లాక్డౌన్ లో కొత్త దందా.. కారు ఫేక్ పాస్ కు రూ. 30,000

లాక్డౌన్ లో కొత్త దందా.. కారు ఫేక్ పాస్ కు రూ. 30,000

కరోనావైరస్ నియంత్రణకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. దాంతో ఏ రాష్ట్రంలో ఉన్న వాళ్లు అక్కడే ఉండిపోయారు. అలాంటి వాళ్లు తమతమ రాష్ట్రాలకు వెళ్లేందుకు కూడా పోలీసులు అనుమతులు ఇవ్వకపోవడంతో చాలామంది అక్కడే చిక్కుకుపోయారు. దీన్ని ఆసరగా చేసుకున్న ఓ ముఠా ఫేక్ పాసులను సృష్టించి లక్షలు గుంజుతోంది.

పంజాబ్ లోని హోషియార్‌పూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ జిల్లాలో చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వచ్చిన వలసదారులు చాలామంది ఉన్నారు. లాక్డౌన్ తో వారంతా తమ స్వస్థలాలకు వెళ్లాలని అనుకున్నారు. కానీ, పోలీసులు ఎక్కడి వారు అక్కడే ఉండాలని ఆదేశించారు. దాంతో వలసదారుల అవసరాన్ని అవకాశంగా మార్చుకున్న కొంతమంది స్థానికులు ఫేక్ పాసులు తయారుచేసి వారిని రాష్ట్రాలు దాటించడానికి పూనుకున్నారు. ఇదేదో ఉచిత సేవ అనుకునేరు.. ఊరికే కాదు సుమా.. ఒక కారును రాష్ట్రం దాటించాలంటే అక్షరాల రూ. 30 వేలు సమర్పించాల్సిందే. అదే ట్రక్కు అయితే రూ. 60 వేలు చెల్లించాల్సిందే. నకిలీ పాసులు తయారుచేస్తున్న ముఠా ఇప్పటికే 71 మందిని ఉత్తరప్రదేశ్, బీహర్ రాష్ట్రాలకు తరలించారు. అందుకుగాను వారు రూ. 3.5 లక్షలు వసూలు చేశారు. ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా పడి చివరికి పోలీసుల దాకా చేరింది. దాంతో నిఘా పెట్టిన పోలీసులకు దొరికిపోయారు ఈ నకిలీ కరోనా గాళ్లు. వలసదారుల్లో 13 మందిని ట్రక్కులో, 20 మందిని రెండు మినీ ట్రక్కుల్లో, మిగతావారిని ఆరుగురు చొప్పున మూడు కార్లలో తరలించారు.

కొంతమంది వ్యక్తులు పంజాబ్ నుండి హర్యానా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు నకిలీ కర్ఫ్యూ పాసులు ఉపయోగించి జనాన్ని తరలిస్తున్నారని హోషియార్పూర్ పోలీసుల దృష్టికి వచ్చిందని డీజీపీ దినకర్ గుప్తా తెలిపారు. దాంతో నిఘా పెట్టి ఆ ముఠాకు చెందిన తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. హోషియార్‌పూర్‌లోని తాండా పోలీస్‌స్టేషన్‌లో ఈ ముఠాపై కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. నిందితుల నుంచి ఐదు నకిలీ కర్ఫ్యూ పాస్‌లు, తాండా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ స్టాంప్, కంప్యూటర్, సీపీయూ, ప్రింటర్, ఆరు మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు గుప్తా తెలిపారు. ఈ ముఠా ఏప్రిల్ 12 నుంచి ఇప్పటివరకు బీహార్‌లోని గోండా జిల్లాకు, ఉత్తరప్రదేశ్‌లోని లక్నో, సహారన్‌పూర్‌కు నాలుగు రౌండ్లు వలసదారులను చేరవేసినట్లు పోలీసులు తెలిపారు.

For More News..

కరోనా వేస్టేజ్​తో జాగ్రత్త

‘పీఎం కేర్స్ ఫండ్’పై ఆడిటింగ్ ఉండదు!

శ్రీలంక నేవీలో 29 మందికి ​ కరోనా పాజిటివ్​