సిటీ షాపుల్లో విచ్చలవిడిగా ఔట్​​డేటెడ్​ మాల్ అమ్మకం

సిటీ షాపుల్లో విచ్చలవిడిగా ఔట్​​డేటెడ్​ మాల్ అమ్మకం

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​సిటీలోని షాపుల్లో కాలం చెల్లిన ఫుడ్​ఐటమ్స్ ను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. పాలు, పెరుగు,  బ్రెడ్ నుంచి పిల్లలు తినే స్నాక్స్ వరకు అన్నీ ఇలాగే ఉంటున్నాయి. చాలా రకాలు ఎఫ్ఎస్ఎస్ఏఐ(ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్​ అథారిటీ ఆఫ్ ఇండియా)స్టాంపు లేకుండానే నేరుగా మార్కెట్లోకి వస్తున్నాయి. వంటలోకి వాడే పొడులు, మసాలాలపై అస్సలు ఎలాంటి స్టాంపులు ఉండడం లేదు. ఎప్పుడు తయారైందో.. ఎన్నాళ్లు వాడుకోవచ్చో అమ్మేవారికి కూడా తెలియదు. ఆయా వస్తువులకు ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని నాసి రకాలను తెచ్చి జనాలకు అంటగడుతున్నారు. తెలియక వాటిని తింటున్నవారు రోగాల పాలవుతున్నారు. చిన్న పిల్లలు తినే స్నాక్స్ ప్యాకెట్లు నకిలీ పేర్లతో షాపుల్లో విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. చిన్నారులను ఆకర్షించేలా, చూడడానికి బ్రాండెడ్​తరహాలోనే ఉంటున్నాయి. తక్కువ రేటుకు మాల్​దొరుకుతుండడంతో షాపుల నిర్వాహకులు వాటినే తెచ్చి అమ్మేస్తున్నారు. తల్లిదండ్రులకు ఆ విషయం తెలియకపోవడం, జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీలు చేయకపోవడంతో పిల్లలు రోగాల బారినపడుతున్నారు. ఈ విషయమై జీహెచ్ఎంసీ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ బాలాజీరాజ్ ని వివరణ కోరగా తాము అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఫుడ్ క్వాలిటీపై ఫిర్యాదు చేయాలనుకుంటే జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్ నంబర్(040–21111111)కు కాల్​చేసి చెప్పొచ్చని తెలిపారు.

ప్యాకింగ్ ​డేట్​ మాత్రమే

కొన్నిరకాల ఫుడ్ ఐటమ్స్ పై తయారు చేసిన తేదీలు మాత్రమే ఉంటున్నాయి. ఎప్పటివరకు వాడుకోవచ్చో ముద్రించడం లేదు. కొన్నింటిపై ఉన్నా కనిపించడం లేదు. ముఖ్యంగా పాల ఉత్పత్తులను ఎక్కువగా రిఫ్రజరేటర్లలో నిల్వ ఉంచి విక్రయిస్తున్నారు. వాటిపై ఎక్స్​పైరీ డేట్​ఉండడం లేదు. రెండు, మూడు రోజులకు పాడయ్యే పదార్థాలను కొన్నిచోట్ల వారం రోజుల వరకు అమ్ముతున్నారు. షాపు యజమానులపై ఉన్న నమ్మకంతో తెలియక వాటినే కొంటున్నారు.

ఇండ్లు, శివారు ప్రాంతాల్లో తయారీ

చిన్నారులు ఇష్టంగా తినే స్నాక్స్ ను కొన్ని బ్రాండెడ్ కంపెనీలు మంచిగానే తయారు చేస్తున్నప్పటికీ.. వాటిని పోలిన నకిలీ రకాలు మార్కెట్లో వందల సంఖ్యలో ఉంటున్నాయి. సిటీలోని ఇండ్లు, శివారు ప్రాంతాల్లోని గూడెంలలో తయారుచేసి మార్కెట్లోకి పంపిస్తున్నారు. షాపుల నిర్వాహకులకు బ్రాండెడ్‌ కంపెనీలతో పోలిస్తే వీటిపైనే ఎక్కువ లాభం ఉంటుండడంతో వీటినే విక్రయిస్తున్నారు. ఈ రకమైన స్నాక్స్​పై ​బల్దియా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇటీవల జరిగిన బల్దియా కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు ఈ అంశంపై అధికారులను నిలదీశారు. ఆ తర్వాత ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్​అనే ఓ వెహికల్ ని ప్రారంభించి హోటల్స్​ లో నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నారే తప్ప వీటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. 

