ప్రయాణంలో  పదనిసలు

ప్రయాణంలో  పదనిసలు

ఢిల్లీలో భారతీయ కళలను అసమాన ప్రజ్ఞావిశేషాలను కలబోసి నిర్మించిన అద్వితీయ ప్రాంగణం సాంస్కృతిక యాత్రాస్థలి శ్రీస్వామినారాయణ్ అక్షరధామ్. ప్రకృతి ఆరాధకుల స్వర్గసీమ హరిద్వార్. మనోజ్ఞమైన కొండల మధ్య వెలసిన అందమైన పట్టణం డెహ్రాడూన్. ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేసే... ముస్సోరిలకు వెళ్ళాలని వుందా? 


యమునోత్రికి వెళ్ళేటప్పుడు పర్వతం మీదనుండి దేవాలయానికి ఆరు కిలోమీటర్లు గుర్రాలపై / డోలీలపై / బుట్టలో / నడిచి ప్రయాణం. ఆ తరువాత యమునోత్రి దర్శనం చేసుకుంటే బాగుండు అనిపిస్తుందా? గంగోత్రికి వెళ్ళే దారుల పక్కన కంటి ముందుకొచ్చిన ప్రతి దృశ్యం అపురూపం. గంగోత్రి ఆలయం ఎదురుగా ఎండకు తెల్లరేకుల్లా మెరిసే మంచుకొండలు చూడాలి అనుకుంటున్నారా! కేదార్​నాథ్​ ప్రయాణం మధ్యలో- అద్భుతమైన ఆనకట్ట తెహ్రీ డ్యాం, గౌరీకుండ్ నుండి కేదారేశ్వరుని దాకా16కి.మీ. గుర్రాలు, పల్లకీలు, బుట్టలు... ఆహా ఏమి దారి!


నరనారాయణుల రూపంలో భగవంతుడు తపస్సు చేసిన ప్రదేశం, అలకనందా నది సవ్వడులు చెవులకింపుగా సందడి చేసే ప్రాంతం అయిన బద్రీనాథ్ వెళ్లగానే భారతదేశానికి చివరి (చైనా సరిహద్దు) అంచున ఉన్నామనే వింత అనుభూతి కలుగుతుంది. సరస్వతీ నది, భారతదేశానికి టిబెట్ ప్రాంతం వైపు చివరి గ్రామం ‘మాన’. భారతదేశానికి చివరి చాయ్ దుకాణం మీద మూడు రంగుల జెండా...- వీటన్నిటిని కళ్లారా చూడాలనిపిస్తోందా? -తిరుగు ప్రయాణంలో రిషీకేశ్, ఆ -తర్వాత ఢిల్లీలో ఎర్రకోట, పాలికాబజార్, ఇండియా గేట్, రాష్ట్రపతి, పార్లమెంట్ భవనాలు, కుతుబ్ మినార్​లను చూడాలని వుందా? అయితే కూరెళ్ల పద్మాచారి రచించిన ‘ఆధ్యాత్మిక దారుల్లో చార్దామ్ యాత్ర’ గైడ్ ఉపకరిస్తుంది. యాత్రలు చేయడాన్ని ఇష్టపడే పద్మాచారి తన కుటుంబంతో కలిసి చేసిన ఆ యాత్ర అనుభూతులను పుస్తకంగా రీడర్స్​ ముందుకు తెచ్చాడు.


ఆయన చూసిన అన్ని ప్రదేశాల్లోని విశేషాలను, ప్రాధాన్యాలను, వాటికి గల పురాణ ప్రాశస్త్యాలను- కవితాత్మకంగా, కథనాత్మకంగా వివరించిన పుస్తకం ఇది.
‘‘కేదార్​నాథ్ ఆలయ నిర్మాణం ఒక అద్భుతం. కనుచూపుమేరలో ఎత్తైన కొండలు, లోతైన లోయలు తప్ప మరేమీ కనిపించని ప్రాంతంలో ఉన్నది. దేవాలయ నిర్మాణంలో వాడిన రాయి స్థానికంగా దొరికేది కాదు. ఉష్ణోగ్రతలో వచ్చే మార్పులతోపాటు భయంకరమైన వర్షాన్ని కూడా ఆ రాళ్ళు తట్టుకుంటాయట. ఆ రాళ్ళను అక్కడి వరకు ఎలా తీసుకెళ్లారు? అంత కచ్చితంగా ఎలా కట్ చేశారు? అద్భుతమైన ఇంజనీరింగ్ మేధస్సు ఉన్న అప్పటి రుషులా? లేక మానవాతీత శక్తులా? ‘‘2013లో భయంకరమైన వరదలకు గుడి వెనుకభాగంలో ఉన్న కొండల్లో నుంచి పెద్ద బండరాయి దొర్లుకుంటూ వచ్చి గుడి వెనుక నిల్చొని, శక్తివంతమైన నీటి ప్రవాహాన్ని రెండుపక్కలకు మళ్లించి గుడిని కాపాడింది. ఈ సన్నివేశం యాదృచ్ఛికమా? లేక దైవ సంకల్పమా?” అని అబ్బురపడే ఈ రచయితలో గొప్ప భావుకుడున్నాడు. 


