మన ఫ్యాన్స్: ఐ15 కోసం 17 గంటలు క్యూ లైన్లో..

మన ఫ్యాన్స్: ఐ15 కోసం 17 గంటలు క్యూ లైన్లో..

ఎంతగానో ఎదురు చూస్తున్న ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ ఇండియా మార్కెట్లోకి రానే వచ్చింది. ఆపిల్ iPhone15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max సిరీస్ ను విడుదల చేసింది. అయితే ఈ ఫోన్ల కోసం ఔత్సాహికులు స్టోర్ల ముందు క్యూకట్టి గంటల తరబడి నిలబడి మరీ కొనుగోలు చేస్తున్నారు.. ఇలాంటి దృశ్యాలు కేవలం పాశ్చాత్య దేశాల్లోనే కనిపిస్తాయనుకున్నాం గానీ.. ఇప్పుడు ఇండియాలో ఐఫోన్ స్టోర్ల ముందర కూడా దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై ఐఫోన్ స్టోర్ల ముందు కస్టమర్ల క్యూలో నిల్చొని మరీ కొనుగోలు చేస్తున్నారు. ఓ కస్టమర్ కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ 15 కొనుగోలు చేసేందుకు ఏకంగా 17 గంటలు ఆపిల్ స్టోర్ వెలుపల ఓపికగా నిల్చి వున్నాడు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఐఫోన్ కొనుగోలు చేసేందుకు ఓ వ్యక్తి ఏకంగా అహ్మదాబాద్ నుంచి ముంబైకి ప్రయాణం చేశాడు.  ఐఫోన్ కొనడానికి స్టోర్ ముందు 17 గంటలు లైన్లో ఉన్నాడు. ఎట్టకేలకు తనకు కావాల్సి ఐఫోన్ 256 GB స్టోరేజ్‌తో వైట్ టైటానియంలో iPhone 15 Pro Maxని దక్కించుకున్నాడు. 

వివేక్ అనే మరో ఆపిల్ ప్రేమికుడు కొత్త ఐఫోన్ 15 ప్రోని సేకరించిన మొదటి వ్యక్తి కావాలనే కోరికతో తెల్లవారుజామున 4 గంటలకు బెంగళూరు నుంచి Apple BKC స్టోర్‌కు చేరుకున్నాడు. అయితే అప్పటికే క్యూలో మరో కస్టమర్ ముందున్నట్లు గుర్తించాడు. అయినప్పటికీ ఈ క్షణం కోసం ఏడాదినుంచి ఎదురు చూస్తున్న వివేక్.. తాను కోరుకున్న ఫోన్ చేతికందడంపట్ల సంతోషాన్ని వ్యక్తం చేశాడు. 

ఢిల్లీలో, రాహుల్ అనే కస్టమర్ సాకేత్ స్టోర్ నుంచి  సరికొత్త ఫోన్‌ను కొనుగోలు చేసిన మొదటి వ్యక్తి అయ్యాడు. తెల్లవారుజామున 4 గంటలకు స్టోర్‌కు వచ్చి విజయవంతంగా ఫోన్‌ను కొనుగోలు చేసినట్లు తన అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. iPhone 13 Pro Max , iPhone 14 Pro Maxని కొనుగోలు  చేశానని.. దీనిని గ్రేట్ ఎక్స్ పీరియెన్స్ అని రాహుల్ చెప్పుకున్నాడు. ఐఫోన్ 15 సిరీస్‌ను ప్రకటించినప్పుడు తాను ఐఫోన్ 15 ప్రో మాక్స్‌ను పొందాలని ఆసక్తిగా ఉన్నానని, దానిని సొంతం చేసుకున్న వారిలో మొదటి వ్యక్తి కావాలని  కోరుకున్నట్లు రాహుల్ నెటిజన్లతో పంచుకున్నాడు.