నా భర్తను ట్రాప్ చేసిన్రు..ఆయన ద్వారా నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నరు

నా భర్తను ట్రాప్ చేసిన్రు..ఆయన ద్వారా నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నరు

హనుమకొండ, వెలుగు: ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మనుషులు తన భర్తను ట్రాప్ చేసి తనపై ఒత్తిడి తెస్తున్నారని హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ నవ్య ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఎమ్మెల్యే నన్ను ఇబ్బంది పెట్టిన మాట నిజమే. ఆయన తప్పు చేశారు కాబట్టే అప్పట్లో నాకు క్షమాపణ చెప్పారు. ఆ సమయంలో పంచాయతీ అభివృద్ధికి రూ.25 లక్షలు ఇస్తానని చెప్పారు. ఇప్పుడు అవి కావాలంటే రాజకీయ అవసరాలు, ఒత్తిళ్ల కారణంగానే ఎమ్మెల్యేపై ఆరోపణలు చేశానని ఒప్పుకొమ్మంటున్నరు. పేపర్ల మీద సంతకాలు పెట్టుమంటున్నరు. నా భర్తను ట్రాప్​ చేసి ఆయనతోనే నన్ను బ్లాక్​మెయిల్ చేయిస్తున్నరు” అని ఆమె వాపోయారు. మంగళవారం మీడియాతో నవ్య మాట్లాడారు. ఎమ్మెల్యేకు మధ్యవర్తిగా వ్యవహరించిన లేడీ తనను బాగా ఇబ్బంది పెట్టిందని ఆమె చెప్పారు.

‘‘నా వద్ద ఎమ్మెల్యే, ఆయన పీఏ, మధ్యవర్తి లేడీ మాట్లాడిన రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి. ఎప్పటికైనా అవన్నీ బయటపెడతాననే భయంతోనే నా భర్త ప్రవీణ్ ను వాళ్లు ట్రాప్ చేశారు. నాతో సంతకం పెట్టిస్తే డబ్బులు ఇస్తానని చెప్పి నా భర్తను నమ్మించారు. వాళ్ల మాటలు నమ్మి వాళ్లు తయారు చేసిన పేపర్ల మీద సంతకం పెట్టాలని నా భర్త నాపై ఒత్తిడి తెస్తున్నాడు. పిల్లలను హాస్టల్​కు పంపించాలన్నా పేపర్ల మీద సంతకం పెట్టాల్సిందేనని బ్లాక్​మెయిల్​చేస్తున్నాడు” అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఇంతకుముందు నా భర్త నాకు సపోర్ట్​చేశాడు. ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో అర్థమైతలేదు. ఇప్పుడు నాకు నా భర్తే శత్రువు అయ్యిండు. అందరూ కలిసి నా ఇంట్లో చిచ్చు పెట్టారు. ఎమ్మెల్యే, ఆయన పీఏ, మధ్యవర్తి లేడీతో పాటు ఎవరినీ వదిలిపెట్టను. నన్ను బ్లాక్ మెయిల్​చేస్తున్నందుకు నా భర్తపై కూడా సీపీకి ఫిర్యాదు చేస్తాను. నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్న అందరిపై కంప్లయింట్ ఇస్తాను” అని చెప్పారు. తాను సీపీకి రాసిన లెటర్లు కూడా మార్చేస్తున్నారని నవ్య వాపోయారు. 

వాళ్ల సంగతి తేలుస్త... 

తాను పైసల కోసం రాజకీయాల్లోకి రాలే దని, ప్రజలకు చేయడానికే వచ్చానని నవ్య చెప్పారు. ‘‘నాకు ఎమ్మెల్యే రూ.25 లక్షలు ఇచ్చారని ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యే రూ.25 లక్షలు ఇచ్చాడట కదా! అని మా బంధువులు అడుగుతున్నారు. డబ్బులు తీసుకున్నారట కదా! అని జనం కూడా ప్రశ్నిస్తున్నారు. ఎవరో ఒకరు నా పేరు చెప్పి రూ.5 లక్షలు తీసుకున్నారు. వారి సంగతి కూడా తేలుస్తా” అని అన్నారు. కాగా, ఎమ్మెల్యే తనను లైగింక వేధిస్తున్నాడని మార్చిలో నవ్య ఆరోపణలు చేయగా.. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య నేరుగా ఆమె ఇంటికి వెళ్లి క్షమాపణ కోరారు. ఆ టైమ్ లో గ్రామాభివృద్ధికి రూ.25 లక్షలు ఇస్తానని ప్రకటించారు. దీంతో అప్పట్లో వివాదం సద్దుమణిగింది.