మహిళా బిల్లు పాస్..భారీ మెజార్టీతో ఆమోదించిన లోక్ సభ

మహిళా బిల్లు పాస్..భారీ మెజార్టీతో ఆమోదించిన లోక్ సభ
  • సభలో 7 గంటలపాటు సుదీర్ఘ చర్చ 
  • ఓబీసీ కోటా చేర్చాలి.. వెంటనే అమలుచేయాలి: సోనియా 
  • బిల్లులో రెండు అంశాలు చిత్రంగా ఉన్నాయి: రాహుల్ 
  • వెంటనే అమలుచేస్తే చిక్కులొస్తయ్: మేఘ్వాల్ 
  • సీట్లను మేం రిజర్వ్ చేస్తే ఒప్పుకుంటరా?..  
  • ఆ పని డీలిమిటేషన్ కమిషనే చేయాలి: అమిత్ షా  
  • ఇయ్యాల రాజ్యసభ ముందుకు బిల్లు  

న్యూఢిల్లీ : లోక్ సభ, అసెంబ్లీ సీట్లలో మహిళలకు 33% రిజర్వేషన్లకు సంబంధించిన చరిత్రాత్మక ‘నారీ శక్తి వందన్ అధినియం’ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. ఒక్క ఎంఐఎం పార్టీ మినహా అధికార బీజేపీతోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్ సహా అన్ని పార్టీలూ బిల్లుకు అనుకూలంగా ఓటేశాయి. మహిళా బిల్లుపై బుధవారం లోక్ సభలో స్పీకర్ ఓం బిర్లా వాయిస్ ఓట్ ద్వారా ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 454 మంది సభ్యులు, వ్యతిరేకంగా ఇద్దరు సభ్యులు ఓటేశారు. 

దీంతో లోక్ సభలో తొలిసారిగా మహిళా బిల్లు భారీ మెజార్టీతో గట్టెక్కినట్లయింది. ఇక ఈ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానుంది. లోక్ సభలో బిల్లుపై ఓటింగ్​కు ముందు సభలో దాదాపు 7 గంటల పాటు సుదీర్ఘంగా చర్చ జరిగింది. డిబేట్ లో 34 పార్టీల నుంచి 60 మంది సభ్యులు మాట్లాడారు. ప్రతిపక్షం నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కనిమొళి, తదితరులు మాట్లాడగా.. కేంద్ర మంత్రులు అమిత్ షా, స్మృతి ఇరానీ, అర్జున్ రామ్ మేఘ్వాల్ సమాధానాలిచ్చారు. చర్చ సందర్భంగా అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, ఇతర పార్టీల సభ్యుల మధ్య వాడివేడిగా వాదోపవాదాలు జరిగాయి. సోనియా గాంధీ బిల్లుకు మద్దతు తెలుపుతూనే ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. 

Also Read : రుణమాఫీ, గృహలక్ష్మితో మైలేజ్ పెరిగింది : గొంగిడి మహేందర్ రెడ్డి

మహిళా కోటాలో ఓబీసీలకూ రిజర్వేషన్లు కల్పించాలని, బిల్లు పాస్ అయిన వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా బిల్లు దిశగా యూపీఏ ప్రభుత్వ హయాంలోనే  పునాది పడిందన్నారు. జనాభా లెక్కింపు, డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) తర్వాతే బిల్లును అమలు చేయాలనడం విచిత్రంగా ఉందని, ఓబీసీ కోటా లేకుండా ఈ బిల్లు అసంపూర్ణమని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఇతర ప్రతిపక్ష పార్టీల సభ్యులు సైతం ఇదే అంశంపై అభ్యంతరం లేవనెత్తారు. లోక్ సభలో ఈ బిల్లును ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఆయన పార్టీకి చెందిన మరో ఎంపీ మాత్రమే వ్యతిరేకించారు. ఓబీసీ, ముస్లిం మహిళలకు రిజర్వేషన్ లేనందున బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.     
చిక్కులు రావద్దనే ఇలా చేస్తున్నం: మేఘ్వాల్  

మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లను జనాభా లెక్కింపు, డీలిమిటేషన్ తర్వాతే అమలు చేయాలంటూ బిల్లులో చేర్చిన నిబంధన రాజ్యాంగానికి అనుగుణంగానే ఉందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్​ రామ్ మేఘ్వాల్ స్పష్టం చేశారు. లోక్ సభలో మహిళా బిల్లు(128వ రాజ్యాంగ సవరణ బిల్లు, 2023)పై చర్చ సందర్భంగా ఆయన సమాధానమిచ్చారు. సెన్సస్, డీలిమిటేషన్ చేపట్టకుండా వెంటనే మహిళా బిల్లును అమలు చేస్తే అది రాజ్యాంగంలోని నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుందన్నారు. ‘‘ప్రతిపక్షాల మద్దతుతో ఇప్పుడు బిల్లు పాస్ కావచ్చు. కానీ వెంటనే అమలు చేస్తే కోర్టుల్లో న్యాయపరమైన చిక్కులు వస్తాయి. మీరే అప్పుడు బిల్లును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిల్స్ కూడా వేయొచ్చు. అందుకే టెక్నికల్ గా బిల్లుకు ఎలాంటి అడ్డంకులు రాకూడదనే మేం ప్రయత్నిస్తున్నాం” అని ఆయన వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ బిల్లును పాస్ చేయించలేకపోయిందని, ఇప్పుడు మాత్రం రాజకీయం చేస్తోందన్నారు. ఓబీసీ రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ చేసిన కామెంట్లపైనా ఆయన ఘాటుగా స్పందించారు. ‘‘డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను కాంగ్రెస్సే ఎన్నికల్లో ఓడించింది. ఆయనకు మీరు భారతరత్న కూడా ఇవ్వలేదు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఆయన ఫొటోను ఉంచేందుకు కూడా మీరు అనుమతించలేదు” అంటూ మండిపడ్డారు. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించాలని దేశంలోనే తొలిసారిగా బీజేపీ తీర్మానం చేసిందన్నారు. వడోదరలో 1994లో జరిగిన సమావేశంలో బీజేపీ ఈ తీర్మానం చేసిందని ఆయన గుర్తు చేశారు.    

