తైవాన్​ కొత్త ప్రెసిడెంట్‌గా ‘లై చింగ్​తే’

తైవాన్​ కొత్త ప్రెసిడెంట్‌గా ‘లై చింగ్​తే’
  •  చైనాను ఎదిరించే పార్టీకి పట్టం కట్టిన ప్రజలు
  •  తైవాన్​పై చైనా ఒత్తిళ్లు పెరగొచ్చంటున్న నిపుణులు


తైపీ: తైవాన్ కొత్త ప్రెసిడెంట్​గా లై చింగ్ తే ఎన్నికయ్యారు. శనివారం జరిగిన అధ్యక్ష, పార్లమెంటు ఎన్నికల్లో అధికార డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ(డీపీపీ)కి చెందిన ఆయనకు తైవాన్ ప్రజలు పట్టం కట్టారు. ప్రస్తుత తైవాన్ అధ్యక్షురాలు త్సయి ఇంగ్-వెన్ స్థానంలో త్వరలో ఆయన బాధ్యతలు చేపడతారు. గతంలో వరుసగా రెండు సార్లు ఆమె ప్రెసిడెంట్​గా ఎన్నికయ్యారు. ఆ దేశ రాజ్యాంగం ప్రకారం మరోసారి పోటీ చేసేందుకు అవకాశం లేకపోవడంతో తన రాజకీయ వారసుడిగా లై చింగ్​ను ప్రకటించారు. లై చింగ్ గెలుపుతో తైవాన్ చిరకాల ప్రత్యర్థి చైనాకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. వేర్పాటు వాది, సమస్యలు సృష్టిస్తాడని.. లైచింగ్​ను ఎన్నుకోవద్దని ప్రతిపక్ష పార్టీలు చేసిన ప్రచారాన్ని ప్రజలు తిరస్కరించారు. అత్యధిక శాతం మంది ఆయనకే ఓటు వేశారు. తైవాన్‌‌ దేశానికి ప్రత్యేక గుర్తింపు కోసం డీపీపీ పోరాడుతున్నది. చైనాకు వ్యతిరేకంగా గళం ఎత్తుతోంది. తైవాన్ ఆల్ రెడీ స్వతంత్ర దేశమని.. మళ్లీ ఆ విషయాన్ని నిరూపించుకోవాల్సిన అవసరంలేదని ఈ ఎన్నికల్లో లై చింగ్ ​ప్రకటించారు.

కొత్త ప్రెసిడెంట్​పై చైనా ఒత్తిళ్లు!

ఎన్నికలకు ముందు లైచింగ్​ను చైనా ప్రమాదకరమైన వేర్పాటువాది అని పలుసార్లు విమర్శించింది. చర్చల కోసం ఆయన ఇచ్చిన పిలుపును తిరస్కరించింది. తైవాన్ ఎన్నికలకు ముందు చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తైవాన్ చైనాలో భాగమని, మాతృభూమి పునరేకీకరణ తప్పక చేస్తామని ప్రకటించారు. ఆ దేశంలోని అధికార డీపీపీ తైవాన్ స్వాతంత్ర్యానికి మొండిగా పట్టుబడితే.. వాణిజ్య ఆంక్షలు పెడతామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో లై చింగ్ విజయం చైనాకు నచ్చకపోవచ్చని గ్లోబల్ పొలిటికల్​ఎక్స్​పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. అలాగే ప్రెసిడెంట్​గా ఎన్నికైన అతనిపై ఒత్తిడి తెచ్చేందుకు ఆ దేశం ప్రయత్నించే అవకాశం ఉందంటున్నారు.