
సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి మాట్లాడిన విధానం ప్రజా ప్రతినిధులు, న్యాయవ్యవస్థను కించపరిచే విధంగా ఉందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. మీడియాలో వార్తలు వచ్చిన తర్వాత కూడా కలెక్టర్ క్షమాపణ చెప్పలేదని ఆయన మండిపడ్డారు. ఏ అధికారి అయినా ఒకే చోట మూడేళ్లకు మించి ఉండకూడదని.. కానీ సిద్దిపేట జిల్లా కలెక్టర్ మాత్రం 6 సంవత్సరాల నుంచి ఇక్కడే పని చేస్తున్నారని అన్నారు. ఎన్నికలు రాగానే ఇతర జిల్లాకు వెళ్లడం, ఎన్నికలు అయిపోగానే మళ్లీ సిద్దిపేటకు రావడమేంటని ప్రశ్నించారు. కలెక్టర్ వ్యాఖ్యలను న్యాయస్థానం కనీసం సుమోటోగా కూడా తీసుకోలేదన్నారు.
అధికారులు కలెక్టర్‌కు పాలేర్లు కాదు
‘జిల్లా అధికారులు కలెక్టర్ కింద పని చేసే పాలేరులు కాదు. ప్రజాప్రతినిధులు, టీర్ఎస్ నాయకులు వినతిపత్రం ఇస్తే పని చేస్తున్నారు. కలెక్టర్‌కు రాజకీయాలపై ఇష్టం ఉంటే రాజీనామా చేసి పాలిటిక్స్ లోకి రావాలి. సిద్దిపేటలో ప్రభుత్వ అధికారుల కంటే కలెక్టర్ సొంత బలగాలు ఎక్కువగా పని చేస్తున్నాయి. జిల్లా కలెక్టర్‌పై భారత ఉన్నత న్యాయస్థానానికి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాం. హైకోర్టు న్యాయమూర్తికి కూడా కంప్లయింట్ చేశాం’ అని రఘునందన్ రావు అన్నారు. సీఎం కేసీఆర్, ఫైనాన్స్ మినిస్టర్ కనుసన్నల్లోనే జిల్లా కలెక్టర్ పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వరి వేయకూడదని, వరి విత్తనాలు అమ్మొద్దని కేంద్ర, రాష్ట్రాల నుంచి ఏమైనా ఉత్తర్వులు జారీ అయ్యాయా అని ఆయన క్వశ్చన్ చేశారు.