ఇక్రిశాట్‌లో ప్రధాని మోడీ

ఇక్రిశాట్‌లో ప్రధాని మోడీ

భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన హైదరాబాద్‌లో కొనసాగుతోంది. మోదీ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా పఠాన్‌చేరులోని ఇక్రిశాట్‌కు హెలికాప్టర్‌లో చేరుకున్నారు. ఇక్రిశాట్ కు చేరుకున్న  ప్రధాని మోడీ అక్కడ జరుగుతున్న గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్నారు. ఇక్రిశాట్ శాస్త్రవేత్తల పరిశోధనలను పరిశీలిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో రైతులు ఆదాయం పెంపు ఎలా అనే దానిపై పలు రాకల ప్రజెంటేషన్లు చేశారు సైంటిస్టులు. వర్షపు నీటి వినియోగంపైనా ప్రధానికి వివరించారు. వర్షపు నీటితో రైతుల ఆదాయం భారీగా పెంచే అవకాశముందని వీడియో ప్రజెంటేషన్ చేశారు శాస్త్రవేత్తలు. ప్రధాని వెంట కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు.  

ఇక్రిశాట్ పటాన్ చెరు సమీపంలో ఏర్పాటైన అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం. ఈ సెంటర్ ఏర్పాటు చేసి 50 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఎన్నెన్నో ఆవిష్కరణలు, ఇంకెన్నో కొత్త పద్ధతులను అందించిన సంస్థ ఇది. సమశీతోష్ణ మండలాల్లో పంటల సాగుకు సంబంధించి ప్రత్యేకంగా పని చేస్తుంటుంది ఈ సంస్థ. డ్రైలాండ్స్ లో నీటి వసతి తక్కువున్న చోట కూడా పంటల సాగు, కొత్త వంగడాల సృష్టి, తక్కువ ఎరువులు, తక్కువ నీటితో పంటలను పండించే విధానాలపై ఎన్నెన్నో అధ్యయనాలను, కొత్త ఇన్నోవేషన్స్ ను ప్రపంచానికి అందించింది ఇక్రిశాట్. 

అయితే ప్రధాని పర్యటనలో కేసీఆర్ ఎక్కడా కనిపించలేదు. ప్రధాని మోదీకి జీఎంఆర్ ఎయిర్ పోర్టులో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. తలసానితో పాటు సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి సైతం ప్రధానికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. తొలుత సీఎం కేసీఆర్ ప్రధాని హైదరాబాద్ పర్యటన ఆద్యంతం.. వెంటే ఉంటారని సీఎంవో వర్గాలు తెలిపాయి. అయితే ప్రస్తుతం కేసీఆర్‌ స్వల్ప జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. 

ఇవి కూడా చదవండి:

లతా మంగేష్కర్ ఆరోగ్యం విషమం