స్వేద పత్రాలు కాదు.. ఆత్మపరిశీలన అవసరం

స్వేద పత్రాలు కాదు.. ఆత్మపరిశీలన అవసరం

కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయటంతో, ఒక్కసారిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విస్తృతమైన చర్చకు దారితీసింది. ఈ చర్చ వల్ల రాష్ట్రం ఎంత ఆర్థికంగా పురోగతి సాధించింది, ఏ రంగాలలో ఎంత అభివృద్ధి వచ్చింది, రాష్ట్రానికి ఎంత ఆదాయం వచ్చింది, ఎన్ని కొత్తగా అప్పులు చేసింది స్పష్టమైన అవగాహన రాష్ట్రాల ప్రజల ముందుకు వచ్చింది. దానికి సమాధానంగా గత ప్రభుత్వం అప్పులే కాదు ఆస్తులు పెంచామని స్వేద పత్రంతో.. పెంచిన ఆస్తి గురించి వివరించే ప్రయత్నం బీఆర్​ఎస్​ చేసింది. 

ఆస్తులతో పాటు విలువ కట్టలేని మరెన్నో ఆస్తులు పెరిగాయనే విషయాన్ని మాజీ మంత్రి  కేటీ రామారావు  స్వేద పత్రం ప్రజెంటేషన్​ చేశారు. భూముల విలువలు పెరిగాయి, కుటుంబ గౌరవాలు పెరిగాయి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లతో ఎంతో ఉరట లభించింది అని, వృద్ధాప్య పెన్షన్లతో వృద్ధులకు పెద్ద భరోసానిచ్చింది లాంటివి, విలువ కట్టలేని ఆస్తుల గురించి చెప్పారు. వాటిలో వాస్తవమెంత అనే చర్చ ఉన్నా, వెలకట్టలేని, తిరిగిరాని నష్టాలను కూడా గత ప్రభుత్వం చేసిందనే విషయాన్ని విస్మరించకూడదు.

ప్రభుత్వ విద్య విధ్వంసమైంది

 బీఆర్​ఎస్​ ప్రభుత్వం ముఖ్యంగా విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. రాష్ట్ర విద్యార్థుల  భవిష్యత్తును అంధకారం చేసింది. ఒకప్పుడు   గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకే తమ పిల్లలను పంపించడానికి పేరెంట్స్​ ఎక్కువగా మక్కువ చూపించేవారు. కానీ నేడు అవన్నీ మూతపడే స్థాయికి చేరుకొని, ప్రతి పల్లెలోనూ ప్రైవేటు పాఠశాలల బస్సులు రై రై మంటూ గల్లి గల్లిలో తిరుగుతుండడం నేడు చూస్తూ ఉన్నాం. ఉన్న పాఠశాలలో ఉపాధ్యాయులు లేక విజ్ఞానాన్ని పంచే విజ్ఞాన ఘనులు లేక తెలంగాణలోని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఎంతో వెనుకబడిపోయాయి. 

పాఠశాల పునర్నిర్మాణం పేరుతో కేవలం భవనాలు మాత్రమే కట్టి అవసరమైన విజ్ఞాన పరికరాలు, లాబరేటరీలు, పుస్తకాలు, అధ్యాపకులు నింపక, వెలకట్టలేని తిరిగిరాని నష్టాలకు ప్రభుత్వ విద్యావ్యవస్థను గురిచేశారు.  ఉద్యమంలో కళాశాల, విశ్వవిద్యాలయాల విద్యార్థులు తెలంగాణ పల్లె పల్లెల్లో తెలంగాణ ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లారు.  తమ జీవితాలను పణంగా పెట్టారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఏ రకమైన కార్యక్రమాలు చేయకపోవడం, ఆ వైఫల్యాన్ని బీఆర్​ఎస్​ ఇప్పటికీ అంగీకరించకపోవడం శోచనీయం.   

