జియో–బీపీ పెట్రోల్‌‌ బంకులొస్తున్నాయ్‌‌

జియో–బీపీ పెట్రోల్‌‌ బంకులొస్తున్నాయ్‌‌

రిలయన్స్-బీపీ వెంచర్‌
బీపీకి 49 శాతం, రిలయన్స్‌‌కు 51 శాతం వాటా
ప్రభుత్వ ఓఎంసీ మార్కెట్‌ వాటాపై ప్రభావం
ఇండియా పెట్రో రిటైల్‌ మార్కెట్‌ లోకి విదేశీ కంపెనీల ఆసక్తి: మోర్గాన్‌‌ స్టాన్

న్యూఢిల్లీ: అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌(ఆర్‌‌‌‌ఐఎల్‌‌), బ్రిటన్‌‌ బీపీ..  దేశంలో జియో–బీపీ బ్రాండ్ పేరిట పెట్రోల్‌‌ బంకులను ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఇది ప్రభుత్వ ఓఎంసీ(ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు)ల రిటైల్‌‌ మార్కెట్‌‌పై ప్రభావం చూపుతుందని మోర్గాన్‌‌ స్టాన్లీ రీసెర్చ్ రిపోర్ట్ తెలిపింది. రిలయన్స్ ఇంధన రిటైల్ వ్యాపారంలో భాగస్వామ్యం కావడానికి, ఈ బ్రిటన్ కంపెనీ రూ. 7,100  కోట్లను ఇన్వెస్ట్ చేయనుంది. దీంతో బీపీకి ఈ వ్యాపారంలో 49 శాతం వాటా దక్కుతుంది. ఈ భాగస్వామ్యం వలన ప్రస్తుతం ఆర్‌‌‌‌ఐఎల్‌‌కు ఉన్న 1,400 పంపు సేష్టన్లు, వచ్చే ఐదేళ్లలో 5,500 కు చేరుకుంటాయని, ఏవియేషన్ ఇంధన సేష్టన్‌‌లు 30 నుంచి 45 కు పెరుగుతాయని మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్‌‌ పేర్కొంది.   రిఫైన్ చేసిన ఉత్పత్తులను ఆర్‌‌‌‌ఐఎల్‌‌  మరింతగా విక్రయించడానికి ఇది తోడ్పడుతుందని ఈ రిపోర్ట్‌‌ అభిప్రాయపడింది.

రిటైల్‌‌ ఇంధన మార్కెట్లో రీరేటింగ్‌‌..

బీపీ ఎలక్ట్రిక్ చార్జింగ్‌‌ సేష్టన్‌‌లు, ఆర్‌‌‌‌ఐఎల్‌‌ డిజిటల్ ఎకో సిస్టమ్స్‌‌ లివరేజికి  ఈ  రిటైల్‌‌ నెట్‌‌వర్క్  ఉపయోగపడుతుందని మోర్గాన్‌‌ స్టాన్లీ  అంచనావేస్తోంది.  “ఎలక్ట్రిక్‌‌ చార్జింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంపై ప్రభుత్వ ఓఎంసీలు పెద్దగా దృష్టి పెట్టడం లేదు. అయినప్పటికి చార్జింగ్‌‌ సెంటర్లను ఏర్పాటు చేసే  రెగ్యులేషన్స్‌‌,  ప్రస్తుతం ఈ  ఓఎంసీలకు అనుకూలంగా ఉన్నాయి”అని ఈ రిపోర్ట్‌‌ పేర్కొంది. వచ్చే ఏడాది మొదటి భాగంలో ఆర్‌‌‌‌ఐఎల్‌‌, బీపీ తమ భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయాలని ప్రణాళికలు వేస్తున్నాయని తెలిపింది.  పెరుగుతున్న  పోటీ వలన  ఇంధన మార్కెట్‌‌లో మల్టిపుల్స్‌‌ రీరేటింగ్ జరుగుతుందని మోర్గాన్ స్టాన్లీ  అంచనావేసింది. “ఒక వేళ ఆర్‌‌‌‌ఐఎల్, బీపీ భాగస్వామ్యం అనుకున్న టార్గెట్‌‌ను చేరుకోగలిగితే, ప్రస్తుతం ఉన్న పంపు సేష్టన్లు,  2025 నాటికి 8 శాతం పెరుగుతాయి. ఇది ఏవియేషన్‌‌, ఆటో ఇంధన విభాగాల్లో ఓఎంసీల మార్కెట్‌‌ వాటాపై ప్రభావం చూపుతుంది”అని పేర్కొంది.

ఐఓసీ మార్కెట్‌‌ వాటాపై ఎక్కువ ప్రభావం..

ఈ భాగస్వామ్యం వలన దేశీయ రిటైల్ ఇంధన మార్కెట్‌‌లో బలంగా ఉన్న ఇండియన్‌‌ ఆయిల్‌‌ కార్పొరేషన్‌‌ మార్కెట్‌‌ వాటా అధికంగా ప్రభావితమవుతుంది. ప్రైవేట్ కంపెనీల వలన గత పదేళ్లలలో ఐఓసీ మార్కెట్‌‌ వాటా 10 శాతం తగ్గి 40 శాతం దిగువకు పడిపోయింది. “హైవేలకు దగ్గర్లో ఎక్కువగా పంప్‌‌ సేష్టన్లు ఉన్న  భారత్ పెట్రోలియం కూడా ప్రభావితమవుతుంది. ఆర్‌‌‌‌ఐఎల్ బీపీ హైవేలకు దగ్గర్లో విస్తరించే అవకాశం ఎక్కువగా ఉండడమే దీనికి కారణం”అని ఈ రిపోర్ట్ తెలిపింది. కానీ ఈ భాగస్వామ్య  ప్రభావం హెచ్‌‌పీసీఎల్‌‌పై తక్కువగా ఉంటుందని  అభిప్రాయపడింది. . బీపీసీఎల్‌‌, హెచ్‌‌పీసీఎల్‌‌ తమ మార్కెట్‌‌ వాటాను గతంలో కూడా కాపాడుకున్నాయి. అందువలన భవిష్యత్తులో కూడా తమ మార్కెట్‌‌ వాటాను స్థిరంగా ఉంచుకుంటాయని ఈ రిపోర్ట్‌‌ అభిప్రాయపడింది. తమ కున్న పెట్రోల్‌‌ పంపులు, ఏవియేషన్‌‌ టర్బైన్‌‌ ఇంధన వ్యాపారంలో 49 శాతం వాటాను కొనుగోలు చేయడానికి బీపీ రూ. 7,000 కోట్లను చెల్లించనుందని ఈ ఏడాది అగష్టులో ఆర్‌‌‌‌ఐఎల్‌‌ ప్రకటించింది.  ఆర్‌‌‌‌ఐఎల్‌‌కు ఈ వ్యాపారంలో 51 శాతం వాటా ఉంటుంది.