బస్ స్టేషన్లలో భద్రతేది?..ఎంజీబీఎస్, జేబీఎస్ లో కనిపించని నిఘా

బస్ స్టేషన్లలో భద్రతేది?..ఎంజీబీఎస్, జేబీఎస్ లో కనిపించని నిఘా
  •     ఎంజీబీఎస్​లో ఏడాదిగా పని చేయని మెటల్ ​డిటెక్టర్లు  
  •     జేబీఎస్​లో మెటల్ ​డిటెక్టర్ అసలే లేదు
  •     మహాలక్ష్మి స్కీమ్​తో బస్టాండ్లలో పెరిగిన రద్దీ
  •     రామేశ్వరం కేఫ్​ ఘటనతో భద్రతపై తలెత్తున్న ప్రశ్నలు

హైదరాబాద్, వెలుగు : బెంగళూరులోని రామేశ్వరం కేఫ్​బాంబ్​పేలుడు ఘటన తర్వాత గ్రేటర్​హైదరాబాద్​లోని రద్దీ ప్రాంతాల్లో భద్రతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సిటీలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో మహాత్మాగాంధీ బస్ స్టేషన్(ఎంజీబీఎస్), జూబ్లీ బస్​స్టేషన్(జేబీఎస్) ప్రధానమైనవి. ఇందులోని ఎంజీబీఎస్ రాష్ట్రంలోనే అతి పెద్ద బస్​స్టేషన్. ఇక్కడి నుంచి రోజూ 4 వేల బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. లక్ష మంది ప్రయాణికులు తెలంగాణ, ఏపీతోపాటు ఇతర రాష్ట్రాలకు జర్నీ చేస్తుంటారు. 24 గంటలూ రద్దీగా ఉండే ఎంజీబీఎస్​లో కట్టుదిట్టమైన భద్రత, నిరంతర నిఘా కనిపించడం లేదు. మెయిన్​గేట్​ఎంట్రన్స్​లో ఉన్న ఒకే ఒక్క వాక్​త్రూ మెటల్​డిటెక్టర్ ఏడాదిగా పనిచేయడం లేదు. హ్యాండ్ హెల్డ్​మెటల్​డిటెక్టర్స్​చెక్​చేసే సిబ్బంది మొత్తానికే లేరు. ఏదైనా అలర్ట్ ప్రకటించినప్పుడు తాత్కాలిక చెకింగ్​తప్ప మిగిలిన రోజుల్లో పట్టించుకోవడం లేదు. ఇక సీసీ కెమెరాలు అంతంత మాత్రంగానే పనిచేస్తున్నాయి. ఉన్నవాటిలో ఏది ఎప్పుడు బంద్​అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

ఒక్కరోజు హైఅలర్ట్​తో సరి..

రాష్ట్రంలో మహాలక్ష్మి స్కీమ్​అమల్లోకి వచ్చాక బస్సుల్లో మహిళా ప్రయాణికుల రద్దీ పెరిగింది. బస్టాండ్లలోనూ ఎక్కువగా మహిళలే కనిపిస్తున్నారు. ఎంజీబీఎస్ నుంచి తెలంగాణతోపాటు ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాలకు ప్రతిరోజూ బస్సులు నడుస్తుంటాయి. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ ఘటన జరిగిన రోజు హైదరాబాద్​లో హైఅలర్ట్​ప్రకటించారు. రద్దీగా ఉండే ప్రాంతాలతోపాటు ఎంజీబీఎస్, జేబీఎస్, ఎయిర్​పోర్టుల్లో తనిఖీలు చేపట్టారు. తర్వాత రోజు నుంచి ఎలాంటి తనిఖీలు లేవు. ప్రయాణికుల ముసుగులో ఎరైనా పేలుడు పదార్థాలు తీసుకొస్తే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