ట్విట్టర్​ ఫిర్యాదులతో సెటిల్ మెంట్లు

సిటీలో ఏ సమస్య ఉన్నా ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేయండని మంత్రి కేటీఆర్ నుంచి ఉన్నతాధికారులు వరకు సూచిస్తున్నారు. అయితే ఫుడ్ క్వాలిటీపై ట్విట్టర్ ద్వారా వస్తున్న ఫిర్యాదులు సంబంధిత అధికారులకు వరంలా మారాయి. చర్యలు తీసుకోకపోగా ఫిర్యాదు వచ్చిన వెంటనే సంబంధిత హోటల్, రెస్టారెంట్​యజమానులతో మాట్లాడి సెటిల్ మెంట్​చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పైసలు ఇస్తే కంప్లైంట్​క్లోజ్ చేస్తున్నారనే చెప్పుకుంటున్నారు.ఇటీవల కూకట్​పల్లి జోన్​లోని ఓ రెస్టారెంట్ కి సంబంధించి ఫిర్యాదు రాగా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. నిర్లక్ష్యంగా ఉండొద్దని ఫుడ్ సెక్యూరిటీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సీఈఓ అరుణ్ సింఘాల్ ఇటీవల జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో నిర్వహించిన ఓ సమావేశంలో హెచ్చరించారు. వినియోగదారుల నుంచి పొందిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా రేటింగ్ ని ఆయా హోటల్స్​ ప్రదర్శించేలా చూడాలని, రైల్వేస్టేషన్లు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులు, స్కూల్, కాలేజీ క్యాంటీన్లలోని ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని, వీధి వ్యాపారులకు అవగాహన కల్పించాలని ఆదేశించినప్పటికీ జీహెచ్ఎంసీ అధికారులకు అదేం పట్టడం లేదు. ఫుడ్ క్వాలిటీ చెకింగ్​ బాధ్యతలను డీఎంహెచ్ఓలకు కూడా అప్పగిస్తామని మంత్రి హరీశ్​రావు ప్రకటించి వదిలేశారు. వీరికి కూడా ఇస్తే డైలీ తనిఖీలు చేసే అవకాశం ఉంటుంది. 

ఫుడ్ లైసెన్స్​లకే పరిమితం

గ్రేటర్ లో 22 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, ఇద్దరు గెజిటెడ్ ఫుడ్ సేఫ్టీ ఇన్ స్పెక్టర్లు, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఉన్నారు. వీరంతా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూనే.. ఫుడ్ లైసెన్స్ ల కోసం వచ్చే అప్లికేషన్లను పరిశీలించి, అన్నీ సరిగ్గా ఉంటే అప్రూవల్ ఇవ్వాల్సి ఉంది. అయితే వీరు కేవలం ఫుడ్ లైసెన్స్​లకే పరిమితం అవుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్న ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అంతా జూనియర్లు కావడంతో పైఅధికారులు ఏం చెబితే అదే చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నచ్చినవారివి లేదా పైసలు ఇచ్చేవారి అప్లికేషన్లను పరిశీలించకుండానే అప్రూవ్​ చేస్తున్నారని, లేకపోతే ఏదోక సాకుతో పెండింగ్​పెడుతున్నారని సమాచారం. 

‘‘ఈ నెల 1న గుడిమల్కాపూర్ లోని ఓ బార్​లో స్ప్రయిట్ కూల్ డ్రింక్ ఆర్డర్​ఇవ్వగా ఎక్స్ పైర్ అయిన బాటిల్​ఇచ్చారు. బాధితులు వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నాలుగు రోజుల తర్వాత (సోమవారం) అధికారులు వెళ్లి తనిఖీ చేయగా అక్కడ అంతా మంచిగానే ఉన్నాయి. ఫిర్యాదు అందిన వెంటనే తనిఖీలు చేపట్టి ఉంటే ఎక్స్​పైర్​ అయిన బాటిల్స్​దొరికేవి. ఎప్పుడైతే బార్​పై ఫిర్యాదు వెళ్లిందో నిర్వాహకులు జాగ్రత్త పడ్డారని తెలిసింది.’’

అన్నిచూసి లైసెన్స్​లు ఇవ్వాలి

ఫుడ్​ క్వాలిటీపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి. లైసెన్స్ ఇచ్చే టైంలోనే అన్నీ పరిశీలించి ఇవ్వాలి. క్వాలిటీ లేని మెటీరియల్ మార్కెట్​లోకి రాకుండా చూడాలి. పిల్లలు తినే జంక్ ఫుడ్ విషయంలో ఎక్కువ దృష్టి పెట్టాలి. చిన్నారులకు ఫుడ్​పాయిజనింగ్​అవుతుంది దాదాపు ఈ ఫుడ్ తోనే. పాలు, పెరుగు, బ్రెడ్ ఏదైనా ప్యాకింగ్, ఎక్స్​పైరీ డేట్​చూసి తీసుకోవాలి.

- డాక్టర్ విజయ్ భాస్కర్, 
రవి హెలియోస్​ హాస్పిటల్

నిరసన తెలిపినా చర్యల్లేవు

ఫుడ్ సేఫ్టీపై అధికారులు దృష్టి పెట్టాలి. డీఎంహెచ్ఓలకు ఫుడ్ క్వాలిటీ చెకింగ్​బాధ్యతలు ఇస్తామని ఇవ్వలేదు. ఈ అంశంపై సమావేశం ఏర్పాటు చేయమని కోరాం. స్పందన లేదు. చిన్నారులు తినే స్నాక్స్ విషయంపై కౌన్సిల్ సమావేశంలో నిరసన తెలిపినా పెద్దగా పట్టించుకోవడంలేదు. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలి.

- శ్రావణ్, మల్కాజిగిరి కార్పొరేటర్