
- భైంసా రెవెన్యూ కార్యాలయం ముట్టడి
భైంసా, వెలుగు: ఏండ్లుగా తమ గ్రామానికి రోడ్డు లేదని, ఇంకెప్పుడు వేస్తారంటూ భైంసా మండలంలోని కథ్గాం గ్రామస్తులు బుధవారం ఆందోళన చేపట్టారు. మాజీ సర్పంచ్ దెగ్లూర్ రాజు నేతృత్వంలో గ్రామస్తులు గ్రామ క్రాస్ రోడ్డు సమీపంలోని జాతీయ రహదారిపై బైఠాయించారు. రాస్తారోకో చేపట్టి ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న టౌన్ సీఐ గోపీనాథ్ నేతృత్వంలోని పోలీసులు వచ్చి అడ్డుకోవడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం గ్రామస్తులు ర్యాలీగా వెళ్లి రెవెన్యూ డివిజన్ రార్యాలయాన్ని ముట్టడించారు.
ఆర్డీవో కోమల్రెడ్డి బయటకు వెలుతుండగా ఆయన కారును అడ్డుకున్నారు. గ్రామానికి రోడ్డు వేస్తామని స్పష్టమైన హమీనిచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదలబోమని భీష్మించుకొని కూర్చున్నారు. సీఐ గోపీనాథ్ చేరుకొని వారిని సముదాయించే ప్రయత్నం చేయగా వినలేదు. దీంతో ఆర్డీవో కారులో నుంచి దిగి బయటకు ఆయనను మాజీ సర్పంచ్రాజు నిలదీశారు. తమ గ్రామంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, ప్రజలు అవస్తలు పడుతున్నా ఎందుకు కొత్తవి వేయడం లేదని ప్రశ్నించారు. ఉన్నతాధికారులకు సమస్యను వివరించి రోడ్డు వేయించేలా చూస్తానని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు తమ ఆందోళనలను విరమించారు.