దాదాపుగా రెండు దశాబ్దాలకు పైగా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు యువకులకు సరైన మార్గదర్శకం లేక రెండు తరాలు పూర్తిగా ఆగమైపోయిన పరిస్థితి కళ్ళకు కనబడుతున్నది.  యువకుల యవ్వనం అంతా కూడా పోరాటంతోనే గడిచి  మానసిక క్షోభలను  ఎదుర్కొంటున్న  పేద బిడ్డల గోస వెలకట్టలేనిది. తిరిగి రానిది. నోటిఫికేషన్లు ఇస్తామని ప్రతి రోజు ఊరిస్తూ ప్రకటనలు ఇచ్చి పరీక్షలు విఫలమై, లీకులైనపుడు ఆ కుటుంబాలు పడ్డ గోసా మామూలుది కాదు. బీఆర్​ఎస్​ స్వేద పత్రంలో ఆ విషయం లేదెందుకు? 

భూ తగాదాలు పెంచారు

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతుల భూ సమస్యలపై ఆనాటి అధికార పార్టీ  పత్రిక ధర్మగంట పేరుతో అనేక రోజులు పత్రిక నిండా పుంకాను పుంకాలుగా రైతులు పడుతున్న బాధలు, వెతలు, సమస్యలను ధారావాహిక కార్యక్రమాన్ని కొనసాగించింది. తదుపరి ధరణి కష్టాలు దద్దరిల్లినా, దయ చూపకపోవడం, వాటి పరిష్కారం కోసం ప్రకటనలు అయితే చేసింది కానీ, అనువంతైన పురోగతి సాధించలేకపోవడం ప్రజలు మర్చిపోలేదు. నిజాం నవాబు కాలంలో తెలంగాణ భూముల సర్వే జరిగి ఆ సరిహద్దుల నిర్ణయాలు జరిగాయి, నాటి తెలంగాణ కొత్త ప్రభుత్వం తెలంగాణలో ఇంచు ఇంచు భూమి సర్వే చేపట్టి సరిహద్దులను నిర్ణయించి అక్షాంశాలు, రేఖాంశాల ద్వారా హద్దులను పెట్టి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని అందిస్తామని చెప్పినప్పుడు రైతులు సంతోషించారు. 

తదుపరి భూ తగాదాలతో అన్నదమ్ములు, అక్క చెల్లెలు, దగ్గరి బంధువులు, స్నేహితులు, ఇరుగుపొరుగు అందరు కూడా శత్రువులుగా మారిన వైనం ఈ తెలంగాణ ప్రజలు మరువలేనిది. ఒకరి భూమి ఇంకొకరి పేరు మీద రావటం, ఒకరు కబ్జాలో ఉంటే మరొకరికి ఆ భూమి పట్టాలు ఉండటం, నేటికీ కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ, నాయకుల చుట్టూ, పల్లెల్లో పెద్ద మనుషుల చుట్టూ తిరిగి, వేలకు వేలు ఖర్చుపెట్టినా నేటికీ ఆ సమస్యలు తీరక, ఆ కుటుంబాలు పడుతున్న ఆవేదన వెలకట్టలేనిది, తిరిగి రాలేనిది. దానిపై స్వేద పత్రంలో జవాబే లేదు.

వెలకట్టలేని నష్టాలు 

గత ప్రభుత్వం వెలకట్టలేని ఆస్తుల సృష్టి ఏమిటో  కానీ.. వెలకట్టలేని నష్టాలు, బాధలు మాత్రం ఎన్నో ఉన్నాయి.  కానీ మేకపోతు గాంభీర్యంతో ఆ తప్పులను మళ్లీ కప్పిచ్చుకునే ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం క్షమించదు.  ఆత్మపరిశీలనలేని స్వేద పత్రం సాధించేదేముంటది? ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల సమస్యలతో మమేకం కాకపోతే, సేద పత్రాలతో స్వేద తీరాల్సిందే!  తెలంగాణ సమాజం పాలకుల నిర్లక్ష్య  వైఖరిని,   అహంకారాన్ని ఎప్పుడూ సహించలేదు. 

చిట్టెడ్డి  కృష్ణా రెడ్డి ,అసిస్టెంట్ ప్రొఫెసర్,  హెచ్​సీ యూ