
- భూనిర్వాసితులు, స్థానికులు కేవలం 400 మందే
- ఇంటికో ఉద్యోగం హామీని అమలు చేయని సింగరేణి
- ఉపాధి కోసం దిక్కులు చూస్తున్న నిరుద్యోగ యువత
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్(ఎస్టీపీపీ) తెలంగాణలో విద్యుత్ వెలుగులు పంచుతుండగా, భూనిర్వాసితుల బతుకులు మాత్రం చీకట్లో మగ్గుతున్నాయి. ప్లాంట్ ఏర్పాటుకు లక్షల విలువైన భూములు ఇచ్చిన కుటుంబాల్లో ఒకరికి పర్మినెంట్ జాబ్, స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్న సింగరేణి ఆఫీసర్లు ఆ తర్వాత మొండిచేయి చూపారు. ఇటు సాగు భూములు పోయి.. అటు ఉద్యోగాలు రాక నిర్వాసితుల బతుకులు ఆగమయ్యాయి. ఉత్తరాది రాష్ర్టాలకు చెందినవారు భారీగా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగాల్లో తిష్ఠ వేయడంతో స్థానిక యువత ఉపాధి కోసం దిక్కులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
స్థానికులు 400 మందే..
ఉమ్మడి రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2005లో ఎస్టీపీపీకి అంకురార్పణ చేశారు. 2009లో ప్లాంట్ నిర్మాణ పనులు స్టార్ట్ చేసి ఆరేండ్లలో పూర్తి చేశారు. 2016లో ఎస్టీపీపీలో కరెంట్ ఉత్పత్తి ప్రారంభించారు. ప్లాంట్‌ఏర్పాటుకు జైపూర్ మండలంలోని పెగడపల్లి, గంగిపల్లి, ఎల్కంటి గ్రామాల పరిధిలో 1,883 ఎకరాల వ్యవసాయ భూములు సేకరించారు. 825 నిర్వాసిత కుటుంబాల్లో ఇంటికో ఉద్యోగం ఇస్తామని, స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని అప్పట్లో సింగరేణి ఆఫీసర్లు హామీ ఇవ్వడంతో ప్రజలు భూములు ఇచ్చారు. ఆ తర్వాత ఈ హామీలేవీ అమలు కాలేదు. ప్రస్తుతం ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి విభాగంలో 1,470 మంది, సివిల్ డిపార్ట్మెంట్లో మరో 250 మంది వరకు పనిచేస్తున్నారు. వీరిలో స్థానికులు కేవలం 400 మంది ఉండగా, భూనిర్వాసిత కుటుంబాల్లో 200 మందికే ఉద్యోగాలు దక్కడం సింగరేణి ఆఫీసర్ల తీరుకు నిదర్శనంగా చెప్పవచ్చు.
ఉత్తరాది వారికే ప్రాధాన్యం..
ఎస్టీపీపీలో ఆపరేషన్స్అండ్ మెయింటనెన్స్‌ను సింగరేణి సంస్థ ప్రైవేట్‌సంస్థలకు అప్పగించి చేతుల దులుపుకుంది. సింగరేణి ఆఫీసర్లు అబ్జర్వేషన్కే పరిమితమై భూనిర్వాసితుల గోడును విస్మరించారు. దీంతో కాంట్రాక్టర్లు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్తదితర ఉత్తరాది రాష్ర్టాలకు చెందిన వారిని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ఉద్యోగాల్లో నియమించుకున్నారు. స్థానిక యువతకు డిగ్రీ, పాలిటెక్నిక్, బీటెక్, ఎంటెక్ విద్యార్హతలు ఉన్నప్పటికీ వీరిని అన్స్కిల్డ్జాబ్స్కే పరిమితం చేశారు. ఉద్యోగ నియామకాలతో పాటు వేతనాల చెల్లింపుల్లోనూ వ్యత్యాసం చూపుతున్నారు. అన్స్కిల్డ్లేబర్కు రోజుకు రూ.475, సెమీ స్కిల్డ్వారికి రూ.520 మాత్రమే చెల్లిస్తున్నారు. అర్హతలను బట్టి స్కిల్డ్జాబ్స్ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఇక్కడి వారిపై వివక్ష చూపుతూ దూరం పెడ్తున్నారు. భూసేకరణ టైంలో ఇచ్చిన హామీ ప్రకారం భూనిర్వాసితుల్లో ఇంటికో జాబ్, 80 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని ఆందోళనలు చేస్తున్నా ఇటు సింగరేణి ఆఫీసర్లు గానీ, అటు కాంట్రాక్టర్లు గానీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్లాంట్ విస్తరణతోనైనా న్యాయం జరిగేనా?
ఎస్టీపీపీలో ప్రస్తుతం 600 మెగావాట్ల రెండు యూనిట్ల ద్వారా 1,200 మెగావాట్ల కరెంట్ఉత్పత్తి చేస్తున్నారు. బొగ్గు తవ్వకాల కంటే విద్యుత్ ఉత్పత్తే లాభదాయంగా ఉండడంతో ఇటీవల ప్లాంట్విస్తరణ పనులు చేపడ్తున్నారు. 800 మెగావాట్ల సామర్థ్యంతో మూడో యూనిట్ఏర్పాటుకు రూ.6,500 కోట్లతో టెండర్లు నిర్వహించారు. భారత్హేవీ ఎలక్ర్టానిక్స్లిమిటెడ్(భేల్) ఈ టెండర్దక్కించుకుంది. ఇది పూర్తికాగానే 800 మెగావాట్ల కెపాసిటీతో మరొక యూనిట్ ఏర్పాటుకు ప్లాన్‌రెడీ చేస్తున్నారు. వచ్చే ఐదారేండ్లలో ఎస్టీపీపీ సామర్థ్యం 2,800 మెగావాట్లకు చేరుకునే చాన్స్ ఉంది. ఇక్కడి భూములు, బొగ్గు, నీళ్లు, ఇతర వనరులతో కరెంట్ఉత్పత్తి చేస్తున్న సింగరేణి సంస్థ ఏటా రూ.500 కోట్ల లాభాలు ఆర్జిస్తోంది. ఉద్యోగావకాశాల్లో మాత్రం భూనిర్వాసితులకు, స్థానికులకు తీరని అన్యాయం చేస్తోంది.