ల్యాబ్‌‌ నుంచి కాదు.. గబ్బిలాల నుంచే కరోనా

ల్యాబ్‌‌ నుంచి కాదు.. గబ్బిలాల నుంచే కరోనా
  • ముందు ఒక జంతువులోకి.. అటు నుంచి మనుషులకు: డబ్ల్యూహెచ్​వో రిపోర్టు
  • కరోనా పుట్టుకపై చైనాతో కలిసి జాయింట్ స్టడీ
  • ల్యాబ్ నుంచి లీక్ అవ్వడానికి అవకాశం లేదని వెల్లడి

బీజింగ్: చైనాలోని వుహాన్​ ల్యాబ్​లోనే కరోనా పుట్టిందని అమెరికా సహా ఎన్నో దేశాలు ఆరోపిస్తున్నాయి. ‘కాదు.. మా దేశంలో కరోనా పుట్టలేదు’ అని చైనా బల్లగుద్ది చెబుతోంది. ఈ నేపథ్యంలో చైనా వాదనకు బలం చేకూర్చేలా డబ్ల్యూహెచ్​వో, చైనా కలిపి చేసిన జాయింట్ స్టడీ రిపోర్టు వివరాలను అసోసియేటెడ్ ప్రెస్ సంస్థ బయటపెట్టింది. ‘‘గబ్బిలాల నుంచి ఒక జంతువులోకి ప్రవేశించిన వైరస్.. ఆ తర్వాత మనుషులకు సోకింది. ల్యాబ్ నుంచి లీక్ అవ్వడానికి అవకాశమే లేదు” అని స్టడీలో పేర్కొన్నారు. ఈ రిపోర్టును చాలా రోజులుగా రిలీజ్ చేయకుండా దాచి ఉంచుతున్నారు. తమపై పడ్డ నిందను చెరిపేసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, అందుకే నివేదిక బయటికి రాకుండా ఇన్నాళ్లు అడ్డుకుందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో డబ్ల్యూహెచ్​వోకు చెందిన ఓ డిప్లమాట్.. అసోసియేటెడ్​ ప్రెస్​కు స్టడీ రిపోర్టు కాపీని అందజేశారు. ఇది ఫైనల్ వెర్షన్ అని ఆ డిప్లమాట్ చెప్పారు.
అలుగు, పిల్లి, మింక్ వల్ల కూడా
గబ్బిలాల నుంచి మరొక జంతువు ద్వారా మనుషులకు సోకేందుకు అవకాశం ఎక్కువ ఉందని రీసెర్చర్లు తమ స్టడీలో పేర్కొన్నారు. గబ్బిలాల నుంచి నేరుగా మనుషులకు వ్యాప్తి చెంది ఉండొచ్చని చెప్పారు. అలాగే కోల్డ్–చైన్ ఆహార ఉత్పత్తుల ద్వారా వ్యాప్తికి కూడా అవకాశం ఉందన్నారు. అలుగు, పిల్లి, మింక్ వల్ల కూడా వ్యాప్తి చెంది ఉండొచ్చని చెప్పారు. కానీ కరోనా వ్యాప్తిలో వుహాన్ మార్కెట్ నుంచి పాత్ర,  ఇన్ఫెక్షన్ మార్కెట్లోకి ఎలా ప్రవేశించిందనే దానిపై ఎలాంటి కంక్లూజన్ ఇవ్వలేదు.
రిపోర్టు రాయడంలో చైనా సాయం: అమెరికా
‘‘డబ్ల్యూహెచ్​వో నివేదిక రూపొందించడంలో ఫాలో అయిన మెథడాలజీ విషయంలో మేం ఆందో ళన చెందుతున్నాం. ఎందుకంటే ఆ రిపోర్టును రాయడానికి చైనా ప్రభుత్వం సాయపడింది” అని అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ అన్నారు. ఈ కామెంట్లను చైనా కొట్టిపారేసింది. నివేదికపై మాట్లాడటం ద్వారా.. డబ్ల్యూహెచ్​వో ఎక్స్​పర్టుల గ్రూప్ సభ్యులపై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా ప్రయత్నించడం లేదా అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ ప్రశ్నించారు.

ఇయ్యాల బయటపెడ్తం: డబ్ల్యూహెచ్​వో డైరెక్టర్
స్టడీ రిపోర్టు తమకు అందిందని, మంగళవారం దాన్ని అధికారికంగా రిలీజ్ చేస్తామని డబ్ల్యూహెచ్​వో డైరెక్టర్ టెడ్రోస్ అథనామ్ చెప్పారు. ‘‘ముందు రిపోర్టును మేం చదువుతాం. చర్చిస్తాం. అందులో ఉన్న అంశాలను అర్థం చేసుకుంటాం. తర్వాత సభ్య దేశాలతో కలిసి ముందుకు వెళ్తాం” అని వివరించారు. ఈ రిపోర్టు విషయంలో రాజకీయ ఒత్తిడి వచ్చిందా అని ప్రశ్నించగా.. ఆయన స్పందించేందుకు నిరాకరించారు.