జేబీఎస్​లోనూ ఇదే పరిస్థితి

ఎంజీబీఎస్ తర్వాత సిటీలో రద్దగా ఉండే ప్రాంతం జేబీఎస్. ఇక్కడ కూడా సెక్యూరిటీ సరిగా లేదు. ఇక్కడి నుంచి వేల మంది జర్నీ చేస్తుంటారు. రోజూ1,428 బస్సులు నడుస్తున్నాయి. 42 మంది సిబ్బంది సెక్యూరిటీని పర్యవేక్షిస్తుంటారు. కానీ బస్ స్టేషన్ లో 16 సీసీ కెమెరాలే ఉన్నాయి. అందులో రెండు పనిచేయట్లేదు. ఇక వాక్ త్రూ మెటల్​డిటెక్టర్, హ్యాండ్​హెల్డ్​మెటల్​డిటెక్టర్ చెకింగ్ ఊసేలేదు. ప్రయాణికులు ఎలాంటి వస్తువులు పట్టుకొస్తున్నారు? హానికరమైనవా? కాదా? అని చెకింగ్​చేసే సిబ్బంది కనిపించరు. భద్రతా పర్యవేక్షణలో ఉన్న సిబ్బంది కూడా ఎప్పుడో ఒకసారి కనిపిస్తారని ప్రయాణికులు చెబుతున్నారు. 

127లో పనిచేస్తుంది 89 కెమెరాలే

ఎంజీబీఎస్ లోపలికి వెళ్లేందుకు మొత్తం నాలుగు దారులు ఉన్నాయి. బస్సులు లోపలికి వెళ్లే  శివాజీ బ్రిడ్జి నుంచి, మెట్రోస్టేషన్​నుంచి డైరెక్టుగా బస్​స్టేషన్​లోకి వెళ్లొచ్చు. అలాగే బస్సులు బయటకు వెళ్లేదారి నుంచి ప్రయాణికులు లోపలికి వెళ్తుంటారు. మెయిన్​గేట్ వద్ద గతంలో ఏర్పాటు చేసిన మెటల్​డిటెక్టర్ ఏడాదికిపైగా పనిచేయేడం లేదు. ఉన్నదాన్ని బాగుచేయించకపోగా, కొత్తది ఏర్పాటు చేయలేదు. నామ్​కే వాస్తేగా అలాగే వదిలేశారు. మిగతా దారుల నుంచి లోపలికి వచ్చే ప్రయాణికులను హ్యాండ్​హెల్డ్​ మెటల్​డిటెక్టర్స్​తో చెక్​చేసే సిబ్బంది లేరు. ఎంజీబీఎస్​లో 82 మంది కాంట్రాక్ట్​సిబ్బందితో పాటు, ఆర్టీసీకి చెందిన 10 మంది సిబ్బంది భద్రతను పర్యవేక్షిస్తుండగా, అఫ్జల్​గంజ్ పీఎస్ ఔట్ పోస్టు కూడా ఎంజీబీఎస్​లోనే ఉంది. బస్ స్టేషన్ లో 127 సీసీ టీవీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంది. ఇందులో 89 కెమెరాలు మాత్రమే పనిచేస్తున్నాయి. వీటిలో ఏ రోజు ఏది పని చేస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.

అధికారులు దృష్టి పెట్టాలి 

ఏదైనా ఘటన జరిగితేనే మన దగ్గర భద్రతను పటిష్ఠం చేస్తారు. లేదంటే పట్టించుకునేవారే ఉండరు. మొన్న బెంగళూరులో జరిగింది. రేపు మన వద్ద జరగదు అనే గ్యారంటీ ఏంటీ? ఇకనైనా ఆర్టీసీ అధికారులు స్పందించి భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలి. సిబ్బందిని పెంచి, హ్యాండ్​హెల్డ్, వాక్​త్రూ మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేయాలి. 

– నారాయణరావు, ప్రయాణికుడు, ఎంజీబీఎస్​

భద్రతను పటిష్ఠం చేస్తాం.. 

ప్రయాణికుల భద్రతకు ఆర్టీసీ కట్టుబడి ఉంది. బస్ స్టేషన్ లో సీసీ కెమెరాలను కూడా ఎప్పటికప్పుడు రిపేరు చేయిస్తున్నాం. రోజూ డాగ్​స్క్వాడ్​తో చెకింగ్​నిర్వహిస్తున్నాం. తొందరలోనే మెటల్​డిటెక్టర్​ను ఏర్పాటు చేస్తాం. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. 

– బి.శ్రీనివాస్, కస్టమర్ ​రిలేషన్​షిప్​మేనేజర్, ఎంజీబీఎస్