శరద్​పవార్​ మరో ఉద్ధవ్​ థాక్రే?

శరద్​పవార్​ మరో ఉద్ధవ్​ థాక్రే?

ఇటీవలి అమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా కలిసిన ఓ ఫేమస్‌‌ వ్యక్తి నికోలస్‌‌ తలేజ్. ఆయన 2007లో రాజకీయ పరిభాషలో ‘బ్లాక్ స్వాన్’ అనే పదాన్ని ఉపయోగించాడు. దానర్థం ‘‘అసాధ్యమైంది ఏదైనా జరిగితే, అది నల్ల హంసను చూసినట్లే’’ అని చెప్పాడు. ఎందుకంటే సాధారణంగా హంసలు తెల్లగా ఉంటాయి. నల్ల హంసలు అరుదుగా కనిపిస్తాయి. ఇప్పుడది అజిత్ పవార్ చేసిన పనికి వర్తిస్తుంది. అతని ఫిరాయింపు అందరికీ చాలా దిగ్భ్రాంతి కలిగించింది, ఇది భారత రాజకీయాల్లో ‘నల్ల హంస’ సంఘటన. 

వాస్తవానికి నిన్ననే, శరద్ పవార్ విపక్షాల ఐక్యత గురించి, 2024లో బీజేపీని ఎలా ఓడిస్తారనే దాని గురించి మాట్లాడుకున్నారు. వాస్తవానికి, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాకుండా తానే ప్రతిపక్షాల కన్వీనర్‌‌గా ఉండాలని కోరుకున్నారు. శరద్ పవార్ కూడా తన అన్న కొడుకు అజిత్ పవార్ తనను విడిచిపెట్టడమే కాకుండా, అతని సన్నిహిత అనుచరులు ప్రఫుల్ పటేల్, చగన్ భుజ్‌‌బల్‌‌లను కూడా తనను విడిచిపెడతారని ఊహించి ఉండరు. 1995లో చాలా మంది ఎమ్మెల్యేలు ఎన్టీఆర్‌‌ను పారద్రోలినట్లుగానే చాలా మంది ఎమ్మెల్యేలు అజిత్ పవార్‌‌తో ఉన్నారు.

అజిత్ పవార్ ఎందుకు వెళ్లిపోయారు?

 అజిత్ పవార్‌‌ను మహారాష్ట్ర ఎన్‌‌సీపీ అధ్యక్షుడిగా చేయకపోవడం లేదా అలాంటి మరే ఉన్నత పదవీ ఇవ్వకపోవడం వల్ల ఆయన అసంతృప్తిగా ఉన్నారని చాలా మంది భావిస్తున్నారు. ముఖ్యమైన కారణం ఏమిటంటే, అజిత్ పవార్, ఇతరులు ప్రతిపక్షంలో కొనసాగడంలో అర్థం లేదని, బహుశా 2024 ఎన్నికల్లో కూడా ఓడిపోవచ్చని భావించారు. నిరంతరం ప్రతిపక్షంలో ఉండి ప్రయోజనం ఏమిటి? అనే ప్రశ్న తలెత్తడమూ ఓ కారణమే! తమ పార్టీ ఎన్‌‌సీపీ, శివసేనతో పొత్తు పెట్టుకుంటే తప్పులేనపుడు, బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకోకూడదని అజిత్ పవార్ అన్నారు. నిజానికి, బీజేపీ కంటే శివసేనదే తీవ్ర హిందుత్వవాదం అని అజిత్​ సమర్థించుకున్నారు.

సావర్కర్ మహారాష్ట్రీయుల హీరో

ఫెయిలైన సీఎం ఉద్ధవ్ థాక్రేను మళ్లీ సీఎం చేయడం కోసం రాజకీయాల్లో ఉండటం వల్ల ప్రయోజనం లేదని అజిత్ పవార్, ఇతరులు కూడా భావించారు. 2024 రాష్ట్ర ఎన్నికల్లో ఎన్‌‌సీపీ ఓడిపోతే, 2029 వరకు మరో 5 ఏండ్లు వేచి ఉండాలా? శివసేన విడిపోయిన తర్వాత మహారాష్ట్రలో బీజేపీని ఓడించడం అసాధ్యం అనేది ఆయన వాదన. వీర్ సావర్కర్‌‌పై రాహుల్ గాంధీ, ఇతరులు తరచుగా చేసిన దాడులు మహారాష్ట్రీయులందరి సహనాన్ని పరీక్షించాయి. ఎందుకంటే వీర్ సావర్కర్ అక్కడ హీరో. రాహుల్ గాంధీ రాజకీయాల కంటే బీజేపీ రాజకీయాలతోనే వారు సుఖంగా ఉన్నారు. రాహుల్ గాంధీ జాతీయ నాయకత్వానికి  మద్దతు ఇవ్వడం వృధా అని అజిత్ పవార్ గ్రూప్ భావించింది.  2024లో నరేంద్ర మోడీ గెలుస్తారని వారు పసిగట్టారు. పనికిరాని యుద్ధాలకు తమ రక్తాన్ని ఎందుకు వృధా చేస్తారు?

