ఇంకా ముంపు బాధలే.. సిటీలో వరద కష్టాలకు చెక్ పెట్టని సర్కార్

ఇంకా ముంపు బాధలే.. సిటీలో వరద కష్టాలకు చెక్ పెట్టని సర్కార్
  • అసెంబ్లీలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినా చేపట్టలే
  • 5 సెం.మీ వాన పడితే నీట మునిగే కాలనీలు, బస్తీలు
  • 2020 అక్టోబర్​లో కురిసిన భారీ  వానలకు గ్రేటర్ ఆగమాగం
  • ఏండ్లయినా పూర్తి కానీ నాలాల డెవలప్​మెంట్ పనులు
  • సెకండ్ ఫేజ్​కు అధికారులు ప్రపోజల్స్ పంపినా స్పందించని ప్రభుత్వం

“ సిటీకి వరద ముంపు నుంచి శాశ్వత విముక్తి కలిగిస్తాం’’.. అని 2018 అసెంబ్లీ ఎన్నికలతో పాటు గ్రేటర్ ఎన్నికల్లోనూ సిటిజన్లకు అధికార బీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ తర్వాత ఐదేళ్లపాటు అధికారంలో ఉండి కేవలం 31 నాలాలను మాత్రమే నిర్మించింది. సెకండ్ ఫేజ్‌కు అనుమతులు ఇస్తారని చివరిదాకా అధికారులు ఎదురు చూసినా అనుమతులు ఇవ్వలేదు. ఫేజ్– 2 పనులు మొదలుకాలేదు. ఇంతలోనే  ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. పూర్తి చేయని నాలాల పనులు కూడా అటకెక్కాయి.  

హైదరాబాద్, వెలుగు : ఏండ్లు గడుస్తున్నా సిటీలో వరద ముంపు కష్టాలు ఇంకా తొలగట్లేదు. చిన్నపాటి వాన పడినా కాలనీలు నీట మునిగే దుస్థితి నెలకొంది. 5 సెంటిమీటర్ల పైన వర్షం పడితే చాలు ముంపు బాధలు కొన్ని రోజుల దాకా ఉంటున్నాయి. గ్రేటర్ పరిధిలో వరదల నివారణకు ఫస్ట్ ఫేజ్ కింద రూ. 737.45 కోట్లతో 37 నాలాల పనులను ప్రభుత్వం చేపట్టగా.. వీటిలో ఇంకా 6 నాలాల పనులు పూర్తికాలేదు. కంప్లీట్ అయిన నాలాల ప్రాంతాల్లో కూడా వరద సమస్యలు తీరలేదు. గత నెలలో కురిసిన వానలకు 50కిపైగా కాలనీలు నీట మునిగాయి. 

షేక్​పేటలోని ఓయూ కాలనీలో ఏకంగా బోట్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టాల్సి వచ్చిందంటే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతుంది. అంతకు ముందు రెండు నెలల కిందట కుత్బుల్లాపూర్‌‌లోని ఓ కాలనీలో పోలీసులు పడవ తెప్పల ద్వారా జనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నాగోల్‌లోని అయ్యప్ప కాలనీలోనూ రోజుల తరబడి నీళ్లు వదలకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జీడిమెట్లలోని అయోధ్య నగర్ కాలనీ, కుత్బుల్లాపూర్‌‌లోని వోక్షిత్ ఎన్​క్లేవ్ కాలనీతో పాటు అనేక ప్రాంతాల్లో ముంపు కష్టాలు తప్పలేదు. 

బోట్లలో ముంపు బాధితుల తరలింపు

2000వ సంవత్సరంలో సిటీలో వచ్చిన వరదలకు చాలా కాలనీలు నీటమునిగాయి. అప్పట్లో బోట్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టారు. ఆ తర్వాత మళ్లీ 2020లో అంతకు మించిన భారీ వానలు పడడంతో  సుమారు500కుపైగా కాలనీలు, బస్తీలు వరద ముంపులో చిక్కాయి. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 10 రోజుల పాటు సహాయక చర్యల్లో భాగంగా బోట్ల ద్వారా ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముంపు ప్రాంతాల్లోని ప్రజలు ఆస్తి, వస్తువులు చాలా నష్టపోయారు. నార్మల్ స్థితికి వచ్చేందుకు నెల రోజులకిపైగా పట్టింది. 

