కర్తవ్యపథ్‌‌పై నారీశక్తి ..ఢిల్లీలో ఘనంగా సాగిన రిపబ్లిక్ డే పరేడ్

కర్తవ్యపథ్‌‌పై నారీశక్తి ..ఢిల్లీలో ఘనంగా సాగిన రిపబ్లిక్ డే పరేడ్
  •  తొలిసారి ఆల్ విమెన్ ట్రై సర్వీసెస్ కంటింజెంట్‌‌ కవాతు
  • సైనిక శక్తిని చాటిన త్రివిధ దళాలు, పారా మిలటరీ బలగాలు
  • గుర్రపు బగ్గీలో కర్తవ్యపథ్‌‌కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
  • చీఫ్ గెస్ట్‌‌గా హాజరైన ఫ్రాన్స్​ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయెల్ మెక్రాన్

న్యూఢిల్లీ, వెలుగు : దేశ రాజధానిలోని కర్తవ్య పథ్‌‌‌‌పై మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. భారత 75వ రిపబ్లిక్‌‌‌‌ డే వేడుకలు ఘనంగా జరిగాయి. సైనిక శక్తి, మహిళా శక్తి, విభిన్న సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటేలా పరేడ్ కొనసాగింది. తొలిసారిగా ఆల్ విమెన్ ట్రై సర్వీసెస్ కంటింజెంట్‌‌‌‌ కవాతు నిర్వహించింది. ఢిల్లీ పోలీస్, ట్రై -సర్వీసెస్‌‌‌‌కు చెందిన డాక్టర్లు, నర్సులు, సెంట్రల్ ఆర్ముడ్ ప్రొటెక్షన్ ఫోర్స్‌‌‌‌కు చెందిన మహిళా కంటింజెంట్లు కూడా తొలిసారి మార్చ్ నిర్వహించాయి. త్రివిధ దళాలు, పారా మిలటరీ బలగాలు, ఢిల్లీ పోలీస్, ఎన్‌‌‌‌సీసీ, ఎన్‌‌‌‌ఎస్ఎస్ కంటింజెంట్లకు మహిళలు నేతృత్వం వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ, డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌‌‌‌నాథ్ సింగ్, మిలిటరీ టాప్ ఆఫీసర్లు, ఫారిన్ డిప్లమాట్లు తదితరులు పరేడ్‌‌‌‌కు హాజరయ్యారు.

సంప్రదాయ గుర్రపు బగ్గీలో రాష్ట్రపతి

నేషనల్ వార్ మెమోరియల్‌‌‌‌ను ప్రధాని మోదీ సందర్శించిన తర్వాత రిపబ్లిక్ డే పరేడ్ మొదలైంది. కొన్ని నిమిషాల తర్వాత గుర్రపు బగ్గీలో కర్తవ్య పథ్‌‌‌‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేరుకున్నారు. దాదాపు 40 ఏండ్ల తర్వాత రాష్ట్రపతి ఇలా గుర్రపు బగ్గీలో రావడం గమనార్హం. ఆమె వెంటే ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మెక్రాన్ కూడా కర్తవ్య పథ్‌‌‌‌కు చేరుకున్నారు. తర్వాత జాతీయ జెండాను ముర్ము ఆవిష్కరించారు. గౌరవ వందనాన్ని స్వీకరించాక శకటాల ప్రదర్శన ప్రారంభమైంది.

తొలిసారి 112 మంది మహిళలు భారతీయ సంగీతాన్ని వినిపించారు. అందులో సంప్రదాయ బ్యాండ్‌‌‌‌కు బదులుగా శంఖం, నాదస్వరం, నగారాతో ప్రదర్శన ఇవ్వడం గమనార్హం. కెప్టెన్ శరణ్య రావ్, సబ్ లెఫ్టినెంట్ అన్షు యాదవ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ సృష్టి రావ్‌‌‌‌తో కలిసి.. ట్రైసర్వీసెస్‌‌‌‌ను కంటింజెంట్‌‌‌‌ను ఆర్మీ మిలిటరీ పోలీస్‌‌‌‌కు చెందిన కెప్టెన్ సంధ్య నడిపించారు. ఆల్ విమెన్ ఆర్మ్‌‌‌‌డ్‌‌‌‌ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ కంటింజెంట్‌‌‌‌ను మేజర్ సృష్టి ఖుల్లార్ నడిపించారు. 

యుద్ధ ట్యాంకుల ప్రదర్శన

దేశ సత్తాను, సైనిక పాటవాలను చాటేలా త్రివిధ దళాలు భారత అమ్ములపొదిలోని అత్యాధునిక ఆయుధాలు, యుద్ధ ట్యాంకులు, అణ్వాయుధాలను ప్రదర్శించాయి. నాగ్ మిస్సైల్ వ్యవస్థ, మొబైల్ మైక్రో వేవ్, బీఎంపీ 2/2, ఆల్ టెర్రయిన్ వెహికల్స్, పణిక, మిసైళ్లు, సర్వైలెన్స్ గ్యాడ్జెట్లు, టీ90 భీష్మ ట్యాంకులు, కాంబాట్ వెహికల్స్, వెపన్ లొకేటింగ్ రాడార్ సిస్టమ్ ‘స్వాతి’, ఆయుధ వ్యవస్థలతో కవాతు నిర్వహించాయి. సిగ్నల్ వ్యవస్థ, డ్రోన్ జామర్ సిస్టం, అడ్వాన్స్ రేడియో ఫ్రీక్వెన్సీ మానిటరింగ్ సిస్టమ్, సర్ఫేస్ ఎయిర్ మిసైల్ సిస్టమ్, మల్టీ ఫంక్షనల్ రాడార్, మూడు అత్యాధునిక రుద్ర, ఒక ప్రచండ 
హెలికాప్టర్​ను ఈ వేడుకల్లో ప్రదర్శించారు.