గ్రీన్, రెడ్ స్లిప్​లతో ఓటింగ్ 

మహిళా బిల్లుపై లోక్ సభలో వాయిస్ ఓటింగ్ ప్రక్రియ సాధారణ సమయం కన్నా ఆలస్యమైంది. కొత్త బిల్డింగ్ కావడంతో కొన్ని టెక్నికల్ సమస్యలు రావడమే ఇందుకు కారణమైంది. మామూలుగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ నిర్వహించాలి. కానీ కొత్త బిల్డింగ్ లో మంగళవారం నుంచే సమావేశాలు ప్రారంభం కావడంతో ఎలక్ట్రానిక్ ఓటింగ్ నిర్వహించేందుకు ఇంకా ఏర్పాట్లు పూర్తికాలేదు. సభ్యులకు సీట్ల కేటాయింపు, డివిజన్ ల విభజన కూడా జరగలేదు. దీంతో ఎలక్ట్రానిక్ ఓటింగ్​కు అవకాశం లేకపోయింది. ఆడియో కనెక్షన్లు సరిగ్గా లేకపోవడం, కొత్త బిల్స్ స్క్రీన్లపై సడెన్ గా ప్రత్యక్షం అవుతుండటంతో సభ్యులు గందరగోళానికి గురయ్యారు. ఈ విషయాలన్నీ పరిశీలించిన స్పీకర్ ఓం బిర్లా రూల్ 367 ప్రకారం స్లిప్ ల ద్వారా ఓటింగ్ నిర్వహించారు. ఇందుకోసం రెడ్, గ్రీన్ కలర్ తో కూడిన రెండు వేర్వేరు స్లిప్ లను సభ్యులందరికీ పంపిణీ చేశారు. ‘‘బిల్లుకు మద్దతిస్తే గ్రీన్ స్లిప్ పై పేరు రాసి, సంతకం చేయాలి. వ్యతిరేకిస్తే రెడ్ స్లిప్ పై పేరు రాసి, సంతకం చేయాలి. వారి నియోజకవర్గం పేరుతోపాటు ఐడీ కార్డ్ నెంబర్ కూడా రాయాలి. ఓటింగ్ కు దూరంగా ఉండాలనుకునే వారు యెల్లో కలర్ స్లిప్ పై తమ వివరాలు రాయాలి” అని సూచించారు. ఇలా సభ్యులు వివరాలన్నీ నింపిన స్లిప్ లను సిబ్బంది సేకరించారు. ఓటింగ్ పూర్తయ్యేదాకా సభ్యులెవరూ సీట్లలో నుంచి లేచివెళ్లేందుకు అనుమతించలేదు. స్లిప్ లను కౌంట్ చేశాక బిల్లు భారీ మెజార్టీతో పాస్ అయినట్లు స్పీకర్ ప్రకటించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు కనీసం 33 శాతం రిజర్వేషన్లు ఉండేలా చేసుకున్నం. మరింత సంతోషకరమైన విషయమేమిటంటే.. రాష్ట్ర అసెంబ్లీలు, లోక్‌‌సభలో మహిళలకు ఇదే విధమైన రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదన ఇప్పుడు రూపుదిద్దుకుంటోంది. జెండర్ జస్టిస్ కోసం చేపట్టిన అత్యంత 
విప్లవాత్మక మార్పు ఇది.

  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించిన వెంటనే అమల్లోకి తీసుకురావాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకూ కోటా ఇవ్వాలి. ఏ మాత్రం ఆలస్యం చేసినా మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. పొగతో నిండిన వంట గదుల నుంచి ప్రకాశవంత మైన స్టేడియాల వరకు భారతీయ మహిళల ప్రయాణం సుదీర్ఘమైనది. 
- సోనియా గాంధీ

రిజర్వేషన్లను వెంటనే అమల్లోకి తీసుకురావాలని ప్రతిపక్షాలు డిమాండ్‌‌ చేస్తున్నాయి. రాజ్యాంగ ప్రక్రియను ఫాలో కావద్దా?  రాజ్యాంగానికి కట్టుబడి ఉండొద్దా?  స్థానిక సంస్థల్లో మహిళల  రిజర్వేషన్  బిల్లును ఒక్క కుటుంబమే తీసుకురాలేదు. పీవీ నర్సింహారావు ప్రభుత్వం తెచ్చింది. కనీసం ఆయన పార్థివ దేహాన్ని కాంగ్రెస్‌‌ ఆఫీసులోకి రానివ్వ లేదు.

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

రాజ్యాంగ (128వ సవరణ) బిల్లు, 2023 లోక్ సభలో భారీ మెజార్టీతో ఆమోదం పొందడం పట్ల చాలా సంతోషంగా ఉంది. పార్టీలకు అతీతంగా ఈ బిల్లుకు మద్దతిస్తూ ఓటేసిన ఎంపీలందరికీ నా థ్యాంక్స్. నారీ శక్తి వందన్​ అధినియం ఒక చరిత్రాత్మకమైన చట్టం అవుతుంది. ఇది మహిళల సాధికారతకు ఊతమిస్తుంది. మన రాజకీయ వ్యవస్థలో మహిళల భాగస్వామ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. 

ప్రధాని నరేంద్ర మోదీ