యూపీ రోడ్ యాక్సిడెంట్ పై ప్రధాని మోదీ సంతాపం

యూపీ రోడ్ యాక్సిడెంట్ పై ప్రధాని మోదీ సంతాపం

సంతాపం తెలిపిన రాహుల్ గాంధీ, మాయావతి, అఖిలేశ్
న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్ లోని ఔరయాలో జరిగిన రోడ్ యాక్సిడెంట్ లో వలస కూలీలు చనిపోయిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ‘ఔరయా రోడ్డు ప్రమాదం చాలా బాధాకరం. ప్రభుత్వం సహాయక చర్యల్లో నిమగ్నమైంది. ఆ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు, గాయపడి కోలుకుంటున్న వారికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా’ అని మోదీ ట్వీట్ చేశారు. మోదీతోపాటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, యూపీ మాజీ సీఎం అఖిలేశ్​యాదవ్ కూడా సంతాపం తెలిపారు. పోలీసుల ప్రకారం.. యూపీలోని ఔరయా వద్ద శనివారం తెల్లవారు జామున 3 గంటల 15 నిమిషాలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ట్రక్కులు ఢీకొన్న ఈ ఘటనలో 24 మంది చనిపోగా.. మరో 36 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారికి అందుబాటులో ఉన్న అత్యున్నత వైద్య సదుపాయం అందించాల్సిందిగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. అలాగే ఈ ఘటనపై పూర్తి దర్యాప్తునకు ఆదేశించారు. ‘వలస కూలీల ప్రమాద ఘటన దురదృష్టకరం. చనిపోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నా’ అని యోగి ట్వీట్ చేశారు.

‘ఔరయా యాక్సిడెంట్ న్యూస్ చాలా బాధను కలిగించింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచెబుతున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘వలస కూలీలకు సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తామని శుక్రవారం యూపీ సీఎం యోగి అనడం టీవీలో చూశా. అంటే దానర్థం అధికారులు గ్రౌండ్ లెవల్ లో అమలు చేయడం లేదనే కదా. ఇలాంటి వాటి వల్లే పెద్ద యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇది దురదృష్టకరం. ప్రభుత్వం బాధితులకు తగిన సౌకర్యాలు కల్పించడంతోపాటు వారిని ఆర్థికంగా ఆదుకోవాలి’ అని మాయావతి ట్వీట్ చేశారు. ‘ఔరయా ప్రమాదంలో చనిపోయిన వారి కోసం ప్రార్థిస్తున్నా. ప్రతిదీ తెలిసిన్పటికీ, ఇందుకు కారణమైన హృదయం లేని వారు, అలాగే వారి మద్దతుదారులు నిశ్శబ్దంగా ఉండే దాకా.. ఈ నిర్లక్ష్యాన్ని సమర్థించే వరకూ చూద్దాం. ఇలాంటి మరణాలు ప్రమాదాలు కావు, అవి హత్యలే’ అని అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు.