చైనాకు ఇటలీ షాక్

చైనాకు ఇటలీ షాక్
  • చైనాకు ఇటలీ షాక్
  • బెల్ట్​ అండ్ రోడ్ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటామని సంకేతాలు
  • చైనా ప్రీమియర్ లీ కియాంగ్‌‌కు చెప్పిన ఇటలీ ప్రధాని మెలోనీ!

రోమ్ : చైనాకు ఇటలీ షాక్ ఇచ్చింది. డ్రాగన్ దేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటామని పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది. ఈ ప్రాజెక్టు వల్ల అమెరికాతో సంబంధాలపై తీవ్ర ప్రభావం పడుతున్న నేపథ్యంలో తాము ఒప్పందం నుంచి బయటికి రావాలని ప్లాన్ చేస్తున్నామని చెప్పినట్లు తెలిసింది. జీ20 సమిట్ సైడ్‌‌లైన్స్‌‌లో భాగంగా జరిగిన సమావేశంలో.. చైనా ప్రీమియర్ లీ కియాంగ్‌‌కు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఈ మేరకు స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే ఇదే సమయంలో తాము చైనాతో స్నేహ సంబంధాలను కొనసాగించాలని మెలోనీ చెప్పినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 

బెల్ట్​ అండ్ రోడ్ ప్రాజెక్టులో చేరేందుకు 2019లో ఒప్పందంలో ఇటలీ సంతకం చేసింది. ప్రాజెక్టు నుంచి ఎగ్జిట్ కావడమనేది సున్నితమైన అంశం కావడం, చైనా ప్రతీకారానికి దిగే అవకాశం ఉన్న నేపథ్యంలో.. తమ నిర్ణయాన్ని చెప్పేందుకు మెలోనీ చాలా సమయం తీసుకుంటున్నారు. ఒప్పందం నుంచి ఇటలీ వైదొలిగితే ప్రతికూల పరిణామాలు ఉంటాయంటూ ఇటీవల ఇటలీలో చైనా రాయబారి హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో త్వరలోనే చైనాలో పర్యటించాలని మెలోనీ భావిస్తున్నారు.