కాజీపేట, వెలుగు: వరంగల్ నిట్ స్టూడెంట్లు హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిశారు. ఏక్ భారత్.. శ్రేష్ఠ్ భారత్ ప్రోగ్రాంలో భాగంగా హర్యానాలో కల్చరల్ ఎక్చేంజ్ ప్రోగ్రాం జరుగుతోంది. నిట్ స్టూడెంట్లకు, ఫ్యాకల్టీకి ఆహ్వానం అందగా, శనివారం అక్కడికి వెళ్లి గవర్నర్ ను కలిశారు. వారి సమక్షంలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు, గీతాలు, జానపద నృత్యాలను ప్రదర్శించారు.
ప్రజల సొమ్మును దోచుకుంటున్న టీఆర్ఎస్
శాయంపేట, వెలుగు: ప్రజల సొమ్మును దోపిడీ దొంగల్లా టీఆర్ఎస్ లీడర్లు దోచుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణ రావు విమర్శించారు. శనివారం భారత్ జోడో యాత్రకు మద్దతుగా హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక నుంచి శాయంపేట వరకు పాదయాత్ర చేశారు. ముందుగా చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి, నివాళి అర్పించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్నారు. ప్రశ్నించే గొంతుకలను అణగదొక్కాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎరువులపై సబ్సిడీ ఎత్తేసి నిత్యవసర, ఇంధన ధరలు పెంచి పేదలపై భారం మోపాయని ఎద్దేవా చేశారు.
కేంద్రం అన్ని రంగాల్లో విఫలం
జనగామ, వెలుగు: కేసీఆర్ కోసం దేశం ఎదురు చూస్తోందని.. ఇక్కడి సంక్షేమ పథకాలు దేశమంతటా అమలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. కేంద్రం అన్ని రంగాల్లో విఫలమైందని, పేదలను వదిలి, కార్పొరేట్ శక్తులకు ఊడింగం చేస్తోందన్నారు. రాష్ర్టాలపై పెత్తనం చేసేందుకు చిల్లర రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్,బీజేపీలకు దేశాన్ని పాలించే నైతిక హక్కు లేదన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించడం ఖాయమన్నారు. లైబ్రరీ చైర్మన్ కృష్ణారెడ్డి, రమేశ్, బండా యాదగిరి రెడ్డి తదితరులున్నారు.
చేపలు ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ
రాయపర్తి, వెలుగు: చేపలు ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ చేరుకుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శనివారం ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, కలెక్టర్ గోపితో కలిసి వరంగల్జిల్లా రాయపర్తి మండలంలోని మైలారం బ్యాలెన్సింగ్రిజర్వాయర్లో మంత్రి చేప పిల్లలు వదిలారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, మత్య్సకారులు ఆర్థికంగా ఎదగాలన్నారు. గతంలో ఏడాదికి పది రోజులే నీళ్లు వచ్చేవని, ఇప్పుడు ఏడాది పొడవునా నీళ్లు వస్తున్నాయని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్
తదితరులున్నారు.
ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలి
రేగొండ, వెలుగు: టీఆర్ఎస్ ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ల లాంటివని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో శనివారం ఆసరా పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయన్నారు. ప్రతి పక్షాల విష పన్నాగాలను తిప్పికొట్టి, టీఆర్ఎస్కు అండగా ఉండాలన్నారు.
నీళ్ల కోసం బోరు వేయించిన ఎమ్మెల్యే..
మొగుళ్లపల్లి: మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతి బాపులే గురుకుల స్కూల్లో నీటి సమస్యపై ఇటీవల విద్యార్థులు ఆందోళన చేశారు. స్పందించిన ఎమ్మెల్యే శనివారం స్కూల్ ఆవరణలో బోరు వేయించారు. స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
వెయ్యి స్తంభాల గుడికి యునెస్కో గుర్తింపు తీసుకొస్తం
హనుమకొండ, వెలుగు: చారిత్రక వెయ్యి స్తంభాల గుడికి యునెస్కో గుర్తింపు వచ్చేలా కృషి చేస్తామని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. కేంద్ర పురావస్తుశాఖ పట్టించుకోకపోవడం వల్ల గుడిలో కల్యాణ మండప పనులు ముందుకుసాగడం లేదని, ఆలయ అభివృద్ధికి తన ఎంపీ ల్యాండ్స్నుంచి రూ.కోటి అందించనున్నట్లు ప్రకటించారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శనివారం వరంగల్ నగరానికి వచ్చిన ఆయన.. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి ఓరుగల్లు భద్రకాళి గుడి, వెయ్యి స్తంభాల గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయా ఆలయాల పరిసరాల్లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు. ఈ నెల 26 నుంచి ప్రారంభంకానున్న దేవీ నవరాత్రి ఉత్సవాల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇక్కడి చరిత్రను, సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. వరంగల్ అంటే కేసీఆర్‌కు ఎనలేని అభిమానమన్నారు. ఆయన వెంట మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, నన్నపనేని నరేందర్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, కుడా ఛైర్మన్ సుందర్ రాజు, మేయర్ గుండు సుధారాణి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కార్పొరేటర్లు ఉన్నారు.
