ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి ముహూర్తం కుదుర్తలేదు

ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి ముహూర్తం కుదుర్తలేదు

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి ముహూర్తం కుదరడం లేదు. నోటిఫికేషన్ రేపు, మాపు అని చెప్పడమే తప్పితే, ఏండ్లు గడుస్తున్నా విడుదల కావడం లేదు. ఇప్పుడు ఎస్టీ రిజర్వేషన్ల పెంపు రూపంలో మరో ఆటంకం వచ్చి పడింది. ఆరోగ్యశాఖ వద్దకు వచ్చిన ఫైల్.. రోస్టర్ పాయింట్లు ఫిక్స్ చేయడం కోసం మళ్లీ ఆర్థిక శాఖ వద్దకు వెళ్లింది. అక్కడ పని పూర్తయి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌‌మెంట్ బోర్డు వద్దకు వస్తే తప్ప నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం లేదు. దీనికి ఇంకెన్ని రోజులు పడుతుందో తెల్వదు. మొత్తంగా కొత్త, పాత మెడికల్ కాలేజీల్లో కలిపి సుమారు 1300 ఖాళీలు ఉన్నాయి. ఈ ఏడాది రాష్ట్రంలో 7 కొత్త మెడికల్ కాలేజీలు వచ్చాయి. ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ కూడా షురూ అయింది. మరో నెల రోజుల్లో కొత్త, పాత కాలేజీలన్నింట్లో క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికిప్పుడు భర్తీ ప్రక్రియ మొదలు పెట్టినా, క్లాసులు మొదలయ్యే నాటికి రిక్రూట్‌‌మెంట్  ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మరోసారి కాంట్రాక్ట్ పద్ధతిలో టెంపరరీ రిక్రూట్‌‌మెంట్లకే ఆఫీసర్లు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పాత కాలేజీల్లో 30 నుంచి 40 మంది చొప్పున అసిస్టెంట్ ప్రొఫెసర్లు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. ఇప్పుడు కొత్త కాలేజీల్లోనూ కాంట్రాక్ట్ బేసిస్‌‌ మీద నియామకం చేపట్టాలని భావిస్తున్నారు. వాక్ ఇన్ పద్ధతిలో ఈ రిక్రూట్‌‌మెంట్లు జరగనున్నాయి.

కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు జీతాలు ఇస్తలే

రెగ్యులర్ రిక్రూట్‌‌మెంట్ చేయకపోగా, కాంట్రాక్ట్  పద్ధతిపై పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లకు కూడా సర్కారు సరిగా జీతాలు ఇవ్వడం లేదు. ఐదు నెలలుగా వారికి జీతాలు విడుదల కాలేదు. దీంతో కుటుంబాలు గడవడం కష్టంగా మారిందని, అప్పుల కోసం చేతులు చాచాల్సి వస్తోందని ఆ ప్రొఫెసర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు ఓపిక పట్టామని, ఇకనైనా తమకు రెగ్యులర్‌‌‌‌గా వేతనాలు ఇవ్వాలని వారం రోజుల క్రితమే కాలేజీల ప్రిన్సిపాల్స్‌‌కు, డీఎంఈకి వినతిపత్రాలు అందజేసినా ఇప్పటికీ జీతాలు విడుదల కాలేదు. దీంతో విధులు బహిష్కరించే యోచనలో డాక్టర్లు ఉన్నారు. ఈ ఏడాది జూన్‌‌లో స్టైపెండ్, సాలరీల కోసం జూనియర్ డాక్టర్లు సమ్మె చేసినప్పుడు, వేతనాలు రెగ్యులర్‌‌‌‌గా వచ్చేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ప్రత్యేక సాఫ్ట్‌‌వేర్ రూపొందించి, నెలనెలా వారికి స్టైపెండ్, కాంట్రాక్ట్ డాక్టర్లకు సాలరీలు పడేలా చూస్తామన్నారు. కానీ, ఈ హామీ అమలుకు నోచుకోలేదు. అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఐదు నెలల వేతనాలు పెండింగ్‌‌లో ఉండగా, జూనియర్ డాక్టర్లకు రెండు నెలల స్టైపెండ్ పెండింగ్‌‌లో ఉంది.