అప్పట్లో ప్రభుత్వం పంపిణీ చేసిన వరదసాయం కూడా అర్హులకు అందలేదనే  తీవ్ర ఆరోపణలు వచ్చాయి. బీఆర్ఎస్ సర్కార్9 ఏండ్ల పాలనలో సిటీని ఎంతో డెవలప్ చేశామని చెబుతుండగా గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ కూడా కనిపించడంలేదు. 23ఏండ్ల కిందట ఏ పరిస్థితి ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. రోజురోజుకు జనాభా పెరుగుతుండగా అందుకు తగిన విధంగా సౌకర్యాలు కల్పించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కోకతప్పడంలేదు. నేటికీ చిన్న వాన పడినా కూడా కాలనీలు, బస్తీలు ముంపు బారిన పడుతున్నాయంటే ఏ మేర అభివృద్ధి జరిగిందో తెలుస్తోంది. 

వానొస్తుందంటే సామాన్లు  సర్దిపెట్టుకుని..

సిటీలో 8 నుంచి 10 సెంటిమీటర్ల వాన పడితే చాలు కాలనీలు, బస్తీలు నీట మునిగే పరిస్థితి ఉంది. ఏకధాటిగా నాలుగైదు గంటలు వర్షం కురిస్తే మరింత ఇబ్బందులు తప్పవు. దీంతో భారీ వర్షాలు కురిసే సమయంలో జనాలు  వణుకుతూనే బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీస్తుంటారు. కొందరైతే వాన పడే సమయంలో ఇంట్లోని వస్తువులు ఒకచోట పెట్టుకొని ఇండ్లను ఖాళీ చేసేందుకు రెడీగా ఉంటారు. గాజుల రామారంలో మూడు కాలనీల్లో గతేడాది నుంచి ఇబ్బందులు పడుతుండగా ఇంకా సమస్యకు పరిష్కారం చూపలేదు. మల్కాజిగిరిలోని సఫిల్ కాలనీలోనూ నాలాలు చిన్నగా ఉండటంతో పూర్తిగా కాలనీల్లోంచి నీరు పారుతుంది. చిన్నపాటి వాన పడితే గ్రౌండ్ ఫ్లోర్లలో ఉండేవాళ్లు తమ ఇంట్లోని ఎలక్ర్టానిక్ వస్తువులను ఫస్ట్ ఫ్లోర్​లోకి షిఫ్ట్ చేస్తుంటారు. ఇలా ఏండ్లుగా పడే బాధలకు శాశ్వతంగా పరిష్కారం చూపడం లేదు. నాగోల్​లోని అయ్యప్ప కాలనీ, ఓయూ కాలనీ, టోలిచౌకి నదీం కాలనీ, బేగంపేట మయూరిమార్గ్  తదితర ప్రాంతాల్లోనూ ఇవే ఇబ్బందులు ఉన్నాయి. 

ప్రపోజల్స్ కే పరిమితం

 గ్రేటర్​లో  రెండేళ్ల కిందట ఎస్ఎన్డీపీ కింద పనులు ప్రారంభించిన వెంటనే  రూ.1,000  కోట్లతో దాదాపు 70 నాలాల పనులు చేపట్టాలని సెకండ్ ఫేజ్ కోసం అధికారులు ప్రభుత్వానికి ప్రపోజల్స్​పంపారు.  కాగా..  సర్కార్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.  పనులు స్టార్ట్ చేసేందుకు సిద్ధంగా ఉండాలని సర్కార్ ఆదేశించినా ఎలాంటి రిప్లయ్ ఇవ్వలేదు. 

ALS0 READ: లిస్ట్​లో పేరుంటే ఓటేయొచ్చు .. ఎన్నికల కమిషన్ వెల్లడి

సెకండ్ ఫేజ్ పనులకు అనుమతిస్తే వరదలకు గురయ్యే ప్రాంతాల్లో నాలాలు, బాక్స్ డ్రెయిన్ల నిర్మాణం జరిగేది. కానీ అనుమతులు ఇవ్వకపోవడంతో సెకండ్ ఫేజ్ పనులు ప్రపోజల్స్ కే పరిమితం అయ్యాయి.