
న్యూఢిల్లీ: ఫోన్ పోతే ఎవరికైనా ఇబ్బందే! అందులో విలువైన సమాచారమో, ఫొటోలో, వీడియోలో ఉండి ఉంటాయి. ఇక ఖరీదైన ఫోన్ అయితే ఆర్థికంగానూ నష్టపోవాలి. ఇప్పుడైతే చోరీ అయిన ఫోన్ గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తే పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. వారి దగ్గర ఉండే ట్రాకింగ్ డివైజ్‌లతో పెద్దగా ఉపయోగం ఉండటం లేదు. ఎందుకంటే కొందరు దొంగలు ఫోన్ల ఐఎంఈఐ నంబరును కూడా మార్చుతున్నారు. ఇక నుంచి ఇలాంటి బాధితులను ఆదుకోవడానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం (డాట్) కొత్త టెక్నాలజీ తీసుకొస్తోంది. చోరీ అయిన ఫోన్ దేశంలో ఎక్కడున్నా ఇది గుర్తిస్తుంది. అందులోని సిమ్‌ను తొలగించినా, ఐఎంఈఐ నెంబర్‌ను మార్చేసినా డాట్ ట్రాకింగ్ సిస్టమ్ కనిపెడుతుంది. సెంటర్ ఫర్ డెవెలప్‌మెంట్ ఆఫ్ టెలిమ్యాటిక్స్ (సీడాట్) తయారు చేసిన ఈ టెక్నాలజీ వచ్చే నెల నుంచి అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.
సీడాట్ టెక్నాలజీ సిద్ధంగా ఉందని, పార్లమెంటు సమావేశాల తరువాత టెలికాం మంత్రి దీనిని ప్రారంభిస్తారని డాట్ వర్గాలు తెలిపాయి. ఈ నెల 26న పార్లమెంటు సమావేశాలు ముగుస్తున్న సంగతి తెలిసిందే. నకిలీ సెల్‌ఫోన్ల వినియోగాన్ని, చోరీలను తగ్గించడానికి డాట్ ‘సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్’ (సీఈఐఆర్)ను ప్రారంభించి, అమలు బాధ్యతలను సీడాట్‌కు అప్పగించింది. దీనికి రూ.15 కోట్లు కేటాయిస్తామని ప్రకటించింది. చోరీ అయిన ఫోన్‌లో సిమ్‌కార్డును, ఐఎంఈఐ నంబరును మార్చినప్పటికీ సీఈఐఆర్ టెక్నాలజీ అది పనిచేయకుండా చేస్తుంది.
ఈ విషయంలో కస్టమర్ల ప్రయోజనాలను కాపాడుతుంది. చోరీకి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అధికారులకు వీలు కల్పిస్తుంది. సీఈఐఆర్ అన్ని ఫోన్ల ఐఎంఈఐ డేటాబేస్‌ను సేకరిస్తుంది. నెట్‌వర్క్ ఆపరేటర్లకు సెంట్రల్ సిస్టమ్‌లా పనిచేస్తుంది. చోరీ అయిన మొబైల్‌ఫోన్ల డేటాను ఆపరేటర్లకు ఇస్తే.. అవి సదరు ఫోన్లకు నెట్‌వర్క్ రాకుండా నిరోధిస్తాయి. ప్రతి మొబైల్‌కూ 15 నంబర్ల ఐఎంఈఐ ఉంటుంది. మొబైల్‌ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తి ఫిర్యాదులో ఐఎంఈఐ నంబరును పేర్కొనాలి. సీఈఐఆర్ ప్రాజెక్టును ఇది వరకే మహారాష్ట్రలో ప్రయోగాత్మకంగా పరీక్షించారు.