శరద్ పవార్ పై..

 సహజంగానే, శరద్ పవార్‌‌పై ఎక్కువ ప్రభావం ఉంటుంది.  ఇప్పుడు తన ప్రతిష్టను, అధికారాన్ని కోల్పోయారు. ఇక శరద్ పవార్ ఒక శక్తిగా ఉండే అవకాశం ఇక లేదు. ఇప్పుడు అతన్ని ఎవరూ సీరియస్‌‌గా తీసుకోరు. ఉద్ధవ్ థాక్రే కూడా  ఘోర పరాజయం పొందారు. కొంత మంది నాయకులు ఉద్ధవ్ థాక్రేను విడిచిపెట్టవచ్చు, అతని భవిష్యత్తు సందేహాస్పదంగా ఉంది. విపక్షాల ఐక్యత, ఎన్నికల తర్వాత రాహుల్‌‌గాంధీకి నాయకత్వం వహించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడు అది ఓ పీడ కలలా కనిపిస్తోంది. మహారాష్ట్రలో కాంగ్రెస్ బలం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంది. శరద్ పవార్‌‌ పొత్తుతో గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. శరద్ పవార్ బలహీనంగా ఉండటంతో కాంగ్రెస్‌‌కు అసెంబ్లీలో స్కోర్ చేయడం కష్టంగా మారనుంది. అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్ వారి సహచరులు తిరిగి అధికారంలోకి వచ్చారు. రాజకీయాల్లో అధికారం లేకుంటే వాడిపోతారు.

బీజేపీకి మహారాష్ట్ర కీలకం

2019 పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్రలోని 48 పార్లమెంట్ స్థానాలకు గానూ బీజేపీ -శివసేన కూటమి 41 పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంది. ఈ  ఎంపీల పెద్ద సంఖ్య 2019లో బీజేపీకి మెజారిటీని అందించింది. శివసేన, శరద్ పవార్, కాంగ్రెస్ కలిసి వచ్చినప్పుడు, అది బాగా కనిపించింది. ఆ కూటమి అలాగే కొనసాగితే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి చేటు చేసేది.  కానీ బీజేపీకి ఇపుడు ఆ గడ్డు పరిస్థితి తప్పిపోయింది . అజిత్ పవార్, ఏక్‌‌నాథ్ షిండేతో పొత్తుతో, 2024  ఎన్నికలను బీజేపీ ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని అత్యధిక స్థానాలను గెలుచుకుంటుంది. ఎన్‌‌సీపీలో చీలిక కారణంగా ప్రతిపక్షాల ఐక్యత దెబ్బతింటోంది.  కానీ పార్టీలు బలహీనంగా ఉంటే ఐక్యతతో ఉపయోగం ఏమిటి? 1 లేదా 2 ఎంపీ సీట్లు గెలిచే పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి? అజిత్ పవార్ ఫిరాయింపు ఒక రాజకీయ భూకంపం.  శరద్ పవార్, కాంగ్రెస్, ఉద్ధవ్ థాక్రేలకు అది ప్రతికూలంగా మారిందనే చెప్పాలి.  సానుకూల ప్రభావం బీజేపీ వైపు మళ్లింది. అయితే మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్, నితీష్ కుమార్,  కేసీఆర్‌‌లకు కూడా అది సానుకూల ప్రభావమే. ఈ ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్‌‌కు బలం చేకూరాలని ఎప్పుడూ కోరుకోలేదు.

శరద్​పవార్​వద్ద జవాబులు లేవు

ప్రముఖ బ్రిటీష్ ఎంపీ ఎనోచ్ పావెల్ ఇలా అన్నారు: మీరు ఏదైనా సంతోషకరమైన దశలో వదిలేస్తే తప్ప రాజకీయాలన్నీ ఫెయిల్యూర్‌‌‌‌తోనే ముగుస్తాయి. శరద్ పవార్ కూడా జీవిత చరమాంకంలో చాలా మంది నాయకుల్లానే అవమానాలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. శరద్ పవార్ తన అనుచరులకు క్రింది రెండు  ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయాడు. ఉద్ధవ్ థాక్రేను మళ్లీ మహారాష్ట్ర సీఎంగా చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి? రాహుల్ గాంధీని ప్రధాని చేయడం వల్ల ఉపయోగం ఏమిటి? శరద్ పవార్ వద్ద సమాధానాలు లేకపోవడంతో వారు వెళ్లిపోయారు. శక్తివంతమైన శరద్ పవార్ లేకుండా, ప్రతిపక్షాలు భారత రాజకీయాల్లో మనుగడను కోల్పోయాయని,  ప్రజాస్వామ్యం ధ్వంసమైందని చెప్పడంలో అర్థం లేదు. ఎందుకంటే 1978లో శరద్ పవార్ 37 ఏళ్ల వయసులో 40 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ నుంచి ఫిరాయించి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడూ ప్రజాస్వామ్యం ఉంది, ఇప్పుడూ ప్రజాస్వామ్యం ఉంది.

- డా. పెంటపాటి పుల్లారావు, పొలిటికల్​ ఎనలిస్ట్