
- ఆరు గంటలు ప్రశ్నించిన టీన్యాబ్ ఆఫీసర్లు
- రిపేర్ అయిందని ఫోన్ తీసుకురాని నవదీప్
- ఇంటికి వెళ్లి తెచ్చిన అధికారులు.. ఫోన్‌ను ఫార్మాట్ చేసినట్లు గుర్తింపు
- ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి డేటా రిట్రీవ్ చేయించనున్న టీన్యాబ్
- మళ్లీ పిలిచినప్పుడు విచారణకు రావాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు : డ్రగ్స్ పార్టీ కేసులో సినీ నటుడు నవదీప్ శనివారం యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీన్యాబ్) విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో ఎస్పీ సునీతారెడ్డి ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల టీమ్ దాదాపు ఆరు గంటల పాటు ఆయన్ను ప్రశ్నించింది. నవదీప్ తన ఫోన్ తీసుకురాకపోవడంపై ఆరా తీసింది. ఫోన్ రిపేర్ అయినట్లు నవదీప్ చెప్పడంతో.. ఇంటికి వెళ్లి తీసుకువచ్చారు. మొబైల్‌ను ఫార్మాట్ చేసి డేటా మొత్తం డిలీట్ చేసినట్లు గుర్తించారు.
ఫోన్ సీజ్ చేసి.. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి డేటా రిట్రీవ్ చేయించనున్నారు. మళ్లీ పిలిచినప్పుడు విచారణకు రావాలని నవదీప్‌ను ఆదేశించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న కలహర్ రెడ్డి, స్నాట్ పబ్ యజమాని సూర్య, సినిమా డైరెక్టర్ ఉప్పలపాటి రవి సోమవారం విచారణకు హాజరుకానున్నారు.
డ్రగ్స్ కొనలే
మాదాపూర్‌లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్‌మెంట్‌లో గత నెల 31న టీన్యాబ్ పోలీసులు రెయిడ్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నవదీప్ ఫ్రెండ్ రామ్‌చంద్ కాల్ డేటాను సేకరించారు. దాని ఆధారంగా టీన్యాబ్ అధికారులు నవదీప్‌ను విచారించారు. వ్యక్తిగత వివరాలు, సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ, వ్యాపారాలు, బ్యాంక్ అకౌంట్స్‌కు సంబంధించిన సమాచారాన్ని నవదీప్ అందించారు. ఈ కేసులో పట్టుబడ్డ డ్రగ్స్ వినియోగదారుడు కొల్లి రామ్‌చంద్‌తో తనకు 15 ఏండ్లుగా పరిచయం ఉన్నట్లు వెల్లడించారు.
అమెరికాకు వెళ్లిన సమయంలో అక్కడ లభించే ‘గమ్మీస్’ను తీసుకునేవాడినని చెప్పారు. స్థానిక చట్టాలకు అనుగుణంగా డ్రగ్స్ మోతాదు ఉంటుందని తెలిపారు. ఫిల్మ్ ఫైనాన్షియర్ వెంకటరత్నారెడ్డి, డ్రగ్స్ సప్లయర్ బాలాజీ ఎవరో తనకు తెలియదని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌లో బీపీఎమ్ పబ్‌ను ఏడాది నిర్వహించామని, తర్వాత మూసివేశామని చెప్పారు. రామ్‌చంద్‌తో రెగ్యులర్‌గా మాట్లాడుతుంటానని, కానీ ఎలాంటి డ్రగ్స్ కొనుగోలు చేయలేదని చెప్పారు. ఇంతకుముందు టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ సిట్, ఈడీ విచారణకు హాజరైనట్లు తెలిపారు.
‘‘గతంలో డ్రగ్స్ తీసుకునేవాడిని. తర్వాత మానేశాను. ఎలాంటి వైద్య పరీక్షలకైనా సిద్ధం” అని చెప్పారు. తనకు ఎవరితోనూ కాంటాక్ట్స్ లేవన్నారు. ‘డ్రగ్ అఫెండర్స్ ప్రొఫైలింగ్ అనాలిసిస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (డోపమ్స్)’లోని డ్రగ్స్ సప్లయర్లు, కస్టమర్లుగా ఉన్న 81 మందితో నవదీప్‌కు కాంటాక్ట్ ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 45 మంది అనుమానితులను పరిశీలించారు.
కావాలనే ఫోన్ ఫార్మాట్ చేశారా?
డోపమ్స్‌లో గుర్తించిన లింక్స్ ఆధారంగా నవదీప్‌తో డ్రగ్స్ కస్టమర్లు, పెడ్లర్లకు ఉన్న సంబంధాలపై టీన్యాబ్ ఆఫీసర్లు ఆరా తీశారు. 45 మంది క్లోజ్ కాంటాక్ట్స్‌లో రెగ్యులర్‌గా కాల్స్ చేసిన వారి వివరాలు సేకరించారు. ఈ క్రమంలోనే నవదీప్ తన ఫోన్‌ను ఫార్మాట్ చేసినట్లు అనుమానిస్తున్నారు.
నెల రోజుల కిందట రిపేర్ కోసం ఫోన్ ఇచ్చినట్లు నవదీప్ చెప్పడంతో సర్వీస్ సెంటర్ వారిని కూడా టీన్యాబ్ విచారించింది. నెల రోజుల కిందటే ఫోన్ రిపేర్ చేశామని, ఆ సమయంలో ఫోన్ ఫార్మాట్ అయిందని అధికారులకు సర్వీస్ సెంటర్ నిర్వాహకులు చెప్పారు. ఇదంతా ఆధారాలు లభించకుండా చేసిన ప్లాన్ కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.