్తామని తెలిపారు. ఈ నెల 17న నిర్వహించనున్న టీఎస్ జెన్​కో ఏఈ పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు.

అదే రోజు రెండు, మూడు పరీక్షలు ఉన్నట్లు అభ్యర్థులు వివరించారు. ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికితీసుకు వెళ్లనున్నట్లు తెలిపారు. తమకు ఇచ్చే గౌరవ వేతనాన్ని ప్రతి నెలా రెగ్యులర్ గా ఇవ్వాలని మధ్యాహ్న భోజన వంట కార్మికులు వినతి పత్రం అందజేశారు.