మనుధర్మాన్ని అమలు చేసేందుకు కుట్ర:మంత్రి సీతక్క

మనుధర్మాన్ని అమలు చేసేందుకు కుట్ర:మంత్రి సీతక్క

మణుగూరు, వెలుగు : మనుధర్మ సిద్ధాంతాన్ని అమలు చేసి, ప్రజలను బానిసలుగా మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని మంత్రి ధనసరి సీతక్క ఆరోపించారు. మణుగూరులోని డీవీ గ్రాండ్‌‌‌‌ ఫంక్షన్‌‌‌‌ హాల్‌‌‌‌లో బుధవారం నిర్వహించిన మీటింగ్‌‌‌‌లో ఆమె మాట్లాడారు. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి మతాన్ని, సర్జికల్‌‌‌‌ స్ట్రైక్స్‌‌‌‌, పాకిస్థాన్‌‌‌‌ ఉగ్రవాదాన్ని వాడుకుంటూ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందన్నారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారన్నారు. చాయ్‌‌‌‌ వాలా అని చెప్పుకునే మోడీ చాయ్‌‌‌‌ అమ్ముకున్న ప్లాట్‌‌‌‌ఫాం, రైల్వేలను తీసుకొచ్చింది కాంగ్రెస్సే అని చెప్పారు. బీజేపీ చేసిన పనులు చెప్పుకునే ధైర్యం లేక మతాలను, వర్గాలను  రెచ్చగొట్టి ఓట్లు రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. పార్లమెంట్‌‌‌‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌ను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కాంగ్రెస్‌‌‌‌ ఎంపీ క్యాండిడేట్‌‌‌‌ బలరాం నాయక్, డీసీసీబీ డైరెక్టర్‌‌‌‌ తుళ్లూరి బ్రహ్మయ్య, కాటబోయిన నాగేశ్వరరావు, చక్రవర్తి దొబ్బల వెంకటప్పయ్య పాల్గొన్నారు.

రాహుల్‌‌‌‌గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా పనిచేయాలి

రాహుల్‌‌‌‌గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. రాహుల్‌‌‌‌ గాంధీ కావాలనుకుంటే యూపీఏ ప‌‌‌‌దేళ్ల కాలంలోనే ప్రధాని అయ్యేవారని, కానీ ఏనాడూ ఆయ‌‌‌‌న ప‌‌‌‌ద‌‌‌‌విని ఆశించలేదన్నారు. మంగపేట మండలం బోర్‌‌‌‌ నర్సాపురంలో బుధవారం మాట్లాడారు. రాష్ట్రంలో మాదిరిగానే కేంద్రంలోనూ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. 2022 వరకు దేశంలోని పేదలందరికీ ఇల్లు కట్టిస్తామన్న బీజేపీ మాట తప్పిందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్‌‌‌‌ యోజన కింద ఎక్కడ ఇల్లు కట్టించారో చెప్పాలని సవాల్‌‌‌‌ చేశారు. బీజేపీకి దేశ ప్రయోజనాల కంటే.. సొంత ప్రయోజనాలే ముఖ్యమన్నారు.  ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కే దక్కుతుందన్నారు. నాయకులంతా గ్రూప్‌‌‌‌ రాజకీయాలు మానుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ములుగు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, ఎన్నికల ఇన్‌‌‌‌చార్జులు కుచన రవళిరెడ్డి, డాక్టర్‌‌‌‌ పులి అనిల్‌‌‌‌ పాల్గొన్నారు. అనంతరం ములుగులో నిర్వహించిన హోమియోపతి దినోత్సవంలో పాల్గొన్నారు.