
సుల్తానాబాద్, వెలుగు: చెత్త నిల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని జాయింట్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ బి.సంధ్య పరిశీలించారు. సుల్తానాబాద్ పట్టణ పరిధిలోని మార్కండేయ కాలనీ శివారులోని మున్సిపల్ డంప్ యార్డును శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టెక్నాలజీతో చెత్త నుంచి సేంద్రియ ఎరువును తయారు చేసే బయో మైనింగ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. దీనివల్ల చెత్త నిల్వలు పేరుకుపోవన్నారు.
పైగా ఎరువును ఉత్పత్తి చేసి మార్కెటింగ్ చేసే వీలు ఉంటుందన్నారు. బయో మైనింగ్ కోసం సంబంధిత ఏజెన్సీ ద్వారా ఏర్పాట్లు వేగవంతం చేయాలన్నారు. అంతకుముందు ఆమె స్థానిక మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు. మున్సిపల్ కమిషనర్ టి.రమేశ్.. జాయింట్ డైరెక్టర్‌కు బొకేతో స్వాగతం పలికారు. మేనేజర్ అలీముద్దీన్, ఏఈ రాజ్‌కుమార్, రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు.