పామును పట్టడానికి పోయి ప్రాణాలు పోగొట్టుకున్నడు

పామును పట్టడానికి పోయి ప్రాణాలు పోగొట్టుకున్నడు
  • కాటేసినా దవాఖానకు వెళ్లని మేకల కాపరి 
  • హాస్పిటల్​కు తరలిస్తుండగా మృతి
  • కుమ్రం భీమ్​ జిల్లా కౌటాలలో విషాదం

కాగజ్ నగర్, వెలుగు : అతడో మేకల కాపరి. పాములు పట్టడంలో సిద్ధహస్తుడు. ఆదివారం ఒకరి ఇంట్లో పాము కనిపించడంతో పట్టుకోబోయాడు. కాటు వేయడంతో ఏమవుతుందిలే అని నిర్లక్ష్యం వహించాడు. అదే ప్రాణం మీదకు తెచ్చింది. ఆలస్యంగా హాస్పిటల్​కు తీసుకువెళ్లడంతో చనిపోయాడు. కుమ్రం భీమ్ ​​జిల్లా కౌటాల మండలం కన్కి గ్రామానికి చెందిన నాయిని రమేశ్(34) మేకల కాపరి. ఆదివారం అకాడి పండగ ఉండడంతో మేకలు కాయడానికి వెళ్లలేదు. గ్రామంలోని ఓ ఇంట్లో పాము ఉందని తెలియడంతో అక్కడికి పరిగెత్తాడు. అక్కడివారు నాగుపాము అని జాగ్రత్తలు చెప్పగా ఇలాంటి పాములను ఎన్నో పట్టుకున్నానని సమాధానమిచ్చాడు. తోకను పట్టుకోగా కాటేసింది.

అయినా, భయపడకుండా పామును పట్టుకుని అడవిలో వదిలేశాడు. ఏం కాదనుకుని హాస్పిటల్​కు వెళ్లకుండా ఇంటికి వెళ్లాడు. కొద్దిసేపటికే కండ్లు తిరిగి పడిపోయాడు. భార్య ఏమైందని అడగ్గా పాము కరిచిందని చెప్పి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కుటుంబసభ్యులు కాగజ్ నగర్ హాస్పిటల్​కు తరలిస్తుండగా చనిపోయాడు. 8 కిలోమీటర్ల దూరంలో పీహెచ్​సీకి తీసుకువెళ్తే యాంటీ స్నేక్​వీనమ్​ ఇంజక్షన్​తో బతికే అవకాశం ఉండేది. కానీ, మెరుగైన వైద్యం అందుతుందనే ఆశతో 40 కిలోమీటర్ల దూరంలోని కాగజ్​నగర్​ దవాఖానకు తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి భార్య పార్వతి, కొడుకు హరీశ్​ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

హాస్టల్ గ్రౌండ్​లో స్టూడెంట్​కు పాము కాటు

జైనూర్, వెలుగు : కుమ్రం భీమ్​ ఆసిఫాబాద్​ జిల్లాలోని మార్లవాయి గిరిజన ఆశ్రమ హాస్టల్ లో ఓ స్టూడెంట్‌‌ ఆడుకుంటుండగా పాము కాటేసింది. వెంటనే హాస్పిటల్​కు తీసుకువెళ్లడంతో ప్రాణాలు దక్కాయి. సిర్పూర్ యు మండలంలోని పాములవాడకు చెందిన మెస్రం శ్రీకృష్ణ మార్లవాయి హాస్టల్ లో ఉంటూ 6వ తరగతి చదువుతున్నాడు.

ఆదివారం సెలవు కావడంతో  గ్రౌండ్​లో ఆడుకుంటుండగా పాము కాటేసింది. దీంతో జైనూర్ హాస్పిటల్ కు, అక్కడి నుంచి ఉట్నూర్ కు తరలించినట్లు హాస్టల్ వార్డెన్ పెందోర్ జైవంత్ రావు తెలిపారు. ప్రస్తుతం శ్రీకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.