2019 తర్వాత మళ్లీ చాన్నాళ్లకు చైనాకు ప్రధాని మోదీ.. ఆగస్ట్ 31న చైనాకు..

2019 తర్వాత మళ్లీ చాన్నాళ్లకు చైనాకు ప్రధాని మోదీ.. ఆగస్ట్ 31న చైనాకు..

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటన ఖరారైంది. ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 1 వరకూ చైనాలో టియాంజిన్లో జరగబోయే షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్కు మోదీ హాజరుకాబోతున్నారు. అరుణాచల్ ప్రదేశ్ దగ్గర చైనా-భారత్ సరిహద్దు విషయంలో ఘర్షణలు నెలకొన్న క్రమంలో ప్రధాని మోదీ 2019 నుంచి చైనాలో పర్యటించలేదు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొనగా.. ఆ సమయంలో పాకిస్తాన్కు చైనా మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్‎తో సరిహద్దు వివాదంపై చైనా ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. భారత్‎తో సరిహద్దు వివాదం సంక్లిష్టమైనదేనని, కానీ సరిహద్దు విభజన సమస్యల పరిష్కారం కోసం చర్చలకు సిద్ధమని ప్రకటించింది. ఈ పరిణామాల తర్వాత ప్రధాని మోదీ చైనా టూర్ ఖరారు కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

ఇండియా, చైనా మధ్య ట్రేడ్ వార్ కూడా నడిచింది. భారతదేశానికి ఎగుమతి చేసే రేర్ ఎర్త్ మాగ్నెట్స్‌‌, ఎరువుల సంబంధిత ప్రొడక్ట్‌‌లపై చైనా రిస్ట్రిక్షన్లు పెట్టింది. భారత ప్రభుత్వం ఈ దేశం నుంచి చేసుకునే ఆరు కీలక రసాయన దిగుమతులపై యాంటీ -డంపింగ్ సుంకాలు విధించింది. స్పెషాలిటీ ఎరువుల దిగుమతులపై ఒత్తిడి పెంచుతోంది. ప్రస్తుతం చైనాతో ఇండియాకు సుమారు 99.2 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8.5 లక్షల కోట్ల)  ద్వైపాక్షిక వాణిజ్య లోటు ఉంది. దీనిని తగ్గించుకునే పనిలో మన ప్రభుత్వం ఉంది.

చైనా నుంచి చౌకగా వచ్చే రసాయనాలు భారత మార్కెట్‌ను ముంచెత్తి స్థానిక పరిశ్రమలను దెబ్బతీస్తున్నాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ (డీజీటీఆర్‌‌‌‌) తాజాగా నిర్ధారించింది. దీనిపై వాణిజ్య మంత్రిత్వ శాఖ వేగంగా చర్యలు తీసుకుంది. కిలోకు 20.87 డాలర్ల నుంచి టన్నుకు 2,000 డాలర్ల వరకు అదనపు సుంకాలు విధించింది. ఈ సుంకాలు తదుపరి ఐదేళ్లు అమలులో ఉంటాయి. ఫెర్టిసైడ్‌‌ హెర్బిసైడ్ ఉత్పత్తికి కీలకమైన పీడీడీఏపై   టన్నుకు 2,017.9 డాలర్ల వరకు (రూ.1.7 లక్షలు) యాంటీ డంపింగ్‌ డ్యూటీని ప్రభుత్వం విధించింది.