దేశంలో ప్రజాస్వామ్యం సజావుగా సాగేందుకు జర్నలిస్టులు స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉండాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బీఎన్ శ్రీకృష్ణ పిలుపునిచ్చారు. జర్నలిజంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకుగానూ ముంబై ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన వార్షిక రెడ్‌ఇంక్ అవార్డులను బీఎన్ శ్రీకృష్ణ ప్రదానం చేశారు. న్యాయవాది, జర్నలిస్టులు తప్పనిసరిగా స్వతంత్రంగా ఉండాలని చెప్పారు. వీళ్లు సరిగా లేకపోతే ప్రజాస్వామ్యం దెబ్బతింటుందన్నారు.
‘మీరు ఈ వృత్తిలో ఉన్నారంటే..నిజాయితీగా ఉండడమే ఉత్తమమైన విధానం.. ఇది గుర్తుంచుకోండి’ అని శ్రీకృష్ణ అన్నారు. ఇదిలా ఉండగా సీనియర్ జర్నలిస్ట్ టీజెఎస్ జార్జ్ ఎడిటర్, కాలమిస్ట్‌గా విశిష్ట సేవలందించినందుకు ఆయనకు రెడ్‌ఇంక్ అవార్డు అందజేశారు. 1960లో మిస్టర్ జార్జ్ (94) పాట్నా-ప్రధాన కార్యాలయ వార్తాపత్రిక 'ది సెర్చ్‌లైట్'కు సంపాదకులుగా ఉన్నారు. యూపీలోని పట్టణాలు, నగరాల్లోని కొవిడ్ మరణాల విషాదాన్ని బహిర్గతం చేసిన రిపోర్టర్లు, ఫోటోగ్రాఫర్ల బృందానికి నాయకత్వం వహించినందుకుగాను 'దైనిక్ భాస్కర్' నేషనల్ ఎడిటర్ ఓం గౌర్‌కు 2021కి ప్రెస్ క్లబ్ 'జర్నలిస్ట్ ఆఫ్ ది ఇయర్' అవార్డు లభించింది.

