దక్షిణాదిపై బీజేపీ ప్లాన్ ఏంటి.?

దక్షిణాదిపై బీజేపీ  ప్లాన్ ఏంటి.?

హైదరాబాద్, వెలుగు:  ఇప్పటికే సర్వే ఏజెన్సీల విశ్లేషణల్లో బీజేపీ ముందున్నట్లు పలు జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి. బలమైన నేతగా మోదీకి ఉన్న ఇమేజే బీజేపీని నిలబెడుతుందని విశ్లేషిస్తున్నారు. తాజాగా వచ్చిన ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ కూడా మోదీ మూడోసారి గెలిచి నెహ్రూ రికార్డును దాటే చాన్స్​ ఉందని అంచనా వేసింది. ఎన్డీయే కూటమి 318 సీట్లతో స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని, విపక్ష కూటమికి 175, ఇతరుల కు 50 సీట్ల వరకు వచ్చే చాన్స్​ ఉందని వెల్లడైంది. ఎన్డీయే కూటమిలోనూ బీజేపీ సొంతంగానే మెజారిటీ మార్క్ దగ్గర ఉంటుందని పోల్ ఫలితాలు చెప్తున్నాయి. మే నెలాఖరులో ఎన్డీటీవీ- సీఎస్డీఎస్ సర్వేలోనూ దాదాపు ఇదే ఫలితం కనిపించింది. 43%  మం ది మోదీనే తర్వాత ప్రధానిగా చెప్పారు. రెండో స్థానంలో ఉన్న రాహుల్ కి 16%  మంది మద్ద తిచ్చారు. పార్టీ పరంగా 39%  మంది బీజేపీకి మద్దతిస్తామని చెప్పారని, ఇది 2019 నాటి బీజేపీ ఓటింగ్ కంటే ఎక్కువని సర్వే విశ్లేషించింది. ఇతర సర్వేల్లోనూ దాదాపుగా ఇవే అంచనాలున్నాయి. 

దక్షిణాదికి ప్లాన్ బీ 

ఉత్తరాదిపై బీజేపీ ధీమాగా ఉన్నప్పటికీ, సౌత్ లో సీట్లు పెంచుకోవడమే ఆ పార్టీకి పెద్ద సవాలని లీడర్లు చెబుతున్నారు. రాష్ట్రాలవారీగా భిన్నమైన భాషలు, రాజకీయం ఉన్న దక్షిణాదిలో కర్నాటకలో మాత్రమే బీజేపీ బలంగా ఎదిగింది. దక్షిణాది రాష్ట్రాల్లో 129 లోక్ సభ సీట్లు ఉండగా.. బీజేపీ 29 సీట్లే గెలిచింది. వీటిలో కర్నాటకలోనే 25 ఉండగా, తెలంగాణలో 4 సీట్లు ఉన్నాయి. ఇటీవల కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ తర్వాత ప్రధానంగా తెలంగాణపై పార్టీ జాతీయ నాయకత్వం ఫోకస్ పెట్టింది. మొత్తం మీద సౌత్ లో రాష్ట్రాల వారీగా లాంగ్ టర్మ్ ప్లాన్ అమలు చేస్తున్నట్లు లీడర్లు చెబుతున్నారు. తమిళనాడులో యువ నాయకుడు అన్నామలైకి నాయకత్వం అప్పగించారు. కర్నాటక అసెంబ్లీలో దెబ్బతిన్నా లోక్ సభ ఎన్నికల్లో పుంజుకుంటామని బీజేపీ అంచనా వేస్తోంది. తెలంగాణలోనూ ఈ సారి బీజేపీకి ఎంపీ సీట్లు పెరుగుతాయని సర్వేలు చెబుతున్నాయి. అలాగే ఏపీ, కేరళ, తమిళనాడులోనూ ఖాతాలు తెరవాలని బీజేపీ యోచిస్తోంది.       

ఆ 160 సీట్లపై స్పెషల్ ఫోకస్ 

పోయిన సారి బీజేపీ సెకండ్ ప్లేస్ లో నిలిచిన, చాలా తక్కువ మార్జిన్ తో ఓడిన స్థానాలపైనే ఈ సారి ఆ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇలాంటివి మొత్తం 160 నియోజకవర్గాలు ఉన్నట్లుగా గుర్తించింది. ఈ నియోజవర్గాల్లో గెలుపు బాధ్యతలను కేంద్ర మంత్రులు, సీనియర్ నేతలకు అప్పగించింది. ఇందులో భాగంగా లోక్ సభ ప్రవాస్ యోజన పేరుతో స్పెషల్ క్యాంపెయిన్ కూడా చేపట్టింది. అలాగే సోనియా గాంధీ, అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్, శరద్ పవార్, ఇతర ప్రముఖుల నియోజకవర్గాల్లో, పార్టీ ఎన్నడూ గెలవని సీట్లపైనా ప్రత్యేకంగా దృష్టి సారించింది. 

టార్గెట్ .. 350 

2019 ఎన్నికల్లో సొంతంగానే 303 సీట్లు, 38 శాతం ఓట్లు సాధించిన బీజేపీ.. ఈ సారి 350కిపైగా సీట్లు గెలవాలన్న లక్ష్యంతో పని చేస్తోంది. ఇందుకోసం పార్టీలోని అన్ని వర్గాలను సైమల్టేనియస్ గా రంగంలోకి దింపింది. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం కోసం మైక్రో మేనేజ్ మెంట్ మోడ్ లోకి వెళ్లింది. ఈ స్ట్రాటజీని పక్కాగా అమలు చేయడం కోసం దేశంలోని రాష్ట్రాలను, యూటీలను నార్త్, ఈస్ట్, సౌత్ అనే మూడు ప్రాంతాలుగా విభజించుకుంది.   

అసలు సవాళ్లు 

పెండింగ్, సవాలుగా మారిన అంశాలపైనా బీజేపీ ఫోకస్ పెట్టింది. ఉద్యోగాల కల్పనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీల భర్తీని మొదలుపెట్టింది. కొన్నినెలలుగా నెలకు 70 వేలకు పైగా రిక్రూట్ మెంట్లు చేస్తూ అపాయింట్ మెంట్ లెటర్లు అంది స్తున్నారు. ఏడాదిలో 10 లక్షల ప్రభుత్వ ఉద్యో గాలు భర్తీ చేస్తామని కేంద్రం ప్రకటించింది. ప్రైవేటు రంగంలోనూ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీం (పీఎల్ఐ) వల్ల దేశీయంగా అవకాశాలు పెరిగాయని చెప్తోంది. ఇక పేద, మధ్యతరగతి వర్గాలకు భారంగా మారిన నిత్యా వసరాల రేట్లు త్వరలోనే అదుపులోకి వస్తాయని అంటోంది. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నాటికి రేట్లు చాలా వరకు కంట్రోల్ అవుతాయని అధికారులు చెబుతున్నారు. పెట్రో రేట్లను కూడా తగ్గించనున్నట్లు కేంద్రం సంకేతాలిచ్చింది. ఇక వివాదంగా మారిన అంశాలపై మాత్రం మోదీ సర్కారు ఆచితూచి అడుగులు వేస్తోంది. అందుకే సివిల్ కోడ్ బిల్లు ఈ సెషన్ లోనే పార్లమెంట్ ముందుకు వస్తుందని ప్రచారం జరిగినా, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దానిని వాయిదా వేసింది.