మన మిసైల్ వ్యవస్థ పూర్తిగా సేఫ్

మన మిసైల్ వ్యవస్థ పూర్తిగా సేఫ్

న్యూఢిల్లీ: పాకిస్తాన్ భూభాగంలో ఇండియన్ మిసైల్ పడిన ఘటనపై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. ఈ ఘటన అనుకోకుండా జరిగిందని, ఈ విషయాన్ని తాము సీరియస్ గా తీసుకుంటున్నామని పార్లమెంట్ లో ఆయన స్పష్టం చేశారు. ‘మార్చి 9న మన మిసైల్ అకస్మాత్తుగా పాక్ భూభాగంలో పడింది. మిసైల్ యూనిట్ లో రాత్రి 7 గంటల సమయంలో సాధారణ తనిఖీలు చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తూ ఒక క్షిపణి ఫైర్ అయింది. అది పాక్ భూభాగంలో పడిందనే విషయం తర్వాత తెలిసింది. దీనిపై మేం విచారణ వ్యక్తం చేస్తున్నాం. కానీ ఈ ఘటనలో ఎటువంటి నష్టం జరగకపోవడం ఉపశమనంగా చెప్పాలి. ఈ విషయంపై భారత ప్రభుత్వం సీరియస్ గా ఉంది. దీని మీద ఉన్నతాధికారులతో లోతైన దర్యాప్తునకు ఆదేశించాం’ అని  రాజ్నాథ్ స్పష్టం చేశారు. 

ఈ ఘటనకు నిజమైన కారణమేంటనేది విచారణతో బయటపడుతుందని  రాజ్నాథ్  అన్నారు. మిసైల్ యూనిట్ నిర్వహణ, కార్యకలాపాలు, ఆపరేటింగ్ విధానాన్ని సమీక్షిస్తున్నామని.. క్షుణ్నంగా తనిఖీలు జరుపుతున్నామని పేర్కొన్నారు. ‘ఆయుధ వ్యవస్థకు సంబంధించి సేఫ్టీ, సెక్యూరిటీకి మేం అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం. దీంట్లో ఎలాంటి లోపాలున్నా వెంటనే చర్యలు తీసుకుంటాం. సమస్యలను తక్షణమే సవరించడానికి ప్రయత్నిస్తాం. మన మిసైల్ వ్యవస్థ చాలా నమ్మదగినది, సురక్షితమైనదని సభకు తెలియజేస్తున్నా. మన భద్రతా విధానం, పాటించే ప్రోటోకాల్స్ హైలెవల్ లో ఉంటాయి’ అని  రాజ్నాథ్ చెప్పారు.

మరిన్ని వార్తల కోసం:

ఐపీఎల్ నిబంధనల్లో కీలక మార్పులు 

రష్యాలో ఫైజర్ పెట్టుబడులు బంద్

వెరైటీగా బిస్కెట్‌‌ టీ కప్పులు