కోహ్లీ సేన ఆర్మీ క్యాప్స్‌ పై పాకిస్తాన్‌ వక్రబుద్ధి

కోహ్లీ సేన ఆర్మీ క్యాప్స్‌ పై పాకిస్తాన్‌ వక్రబుద్ధి

వెలుగు: పుల్వామా మిలిటెంట్‌ దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు నివాళిగా రాంచీ వన్డేలో టీమిండియా ఆర్మీ క్యాప్స్‌ ధరించి బరిలోకి దిగడాన్ని పాకిస్తాన్‌ కు చెందిన కొందరు నాయకులు ఆర్మీ క్యాప్స్‌ విషయాన్ని రాజకీయం చేసి తమ వక్రబుద్ధి బయటపెట్టుకున్నారు. ఆర్మీ క్యాప్స్‌ ధరించిన టీమిండియాపై ఐసీసీ తక్షణమే చర్యలు తీసుకోవాలని పాక్‌ విదేశాంగ శాఖ మంత్రి షా మెహమూద్‌ కురేషి అన్నారు. ఇండియన్‌ టీమ్‌ మిలటరీ క్యాప్స్‌ ధరించి మ్యాచ్‌ ఆడడం ప్రపంచం మొత్తం చూసిందని, ఐసీసీకి కూడా ఈ విషయం తెలుసన్నారు. పీసీబీ రంగంలోకి దిగకమునుపే బీసీసీఐపై ఐసీసీ చర్యలు తీసుకోవాలని కురేషి డిమాండ్‌ చేశారు. పాక్‌ సమాచార శాఖ మంత్రి ఫవాద్‌ చౌదరి కూడా కురేషికి వంత పాడారు. కోహ్లీ సేన ఆర్మీ క్యాప్‌ ధరించిన ఫొటోను ట్వీట్‌ చేసిన ఫవాద్‌ .. ఇది కేవలం క్రికెట్‌ కాదు. ఇండియా టీమ్‌ ఇలాంటి పనులు ఆపకపోతే, కశ్మీర్‌ లో ఇండియా చేస్తున్న ఆగడాలు ప్రపంచానికి తెలియజెప్పేందుకు పాక్‌ క్రికెట్‌ టీమ్‌ నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగుతుందని ఆ ట్వీట్‌ లో రాసుకొచ్చారు. అంతేకాక బీసీసీఐ తీరు పట్ల ఐసీసీకి తెలిసేలా పీసీబీ ఆందోళన చేయాలని ఆయన సూచించారు.