‘మదర్ ఆఫ్ డెమోక్రసీ’ థీమ్‌‌‌‌తో శకటాల ప్రదర్శన

‘మదర్ ఆఫ్ డెమోక్రసీ’ థీమ్‌‌‌‌లో భాగంగా మొత్తం 25 శకటాలు కర్తవ్య పథ్‌‌‌‌పై సందడి చేశాయి. ఇందులో 6 రాష్ట్రాలు, యూటీల శకటాలు, 9 కేంద్ర మంత్రిత్వ శాఖల శకటాలు ఉన్నాయి. ఇందులో తెలంగాణ, ఏపీ, తమిళనాడు, లడాఖ్, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, మణిపూర్, మధ్యప్రదేశ్, ఒడిశా, చత్తీస్‌‌‌‌గఢ్, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, మేఘాలయ, జార్ఖండ్, యూపీల శకటాలు ఉన్నాయి.

చివర్లో 54 యుద్ధ విమానాలు/హెలికాప్టర్లు నింగిలో విన్యాసాలు చేశాయి. ఇందులో 3 ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్, 46 ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఒక నేవీ విమానం, 4 హెలికాప్టర్లు ఉన్నాయి. ప్రచండ్, తంగైల్, అర్జున్, నేత్ర, వరుణ, భీమ్, అంరీట్, త్రిశూల్, అమృత్, వజ్ రంగ్, విజయ్ ఫైటర్ జెట్లు చేసిన విన్యాసాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఇక చివర్లో రఫేల్ యుద్ధ విమానం నేలకు నిటారుగా నింగిలోకి దూసుకుపోతూ చేసిన విన్యాసం మొత్తం పరేడ్‌‌‌‌కే హైలెట్​గా నిలిచింది.

13 వేల మంది గెస్ట్​లు

రిపబ్లిక్​ డే వేడుకల్లో స్పేస్​ సైంటిస్టుల నుంచి సర్పంచ్‌‌లు, పారిశ్రామికవేత్తల వరకు 13 వేల మంది ప్రత్యేక గెస్టులుగా పాల్గొన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్, స్వనిధి, కృషి సించాయీ యోజన, ఫసల్ బీమా యోజన, విశ్వకర్మ యోజన, రాష్ట్రీయ గోకుల్ మిషన్‌‌ వంటి వివిధ ప్రభుత్వ పథకాల ను ఉత్తమంగా ఉపయోగిం చుకున్న వారిని కేంద్రం ఈ వేడుకలకు ఆహ్వానించింది. ఆదర్శ గ్రామాల సర్పంచ్​లు, స్వచ్ఛ్ భారత్  అభియాన్, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం, సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌‌లోని మహిళా కార్మికులు ఆహ్వానితుల్లో ఉన్నారు.

ఈసారి ప్రత్యేకతలివే

  •       రాష్ట్రపతి బాడీ గాడ్స్ (అంగరక్షక్– అశ్వదళం రెజిమెంట్) 250 ఏండ్లు పూర్తి చేసుకోనున్న సందర్భంగా.. గుర్రపు బగ్గీలో పరేడ్‌‌‌‌కు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము హాజరయ్యారు.
  •      చీఫ్ గెస్ట్ దేశంగా ఫ్రెంచ్‌‌‌‌ పాల్గొనగా.. ఆ దేశం నుంచి 95 మందితో కూడిన ఫ్రెంచ్  కంటింజెంట్​కవాతు చేసింది. 
  •      ఫ్రెంచ్ వైమానిక దళానికి చెందిన 2 రాఫెల్ విమనాలు, ఒక మల్టీ రోల్ ట్యాంకర్ ట్రాన్స్‌‌‌‌పోర్ట్ ఫ్లైట్​ పాల్గొన్నాయి. 
  •      నారీ శక్తి, వికసిత్ భారత్, ‘భారత్ లోక్‌‌‌‌తంత్ర కీ మాతృక’ వంటి ఇతివృత్తాలతో ఈ వేడుకలు జరిగాయి. 
  •      ‘ఆవాహన్’ మ్యూజికల్ ఇన్‌‌‌‌స్ట్రుమెంట్‌‌‌‌తో 112మంది మహిళలు పెర్ఫామ్ చేశారు.
  •      బాలపురస్కార గ్రహీత పెండ్యాల లక్ష్మీ ప్రియ ఈ పరేడ్‌‌‌‌లో పాల్గొన్నారు. 
  •      తొలిసారి 144 మందితో ఆర్ముడ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ కంటింజెంట్ పాల్గొంది. 
  •      మదర్ ఆఫ్ డెమోక్రసీ పేరుతో శకటాల ప్రదర్శన. ‘డెమోక్రసీ ఎట్ ది గ్రాస్ రూట్స్’ నినాదంతో తెలంగాణ శకటం ప్రదర్శన.