సోషల్ మీడియాలో ప్రకటనలపై సెలబ్రిటీలకు కొత్త రూల్స్

సోషల్ మీడియాలో ప్రకటనలపై సెలబ్రిటీలకు కొత్త రూల్స్
  • సోషల్ మీడియాలో ప్రకటనలకు కొత్త గైడ్ లైన్స్
  • ప్రమోట్ చేసే బ్రాండ్​లతో తమ బంధాన్ని వెల్లడించాలె
  • సోషల్ మీడియా సెలబ్రిటీలకు, ఇన్​ఫ్లూయెన్సర్లకు కొత్త రూల్స్  
  • ఉల్లంఘిస్తే కంపెనీలకు, ప్రమోట్ చేసినోళ్లకు ఫైన్

ఇది బాగుంది కొనండి.. అది బాగుంది చూడండి.. అని సోషల్ మీడియాలో ఇకపై ప్రమోషన్ వీడియోలు, పోస్టులు పెడితే సరిపోదు. అట్లా పెట్టినందుకు మీకు కంపెనీల నుంచి ఎంత ముట్టిందో కూడా చెప్పాల్సి ఉంటది. అట్లకాకుండా.. ప్రమోషన్ చేసినా, ఆ విషయం దాచిపెట్టి.. జనాలను తప్పుదోవ పట్టిస్తే మాత్రం భారీగా ఫైన్ తప్పదు. యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వేదికల్లో పెద్ద ఎత్తున ఫాలోవర్లు ఉండే సెలబ్రిటీలు, ఇన్ ఫ్లూయెన్సర్ లకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ఈ మేరకు కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. ప్రమోషన్ సంగతిని దాచిపెడ్తూ తప్పుదోవ పట్టిస్తే.. రూ. 10 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకూ ఫైన్ వేయనున్నట్లు గైడ్ లైన్స్ జారీ చేసింది.

న్యూఢిల్లీ:   సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించే ప్రకటనలను నివారించేందుకు, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కొత్త రూల్స్​ను ప్రవేశపెట్టింది. ‘సోషల్ మీడియాలో సెలబ్రిటీలు, ఇన్​ఫ్లూయెన్సర్లు, వర్చువల్ మీడియా ఇన్​ఫ్లూయెన్సర్లకు ఎండార్స్​మెంట్ నో హౌస్’ పేరుతో గైడ్ లైన్స్ విడుదల చేసింది. యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్​లలో పెద్ద ఎత్తున ఫాలోవర్లు ఉండే సెలబ్రిటీలు, వ్లాగర్​లు, ఇన్​ఫ్లూయెన్సర్లు వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా లేదా కన్ఫ్యూజ్ చేసేలా ఆయా ప్రొడక్టులను, సర్వీస్​లను ప్రమోట్ చేస్తే కఠిన చర్యలు తీసుకునేలా గైడ్ లైన్స్​ తెచ్చినట్లు కేంద్ర కన్జూమర్స్ అఫైర్స్ సెక్రటరీ రోహిత్ కుమార్ సింగ్ మీడియాకు వెల్లడించారు. ‘‘మన దేశంలో సోషల్ మీడియాలో ఇన్​ఫ్లూయెన్సర్ల ద్వారా జరుగుతున్న వ్యాపారం(మార్కెట్) ఏటా 20% పెరుగుతోంది. దేశంలో పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు ఉన్న సోషల్ మీడియా ఇన్​ఫ్లూయెన్సర్లు లక్షకు పైనే ఉన్నారు. అందుకే ఏ కంపెనీ లేదా సంస్థ.. ఏ వ్యక్తి లేదా డిజిటల్ మీడియా ద్వారా తమ ప్రొడక్టులను, సర్వీస్​లను ఎలా ప్రమోట్ చేస్తున్నారు? అన్న విషయం వినియోగదారులకు తెలియాల్సిన అవసరం ఉంది’’ అని రోహిత్ కుమార్ సింగ్ వివరించారు. రూల్స్ ఉల్లంఘిస్తే.. కంపెనీలు, వ్యక్తులపై నేరుగా వినియోగదారులు కంప్లయింట్ చేయొచ్చని తెలిపారు.  

కొత్త గైడ్ లైన్స్ ఇవే..

  • ఇకపై సోషల్ మీడియా ఇన్​ఫ్లూయెన్సర్లు ఆయా ప్రొడక్టులు, వెహికల్స్, గాడ్జెట్స్, సర్వీస్​ల వంటి వాటిని ఎండార్స్ మెంట్(ప్రమోషన్) చేస్తే.. వాటి వెనక వారికి ఉండే లాభం(సంబంధిత కంపెనీ లేదా సంస్థతో తమకున్న బంధం) ఏమిటో తప్పనిసరిగా చెప్పాలి. సంబంధిత బ్రాండ్​తో సంబంధాలున్నాయా? లేదంటే ఆర్థిక ప్రయోజనం పొందుతున్న రా? అనే విషయాన్ని స్పష్టం చేయాలి. ఏవైనా గిఫ్ట్ లు తీసుకున్నారా? ప్రొడక్టులు ఫ్రీగా లేదా డిస్కౌంట్​లో పొందారా? ఈక్విటీలు, మీడియా కవరేజ్, అవార్డులను ఆఫర్ చేశారా? వంటి వివరాలతో డిస్​క్లోజర్​ను తప్పనిసరిగా జతచేయాలి. 
  • సోషల్ మీడియా వేదికలపై వ్యక్తులు లేదా గ్రూపులు ఆయా ప్రొడక్టులను ఫాలోవర్లు కొనేలా లేదా ఆ బ్రాండ్ గురించి, సర్వీస్ గురించి ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉంటే.. వారు డిస్​క్లోజర్ తప్పకుండా ప్రకటించాలి. ఆ కంపెనీతో బంధం ఉంటే వివరాలు వెల్లడించాలి. 
  • ప్రొడక్టులను ఎండార్స్ చేస్తూ ఇన్​ఫ్లూయెన్సర్లు పెట్టే పోస్టులు, వీడియోలకు తప్పనిసరిగా ఈ డిస్​క్లోజర్ సులభంగా, స్పష్టమైన భాషలో ఉండాలి. తగినంత నిడివిలో ఉండాలి. లైవ్ స్ట్రీమ్ లు చేస్తే.. ఆ లైవ్ కొనసాగినంతసేపూ కంటిన్యూ గా డిస్​క్లోజర్ కనిపించేలా ప్రసారం చేయాలి. 
  • ఎండార్స్ మెంట్ మెసేజ్​లో స్పష్టంగా కనిపించేలా డిస్​క్లోజర్ ఉండాలి. ఫొటోపై డిస్​క్లోజర్ పెట్టాలంటే స్పష్టంగా కన్పించేలా సూపర్ ఇంపోజ్ చేయాలి. వీడియోలో అయితే ఆడియో, వీడియోలో, ట్విట్టర్​ లాంటి ప్లాట్ ఫామ్స్​లలో  ‘ఫలానా కంపెనీ అంబాసిడర్’ అని పేర్కొనవచ్చు.
  • గైడ్ లైన్స్​ను ఉల్లంఘించే వాళ్లపై సీసీపీఏ చర్యలు తీసుకుంటుంది. రూల్స్​ ఉల్లంఘించే మాన్యుఫాక్చరర్లు, అడ్వర్టైజర్లు, ఎండార్సర్లకు 10 లక్షల వరకూ ఫైన్ వేయొచ్చు. మళ్లీ మళ్లీ నేరానికి పాల్పడితే రూ. 50 లక్షల వరకూ ఫైన్ వేయొచ్చు.