పాత కక్షలతోనే సింగరేణి కార్మికుడి హత్య
రేగొండ(గణపురం), వెలుగు: పాత కక్ష్యలతోనే సింగరేణి కార్మికుడు బండారి ఓదెలు(58)ను అతని అల్లుడు నక్క రమేశ్హతమార్చినట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల ఎస్సై అభినవ్ వెల్లడించారు. రమేశ్‌తో పాటు ఆయన తండ్రి సోమయ్య, తోడల్లుడు శ్రీనివాస్, లింగయ్యలను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఎస్సై వివరాల ప్రకారం.. మండలంలోని వెంకటేశ్వర్లపల్లికి చెందిన ఓదెలు సింగరేణి కార్మికుడిగా పనిచేస్తున్నాడు. తన కూతురును రమేశ్ కొన్నేండ్ల కింద పెండ్లి చేసుకున్నాడు. కట్నం కింద ఇచ్చిన భూమి విషయంలో ఓదెలుతో రమేశ్ కు గొడవలు జరిగాయి. దీంతో పాటు తన మామ అయిన ఓదెలు.. భార్య ఉండగానే రెండో పెండ్లి చేసుకున్నాడు. మొదటి భార్యను ఓదెలు గతంలో హత్య చేశాడు. దీంతో మామపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో రమేశ్ తన తండ్రి సోమయ్య, తోడల్లుడు దండవెన శ్రీనివాస్, గణపురం మండలం నగరంపల్లికి చెందిన లింగయ్యతో కలిసి ఈనెల 5న ఓదెలు హత్యకు ప్లాన్వేశాడు. గ్రామ శివారులో బైక్ పై వెళ్తున్న ఓదెలును ట్రాక్టర్‌తో ఢీకొట్టి హత్య చేశారు. దీనిని యాక్సిడెంట్ గా చిత్రీకరించారు. శనివారం నిందితులు హైదరాబాద్ కు పారిపోతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు.
యాక్సిడెంట్లో యువకుడి మృతి
నర్సంపేట, వెలుగు: బైక్అదుపుతప్పి యువకుడు మృతి చెందగా.. మరోఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ శివారులో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఖానాపురం మండలం బుధరావుపేటకు చెందిన నారగాని ప్రశాంత్(28), తన ఫ్రెండ్ తో కలిసి ఆదివారం అర్ధరాత్రి నర్సంపేటకు వెళ్లాడు. హైదరాబాద్ నుంచి వచ్చిన మరో ఫ్రెండ్ ను పికప్ చేసుకున్నాడు. ముగ్గురు కలిసి నర్సంపేట నుంచి గ్రామానికి బయలుదేరారు. ఈక్రమంలో ఖానాపురం బ్రిడ్జి వద్దకు రాగానే బైక్అదుపు తప్పి పడిపోయింది. ఈ ఘటనలో స్పాట్లోనే ప్రశాంత్ చనిపోయాడు. మిగతా ఇద్దరికి గాయాలు కాగా పోలీసులు అంబులెన్స్‌లో నర్సంపేట ఏరియా హాస్పటల్‌కు తరలించారు.
పిడుగుపడి మహిళా రైతు మృతి
శాయంపేట, వెలుగు: పొలంలో పనిచేస్తుండగా పిడుగుపడి మహిళా రైతు మృతిచెందింది. ఈ విషాద సంఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకొండపాక గ్రామంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చందా రాజయ్య ఆర్టీసీ కండక్టర్ కాగా, భార్య రమ వ్యవసాయ పనులు చేస్తుండేది. శనివారం సాయంత్రం పొలం పనులు చేస్తుండగా.. తన పక్కనే పిడుగు పడింది. దీంతో స్పాట్ లో చనిపోయింది. విషయం తెలుసుకున్న తోటి రైతులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తల్లి మరణం తట్టుకోలేక పిల్లలు తీవ్రంగా రోదించారు.
సమైక్యతా వజ్రోత్సవాలకు ఏర్పాట్లు చేయాలి
హనుమకొండ కలెక్టరేట్, వెలుగు: ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు జరిగే జాతీయ సమైక్యత వజ్రోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సిబ్బందిని ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో నోడల్ ఆఫీసర్లతో కలిసి రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 16న హయాగ్రీవచారి గ్రౌండ్ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు 15వేల మందితో భారీ ర్యాలీ తీయనున్నట్లు వెల్లడించారు. 17న పంద్రాగస్టు మాదిరిగానే వజ్రోత్సవాలు నిర్వహిస్తామన్నారు. 18న అంబేడ్కర్ భవన్ లో స్వాతంత్ర్య సమరయోధులను సన్మానించనున్నట్లు తెలిపారు. సమావేశంలో జేసీ సంధ్యారాణి, ఆర్డీవో వాసుచంద్ర, డీఆర్డీవో శ్రీనివాస్ కుమార్ తదితరులున్నారు.
గ్రామాల అభివృద్ధికి కృషి
ధర్మసాగర్, వెలుగు: గ్రామాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. శనివారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో ఎమ్మెల్యే పర్యటించారు. సాయిపేటలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గ్రామంలో కొత్త పెన్షన్లు పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన ఎస్. కరుణాకర్ దళితబంధుకు ఎంపిక కాగా, రూ.10లక్షలతో కొనుగోలు చేసిన బొలెరో వెహికల్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఓ బాధితుడికి సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచులు రవీందర్, సోమిరెడ్డి తదితరులున్నారు.
