7 సిటీల్లోని 1.74 లక్షల ప్లాట్లకు పాట్లు!

7 సిటీల్లోని 1.74 లక్షల ప్లాట్లకు పాట్లు!
  •     వీటిలో ఢిల్లీ వాటా 66 శాతం
  •     ఎంఎఆర్‌లో 24 శాతం ఫ్లాట్లు
  •     మొత్తం 6.29 లక్షల ఇండ్ల నిర్మాణం ఆలస్యం
  •     వెల్లడించిన అన్‌రాక్‌

న్యూఢిల్లీ: ఒకటి కాదు రెండు దాదాపు 1.74 లక్షల ఇళ్లు.. వీటి విలువ దాదాపు రూ .1.4 లక్షల కోట్లు.  ఏడు మెట్రో సిటీల్లోని ఈ ఇండ్లు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి. వీటి కన్‌స్ట్రక్షన్‌ పూర్తిగా ఆగిపోయింది. అంతేకాదు పూర్తిగా నిలిచిపోయిన వాటితోపాటు ఆలస్యమైన వాటినీ కలిపితే మొత్తం యూనిట్ల సంఖ్య 6.29 లక్షలు! వీటికి డబ్బులు కట్టిన వారిన పరిస్థితి అయోమయంగా మారింది. ఢిల్లీ–నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ (-ఎన్‌సిఆర్)లో అత్యధికంగా 66 శాతం ఫ్లాట్ల నిర్మాణం ఆగిపోయింది. రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్ అన్‌రాక్‌ రీసెర్చ్‌ ద్వారా ఈ విషయం వెల్లడయింది.  2014 లేదా అంతకు ముందు ప్రారంభించి.. నిలిచిపోయినా లేదా ఆలస్యమైన ఇండ్ల నిర్మాణ ప్రాజెక్టుల వివరాలతో ఈ రిపోర్టు తయారు చేశారు.   రియల్టీ సెక్టార్‌లో భారీ నిధుల కొరతే ఈ సమస్యకు ముఖ్యకారణమని అన్‌రాక్‌ తెలిపింది. కరోనా వల్ల కూడా రియల్టర్లకు చాలా సమస్యలు వచ్చాయని తెలిపింది. బిల్డర్లకు బ్యాంకుల నుంచి, ఎన్​బీఎఫ్​సీ నుంచి తగినంత మొత్తం లోన్​ రావడం లేదని అనరాక్​ వివరించింది.

అన్నింటికంటే ఢిల్లీలోనే ఎక్కువ..

ఢిల్లీలో 1,13,860 యూనిట్ల నిర్మాణం పూర్తిగా నిలిచింది. ఈ ప్రాజెక్టుల విలువ సుమారు రూ. 86,463 కోట్లు. ఈ విషయంలో టాప్–-7  సిటీల్లో ఢిల్లీ వాటా 66 శాతం. ఇక్కడ రూ.2,49,540 కోట్ల విలువైన 3.28 లక్షల యూనిట్లు ఆలస్యమవుతున్నాయి. ముంబై (ఎంఎంఆర్‌)లో 41,730 యూనిట్లు పూర్తిగా నిలిచిపోయాయి. వీటి విలువ సుమారు  రూ. 42,417 కోట్లు. ఏడు సిటీల్లో ఈ సిటీ వాటా24 శాతం.  ఎంఎంఆర్‌లో ఆలస్యమైన యూనిట్ల మొత్తం సంఖ్య 1,49,620 కాగా, వీటి విలువ. రూ .1,52,105 కోట్లు. పూణేలో రూ .5,854 కోట్ల విలువైన 9,990 యూనిట్ల కన్‌స్ట్రక్షన్‌ నిలిచిపోయింది.  మరో 50,130 యూనిట్ల కన్‌స్ట్రక్షన్‌ ఆలస్యమవుతున్నది. వీటి విలువ రూ .29,390 కోట్లు. 

దక్షిణాది నగరాలలో, చెన్నైలో ప్రాజెక్టులేవీ ఆగిపోలేదు. ఇక్కడ రూ .11,530 కోట్ల విలువైన 11,430 యూనిట్ల నిర్మాణం ఆలస్యంగా జరుగుతోంది. బెంగళూరులో రూ. 3,061 కోట్ల విలువైన 3,870  యూనిట్ల నిర్మాణం నిలిచిపోయింది. అంతేగాక రూ .33,080 కోట్ల విలువైన 41,780 యూనిట్ల కన్‌స్ట్రక్షన్‌ ఆలస్యమవుతోంది. హైదరాబాద్‌లో 4,150 యూనిట్ల నిర్మాణం ఆగిపోయింది. వీటి విలువ రూ. 2,727 కోట్లు.  ఈ సిటీలో 17,960 యూనిట్ల నిర్మాణంలో విపరీతమైన జాప్యం కనిపిస్తోంది. వీటి  విలువ రూ .11,810 కోట్ల వరకు ఉంటుంది.   
    
కోల్‌కతాలో కేవలం 150 యూనిట్లు మాత్రమే ఆగిపోగా, వీటి విలువ రూ. 91 కోట్లు.    అయితే ఇక్కడ రూ.17,960 కోట్ల విలువైన 29,110 యూనిట్ల నిర్మాణం విపరీతంగా ఆలస్యమవుతోంది. ఆలస్యమైన లేదా నిలిచిపోయిన ప్రాజెక్టుల్లో 71 శాతం యూనిట్లు రూ.80 లక్షలలోపు సెగ్మెంట్‌కు చెందినవి. ప్రీమియం సెగ్మెంట్‌ యూనిట్ల వాటా 18 శాతం, లగ్జరీ సెగ్మెంట్‌ వాటా 11 శాతం ఉంది. జేపీ ఇన్‌ఫ్రాటెక్, యూనిటెక్, ఆమ్రపాలి, 3సి కంపెనీతో సహా అనేక మంది బిల్డర్ల కారణంగా ఢిల్లీలోని ఇండ్ల కొనుగోలుదారులు తీవ్రంగా నష్టపోయారు. కిందటి ఆర్థిక సంవత్సరంలో డెవలపర్ల తరఫున సంస్థ రూ .16,240 కోట్ల విలువైన 14,700 యూనిట్లను అమ్మినట్టు అన్‌రాక్‌ ప్రకటించింది. 

ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో   మన దేశంలోని ఏడు సిటీల్లో దాదాపు 6.29 లక్షల యూనిట్ల నిర్మాణం  నిలిచిపోయింది. కొన్నింటి కన్‌‌స్ట్రక్షన్‌‌ విపరీతంగా ఆలస్యమవుతోంది. విండో ఫర్ అఫర్డబుల్  మిడ్- ఇన్‌‌కమ్ హౌసింగ్  ఫండ్ ద్వారా ఇలాంటి ప్రాజెక్టులను రక్షించడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ యాజమాన్యంలోని ఎన్​బీసీసీ కూడా ఢిల్లీలో ప్రత్యేకంగా కొన్ని ప్రాజెక్టులు తిరిగి మొదలయ్యేలా బిల్డర్లకు సాయపడుతోంది.
 

అన్‌‌రాక్‌‌ డైరెక్టర్  రీసెర్చ్ హెడ్ 
ప్రశాంత్ ఠాకూర్