భూమి గుండెలను ఒరుసుకుంటూ మృదంగ ధ్వనుల సవ్వడులతో యమున పరవళ్లు అతని అంతరాంతరాల కవితావేశాన్ని తట్టిలేపుతాయి. ‘ప్రయాగ’ను వివరిస్తూ ప్రయాగ అంటే కలయిక. భాగీరథిలో అలకనందా నది కలయిక ఒక నేర్పరియైన చిత్రకారుడు కాన్వాసు మీద రెండు రంగులను మిళితం చేస్తున్న ప్రక్రియలా ఉంటుందని వర్ణించాడు. సాయం సమయంలో రుద్ర ప్రయాగలో బస్సు ఆగినప్పుడు మందాకిని సోయగాలతో సరాగాలాడుతాడు. బద్రీనాథ్ రాత్రి చీకటి దుప్పట్లను కప్పుకున్న కొండలు డ్యూటీ దిగినట్లు తెల్లని మంచు వస్త్రాలను ధరించి సేద దీరుతున్నాయని, ఉదయభానుని లేత కిరణాలు సోకి బంగారుమయమై ప్రజ్వలిస్తున్నాయని చెప్తాడు. కేదార్​నాథ్ కొండలెక్కేటప్పుడు అతనిని ‘‘అసంఖ్యాక గుర్రాల మెడల్లో ఉన్న కంచుగంటల శబ్దం, అలకనందా నది మద్దెల చప్పుడు రెండూ కలిసి సంగీత జుగల్బందీలా చెవులకింపుగా రససామ్రాజ్యంలోకి తీసుకెళ్లింది” అన్నాడు.


పద్మాచారి శ్రమను గుర్తిస్తాడు. “గుర్రం మీదున్న నాకే ఇంత విసుగొస్తుంటే మరి మోసే గుర్రానికి? నడిపేవాడికి?” అనుకుంటూ వాళ్లకు చేతులెత్తి మొక్కుతాడు.70వేల మంది భారత సైనికుల జ్ఞాపకార్థం నిర్మించబడిన ‘ఇండియా గేట్’ను చూసి “మనం కళ్లు మూసుకొని సుఖంగా నిద్ర పోవడానికి తమ కళ్లను ఎప్పటికీ తెరచి ఉంచిన వీరజవానులకు” శ్రద్ధాంజలి ఘటిస్తాడు. మన భవితవ్యం గురించి చర్చలు చేసి, నిర్ణయించే పార్లమెంటు భవనం చూస్తూ, దానిపై 2001లో ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు ఇద్దరు పార్లమెంటు సెక్యూరిటీ జవానులు, ఒక తోటమాలి భరతమాత పాదాలచెంత తనువు చాలించి తమ దేశభక్తిని నిరూపించుకున్నారని, మన సైనికుల మనోధైర్యం ముందు రాకాసి మూకలు తోక ముడిచిన సన్నివేశాన్ని యాది చేస్తాడు.


కూరెళ్ల పద్మాచారి రచన ఆహ్లాదంగా సాగుతుంది. ఆనందాన్ని పంచుతుంది. అక్కడక్కడ సందర్భోచితంగా కవుల, కావ్యాల ప్రసక్తి వస్తుంది. ఈ గ్రంథం చదువుతుంటే మన కనులు అక్షరాల వెంట, మన మనసు దర్శనీయ స్థలాల వెంట పరుగులు తీస్తాయి. పద్మాచారి వెంట ఉండి ఆ ప్రదేశాలన్నీ వీక్షిస్తున్నామా అనిపిస్తుంది. యాత్రలపట్ల అనురక్తి కలిగి, స్నేహానికి ప్రాణమిచ్చే జి. వి. శ్యాంప్రసాద్​ (కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్)కు ఈ గ్రంథాన్ని అంకితం ఇవ్వడం పూర్తిగా సార్థకం. కూరెళ్ల శ్రీనివాస్ వేసిన ముఖచిత్రం పాఠకులకు యాత్రలపట్ల ఆసక్తిని కలిగించేలా, మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా ఉంది. ప్రయాణంలో పదనిసలు పలికిస్తూ భక్తి, దేశభక్తి, ఆధ్యాత్మికత, మానవత, ప్రకృతిప్రేమ, దాంపత్య ప్రేమ, వివిధ విషయ పరిజ్ఞానం కలబోసి ఈ గ్రంథాన్ని రచించిన కూరెళ్ల పద్మాచారి అభినందనీయుడు.


- ఎ.గజేందర్ రెడ్డి, 98488 94086