V6 News

బీహార్ సీఎంగా తేజస్వి యాదవ్‭కే అర్హత ఉంది: ప్రశాంత్ కిషోర్

బీహార్ సీఎంగా తేజస్వి యాదవ్‭కే అర్హత ఉంది: ప్రశాంత్ కిషోర్

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్.. బీహార్ సీఎం నితీశ్ కుమార్‭కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. బీహార్ సీఎం పదవి కోసం ఆర్జేడీ అగ్ర నేత తేజస్వి యాదవ్‌ 2025 వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని పీకే అన్నారు. ఆర్జేడీ, జేడీయూ సంకీర్ణ సర్కారులో అతిపెద్ద పార్టీ ఆర్జేడీయేనని, కాబట్టి ముఖ్యమంత్రి అయ్యే హక్కు తేజస్వికే ఉందని స్పష్టం చేశారు. నితీశ్ కుమార్ బీహార్ సీఎం పదవి నుంచి తప్పుకుని తేజస్విని సీఎం చేయాలని పీకే సలహా ఇచ్చారు. అలా చేయడం వల్ల తేజస్వి యాదవ్‌కు వచ్చే ఎన్నికల సమయానికి మూడేండ్ల పరిపాలన అనుభవం వస్తుందన్నారు. అంతేకాకుండా.. తేజస్వి పాలనను చూసి బీహార్ ప్రజలు అతడికే ఓటు వేసే అవకాశం ఉందన్నారు. 

2020 శాసనసభ ఎన్నికల్లో ఆర్జేడీ 75 సీట్లతో గెలిచి సింగిల్ లార్జెస్ట్‌ పార్టీగా నిలిచింది. నితీశ్‌ నేతృత్వంలోని జేడీయూ కేవలం 43 స్థానాలకే పరిమితమైంది. అయినా తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న నితీశ్‌ ముఖ్యమంత్రిగా, ఎక్కువ బలం ఉన్న ఆర్జేడీ నేత తేజస్వి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం సరైంది కాదని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు.