
భారతదేశంలో రియల్టీ మార్కెట్లో ట్రెండ్ పూర్తిగా మారిపోతోంది. గతంలో మాదిరిగా కోటి రూపాయల కంటే తక్కువ ఇళ్లకు డిమాండ్ కనిపించటం లేదు. కోటి కంటే తక్కువ రేటున్న ఇళ్ల నిర్మాణం కూడా తగ్గిస్తున్నారు రియల్టర్లు. ప్రస్తుతం మార్కెట్లో లగ్జరీ అపార్ట్మెంట్లకు డిమాండ్ పెరుగుతున్న ట్రెండ్ కనిపిస్తోంది. దీంతో నగరాల్లో నివసిస్తున్న మధ్యతరగతి ప్రజలు ఇల్లు కొనుక్కోలేని పరిస్థితి కొనసాగటం కొత్త ప్రశ్నలు రేకెత్తిస్తోంది.
2025 మెుదటి త్రైమాసికంలో రూ.50 లక్షల కంటే తక్కువ రేటున్న ఇళ్ల అమ్మకాలు 9 శాతం తగ్గగా.. 50 లక్షల నుంచ కోటి మధ్య రేటున్న ఇళ్ల అమ్మకాలు 6 శాతం పడిపోయాయి. కానీ ఆసక్తికరంగా రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల మధ్య రేటున్న అపార్ట్మెంట్లకు డిమాండ్ 28 శాతం పెరిగినట్లు రియల్టీ డేటా చెబుతోంది. ఇక రూ.50 కోట్ల కంటే ఎక్కువ విలువైన నివాసాలకు డిమాండ్ 500 శాతం వరకు పెరిగిందని తేలింది. దేశంలో మెుత్తం అమ్ముడువుతున్న ఇళ్లలో 46 శాతం కోటి కంటే ఎక్కువ రేటున్నవే కావటం గమనార్హం.
బెంగళూరు, ముంబై, ఎన్సీఆర్ ప్రాంతాల్లో ఏడాదికి రూ.25 లక్షలు సంపాదిస్తున్న టెక్కీలు కూడా ఒక 2BHK కొనలేని పరిస్థితి ఉందని రియల్ ఎస్టేట్ డెవలపర్ రాజ్ దీప్ చౌహాన్ చెబుతున్నారు. ఈ నగరాల్లోని రియల్టీ సంస్థలు మధ్యతరగతి ప్రజల కోసం నివాసాలను నిర్మించకుండా సంపన్నులకు అవసరమైన లగ్జరీ నివాసాలను నిర్మిస్తూ సమాజంలో వ్యత్యాసాన్ని సృష్టిస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో మధ్యతరగతికి అందుబాటు ధరల్లో అపార్ట్మెంట్లు లేక కోటికి పైన పెట్టి కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని చెప్పుకొచ్చారు.
ALSO READ : IT News: టెక్కీల లేఆఫ్స్‌కి AI కారణం కాదు.. అసలు మ్యాటర్ చెప్పిన TCS సీఈవో..
ముంబై నగరాల్లో ఆదాయాని కంటే మూడు రేట్లు ఇళ్ల ధరల్లో పెరుగుదల కనిపించింది. అధిక ప్రాపర్టీ రేట్లు ప్రజలపై చెల్లించాల్సిన ఈఎంఐ భారాన్ని కూడా పెంచినట్లు వెల్లడైంది. ఇటీవలి కాలంలో రిజర్వు బ్యాంక్ తమ మానిటరీ పాలసీలో కీలక వడ్డీ రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అయితే ఇది కొంత హోం లోన్ యూజర్లకు ఉపశమనం కలిగించినప్పటికీ.. మెట్రో నగరాల్లో ఆకాశానికి చేరిన ప్రాపర్టీ ధరలు మధ్యతరగతికి పెద్దగా ప్రయోజనం లేకుండా చేస్తున్నాయి. సంపన్న వర్గాల నుంచి పెరుగుతున్న లగ్జరీ ప్రాపర్టీల డిమాండ్ కోటి రూపాయల కంటే ఎక్కువ రేటు ఉండే అపార్ట్మెంట్ల నిర్మాణాన్ని తగ్గిస్తోందనే ఆందోళనలు పెరిగిపోతున్నాయి.