మెదక్​ టూ రుద్రూర్​ హైవేకు త్వరలో భూసేకరణ

మెదక్​ టూ రుద్రూర్​ హైవేకు త్వరలో భూసేకరణ
  • మెదక్​ టూ రుద్రూర్​ హైవేకు త్వరలో భూసేకరణ
  • 89.2 కిలోమీటర్లకు రూ. 899.6 కోట్లు ఫండ్స్ శాంక్షన్​
  • ఎల్లారెడ్డి, బాన్స్​వాడ మీదుగా నిర్మాణం 
  • మెదక్​, కామారెడ్డి, నిజామాబాద్​జిల్లాల్లో భూసేకరణ ప్రక్రియ షురూ..

కామారెడ్డి , వెలుగు: హైదరాబాద్ టూ మెదక్​ మధ్య డబుల్ ​లైన్​ హైవేగా గుర్తించి రోడ్డు నిర్మాణం పూర్తి చేసిన కేంద్ర ప్రభుత్వం.. మెదక్​ నుంచి రుద్రూర్​వరకు కూడా హైవే నిర్మాణానికి ఇటీవల గ్రీన్​సిగ్నల్​ఇచ్చింది. 89.2 కి.మీ.   హైవే నిర్మాణం కోసం రూ.899.6 కోట్ల ఫండ్స్​శాంక్షన్​ చేసింది. మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ ​జిల్లాల్లో దీనికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియను కూడా అధికారులు షురూ చేశారు. ఈ నెలాఖరులో టెండర్ల ప్రక్రియ కూడా మొదలు పెట్టి,  త్వరలోనే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. ప్రమాదాలను నివారించడం, ఆయా ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యాలు మరింతగా మెరుగుపరచాలనే ఉద్ధేశ్యంతో కేంద్ర ప్రభుత్వం హైవేల నిర్మాణం చేపడుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్​నుంచి మెదక్ జిల్లా మీదుగా కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి వరకు ఉన్న ఆర్​అండ్​బీ రోడ్డును హైవేగా గుర్తించారు.  ఎన్ హెచ్​765 D నంబర్​ కేటాయించారు.   హైదరాబాద్​ నుంచి మెదక్​ జిల్లా కేంద్రం వరకు పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.  

రెండు బిట్లుగా పనులు..

మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో జరిగే హైవే నిర్మాణ పనులను రెండు బిట్లుగా విభజించారు. మెదక్​ జిల్లా నుంచి  కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి వరకు  43.9  కి.మీ. పనులకు రూ.399.8 కోట్లు కేటాయించారు. ఎల్లారెడ్డి నుంచి బాన్స్​వాడ మీదుగా నిజామాబాద్​ జిల్లా రుద్రూర్  వరకు 54.3 కి.మీ మేర పనుల కోసం రూ.499. 8 కోట్ల ఫండ్స్​ కేటాయించారు.  ఇప్పటికే సర్వే  పూర్తి చేసి భూసేకరణ చేస్తున్నారు.  

మలుపులు లేకుండా..

మెదక్​నుంచి రుద్రూర్​వరకు ప్రస్తుతం ఉన్న రోడ్డు చాలా చోట్ల మలుపులు ఉండి తరచూ ప్రమాదాలకు కారణమవుతోంది.   వీటిని తగ్గించేందుకు ఆయా చోట్ల  మలుపులను తొలగించి నేరుగా డబుల్ హైవే నిర్మిస్తున్నారు. గ్రామాలు ఉన్న చోట రెండు పక్కల సర్వీసు రోడ్ల నిర్మాణం ఉంటుంది. లైటింగ్​ కూడా ఏర్పాటు చేస్తారు.  మూల మలుపుల నివారణ, రోడ్డు విస్తరణ,  గ్రామాల సమీపంలో సర్వీస్​ రోడ్ల నిర్మాణం చేపడుతుండడంతో భూసేకరణ చేయాల్సి ఉంది.  మెదక్​, కామారెడ్డి, నిజామాబాద్​ జిల్లాల్లో కలిపి 90 ఎకరాల భూ సేకరణ చేపట్టాల్సి ఉందని ఆఫీసర్లు తెలిపారు.  ఇందుకు సంబంధించి  రెవెన్యూ  ఆఫీసర్లు త్వరలోనే నోటిఫికేషన్​ ఇవ్వనున్నారు. నిర్మాణ పనుల కోసం ఈ నెలలో   ఎన్​హెచ్ఏఐ ఆఫీసర్లు టెండర్లను కూడా పిలవనున్నారు.  ఈ హైవే నిర్మాణంతో3  జిల్లాలతో పాటు,  మహారాష్ర్టలోని ఆయా ప్రాంతాలకు వెళ్లేవారికి కూడా సౌకర్యంగా ఉంటుంది.   ఈ హైవే నుంచి  హైదరాబాద్​- నాందేడ్​- అకోల హైవేకు కూడా అనుసంధానం కానుంది.

త్వరలోనే పనులు షురూ 

మెదక్, -ఎల్లారెడ్డి, రుద్రూర్​మధ్య త్వరలోనే హైవే నిర్మాణ పనులు ప్రారంభిస్తాం. భూ సేకరణ  ప్రక్రియ చివరి దశలో ఉంది.  వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం. హైవే నిర్మాణంతో రవాణా సౌలత్​మెరుగుపడుతుంది. 
– కాంతారావు, ఈఈ, నేషనల్​హైవే అథారిటీ